Big News : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఎస్‌వోటీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 10వ తరగతి చదువుతున్న బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే సహస్రను దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలతో గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం, బాలుడు ముందే దొంగతనానికి ప్రణాళిక వేసుకున్నాడు. సహస్ర ఇంట్లోకి వెళ్లి దేవుడి వద్ద ఉన్న హుండీని పగులగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించాడు. అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్లాలి, ఎలా పారిపోవాలి అనే వివరాలను ‘హౌ టు ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్’ అని ఇంగ్లీష్‌లో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి చేరుకున్నాడు. హుండీని పగులగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూసింది. దాంతో భయపడిన బాలుడు దొంగతనం విషయం తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర హెచ్చరించగా, తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై పొడిచాడు. అంతటితో ఆగకుండా వరుసగా 18 సార్లు కత్తితో దాడి చేసి సహస్రను హత్య చేశాడు. హత్య అనంతరం బాలుడు పక్క బిల్డింగ్‌లోకి వెళ్లి దాదాపు 15 నిమిషాలపాటు దాక్కున్నాడు.
ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో ఎస్‌వోటీ బృందం బాలుడు చదువుతున్న స్కూల్‌కు వెళ్లి విచారణ జరిపింది. మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో, పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో పోలీసులు రాసిన లెటర్, హత్యలో వాడిన కత్తి, రక్తపుమచ్చలతో ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. చివరకు అన్ని ఆధారాలతో బాలుడిని అదుపులోకి తీసుకొని మరింత విచారణ కొనసాగిస్తున్నారు.