తెలంగాణ సర్కార్ నాటు సారాను అదుపుచేసేందుకు ప్రయత్నించినా అధికారుల కళ్ళు గప్పి దుండగులు గ్రామాల్లో నాటు సారాను తయారు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో విచ్చల విడిగా గుడుంబా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో గుడుంబా గుప్పు మంటోంది. అయితే మామూళ్ల కోసం తప్ప ఆబ్కారీ శాఖ కన్నెత్తి చూడడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో వి.డి.సి కమిటీ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, గ్రామానికి కూతవేటు దూరంలోనే గుడుంబా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారని గ్రామస్తులు అంటున్నారు. గ్రామ పెద్దల సహకారంతోనే నాటు సారా మాఫియా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. మండల కేంద్రంలోని కొత్తపేట, వడ్డెర కాలనీ, వడ్డేలింగపూర్ గ్రామాల్లో వి.డి.సి. కమిటీ ఆధ్వర్యంలో మద్యానికి, గుడుంబా కేంద్రాలకు టెండర్ ద్వారా వేలం పాడి తయారీ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.