IBomma Ravi Arrested : తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో శ్రమించి పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. రవిని విచారించిన పోలీసులు అతని నెట్వర్క్, వెబ్‌సైట్ నిర్వహణ, పైరసీ వ్యవస్థపై అనేక కీలక సమాచారాన్ని సేకరించారు. 2019 నుంచి ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ భారీ నెట్‌వర్క్‌ను నడిపినందుకు రవి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. థియేటర్‌లలో కొత్తగా విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలోనే వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసే పెద్ద సర్కిల్‌ను అతడు నడిపేవాడని పోలీసులు వెల్లడించారు.
ఆరు సంవత్సరాల కాలంలో వేలాది సినిమాలను పైరసీ చేసి అప్లోడ్ చేయడంతో టాలీవుడ్‌కు దాదాపు 3వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనా. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్‌సైట్‌లపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేశారు. తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
ఐబొమ్మ వెబ్‌సైట్‌కు ప్రధానంగా పని చేసిన రవి, పోలీసులను సవాల్ చేస్తూ “నన్ను పట్టుకోలేరు” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఉదయం రవిని గుర్తించిన సీసీఎస్ ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. రవికి సంబంధించిన ఏజెంట్ల నెట్‌వర్క్, హ్యాండ్లర్‌ల వ్యవస్థపై పోలీసులు మరింతగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రవి ఇచ్చిన సమాచారంతో త్వరలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సీసీఎస్ వర్గాలు చెబుతున్నాయి.