Kolkata law student case: కోల్‌కతాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై క్యాంపస్‌లోనే సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన బెంగాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి విద్యార్థినిపై క్యాంపస్‌లోని గార్డు రూంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా మాజీ విద్యార్థి, టీఎంసీ స్టూడెంట్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు జైబ్ అహ్మద్, ప్రమీత్ ముఖర్జీలు అత్యాచారానికి ఒడిగట్టారు.
కస్బా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 25 రాత్రి 7.30 నుండి రాత్రి 10.50 గంటల మధ్య కళాశాల ఆవరణలో ఈ సంఘటన జరిగింది. ప్రధాన నిందితుడైన మిశ్రా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనకు అప్పటికే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా వినిపించుకోకుండా ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. తన ప్రియుడిని చంపేస్తానని బెదిరిస్తూ, తనను లోపల బంధించి దాడికి పాల్పడినట్లు చెప్పింది.
Read Also: PUBG Love Affair : ’55 ముక్కలుగా నరుకుతా”.. భర్తను బెదిరించిన ప్రేమలో మునిగిన భార్య
సెక్స్ చేయాలనే ఉద్దేశ్యంతో వారు నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఏడుస్తూ, కాళ్లుపట్టుకుని బతిమిలాడినా కూడా వినిపించుకోలేదని, శ్వాస ఆడని స్థితిలో ఆస్పత్రికి తీసుకెళ్లానని కోరినా వినిపించుకోలేదని చెప్పింది. నిందితులు తనను బలవంతంగా గార్డ్ రూంలోకి తీసుకెళ్లి, బట్టలు విప్పించి, బలవంతంగా అత్యాచారం చేశారని ఆరోపించింది. దీనిని మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి, బ్లాక్‌మెయిల్ చేశారని చెప్పింది. తనకు న్యాయం కావాలని ఫిర్యాదులో పేర్కొంది. చివరకు సాయంత్రం తనను బయటకు వెళ్లడానికి అనుమతించారని చెప్పింది.
ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించింది. చైర్‌పర్సన్ విజయ రహత్కర్ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు, కాలపరిమితితో దర్యాప్తు చేయాలని కోరారు.