కడప జిల్లాగండికోటలోమైనర్ బాలిక హత్య ఉదంతం తేలక మునుపే, పెద్ద చీపాడులో మరో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భార్యను హత్య చేశాడు భర్త. అంతే కాదు శవాన్ని అడవిలో పడేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడుకి చెందిన నల్లబోతుల గోపాల్, సుజాతకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వృత్తిరీత్యా గోపాల్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండేవాడు. వీరికి ఇద్దరు కుమారులు. సాఫీగా సాగుతున్న సంసారంలో భార్య సుజాత నిప్పు రాజేసింది..
సుజాతకు అదే గ్రామానికి చెందిన చెన్నయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కల్లూరుకు చెందిన చెన్నయ్య.. వృత్తిరీత్యా మేస్త్రీగా పనిచేస్తూ పెద్ద చీపాడులో నివాసం ఉంటున్నాడు. సుజాత తల్లిదండ్రులు ఇంటి నిర్మించే క్రమంలో చెన్నయ్యతో పరిచయం ఏర్పడింది. వీరు తరచూ కలుస్తుండడం ఆ నోటా ఈ నోటా భర్తకు తెలిసింది. బంధువులు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించినా సుజాత తీరు మారలేదు. దీంతో గోపాల్ సంసారాన్ని హైదరాబాదుకి మార్చాడు. కొద్దికాలం నివాసం ఉన్న తర్వాత మళ్లీ పెద్ద చీపాడు వైపే సుజాత గాలి మళ్లింది. మళ్లీ వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది..
భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న సుజాతను కత్తితో అతి దారుణంగా నరికి చంపేశాడు. ఆ తరువాత గుర్తు చప్పుడు కాకుండా గోనెసంచిలో వేసుకొని స్కూటీపై తీసుకు వెళ్లి మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలోని ఓ లోయలో పడేసి ఇంటికి వచ్చాడు..
మరుసటి రోజు గోపాల్ కడప పరిసర ప్రాంతాల్లో సంచరించి మైదుకూరులో కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తిరిగాడు. పోలీసులకు సమాచారం అందించి లొంగిపోవాలని ప్రయత్నించాడు. కానీ తనకు తెలిసిన ఒక హోంగార్డు తో విషయాన్ని తెలియజేయడంతో స్టేషన్‌కి వెళ్లి లొంగిపోవాలని సలహా ఇవ్వగా.. చాపాడు పోలీస్ స్టేషన్‌లో చెప్పి లొంగిపోయాడు. పోలీసులు హంతకున్ని వెంటబెట్టుకొని వనిపెంట అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో వెతకగా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం అదే ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా సుజాత మృతదేహం లభ్యమైంది. సుజాత హత్య జరిగి రెండు రోజులు కావడంతో డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో అక్కడే పోస్టుమార్టం చేసి పంచనామా చేశారు. భర్త గోపాల్ పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు…