Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్ రమణ వద్ద కూలీగా పనిచేసింది. ఆర్థిక లావాదేవీలతో సంబంధించి గొడవల నేపథ్యంలో ఆమె గ్రామానికి వెళ్లిపోయింది. తనకు రావాల్సిన డబ్బుల కోసం రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె పథకం రచించింది. దీనిలో ఆమె కుమారుడు రాజు, మరో బంధువు శ్రీకాంత్, స్నేహితురాలు జ్యోతి పాల్గొన్నారు.
ఈ ముఠా బాలుడిని హనుమకొండలోని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించి అశ్వాపురం తీసుకెళ్లారు. బాలుడి తల్లి ద్వారా రమణను బెదిరించి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాచారు. కిడ్నాప్ సమయంలో బాలుడిని మానసికంగా హింసించారు కూడా.
ఈ నేపథ్యంలో ములుగు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు పారిపోబోయారు. వెంటనే స్పందించిన పోలీసులు పద్మ, రాజు, జ్యోతిలను పట్టుకున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏసీపీ నరసింహారావు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో హనుమకొండ పోలీసులు చూపిన తెలివితేటలపై ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.