బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో అక్కడ ఉన్న పన్నుల కారణంగా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రమంలో అక్కడి నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకు వచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని కొంత మంది స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. కస్టమ్స్, ఇంటెలిజెన్స్ అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని ల్యాండ్ చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు పట్టుబడుతున్నారు.. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తున్నారు కేటుగాళ్లు. కొంత మంది ప్రైవేట్ పార్ట్‌లలో బంగారం పెట్టి తీసుకునివస్తే, మరికొంత మంది చెప్పులకు, కడుపుకు పూతలా, బెల్టులకు, చెప్పులకు పూతగా కూడా బంగారం పేస్టును పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు తాజాగా కొంత మంది ఐరన్ బాక్స్‌లో బంగారం పెట్టి తీసుకు వచ్చారు…
ఆగస్ట్ 22న శంషాబాద్ ఎయిర్ పోర్టులో కువైట్ నుంచి ఓ విమానం ల్యాండ్ అయింది. ప్రయాణీకులంతా దిగి వెళ్లిపోయారు. ఎవరి బ్యాగులు వాళ్లు తీసుకు వెళ్లారు. ఐతే రెండు బ్యాగులు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. వాటిని ఎవరో అక్కడే వదిలేసి వెళ్లారు. ఆయా బ్యాగులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో అందులో 3.36 కోట్ల రూపాయల విలువైన బంగారం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా బ్యాగులను వదిలేసి వెళ్లిన ఇద్దరు నిందితులతోపాటు మరొకరిని అరెస్టు చేశారు…
ఐతే మొదటి బ్యాగులో 1.25 కోట్ల రూపాయల విలువైన 1261 గ్రాముల బంగారం బయటపడింది. విచారణలో ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని గుర్తించి అరెస్ట్ చేయగా.. తనకు కువైట్‌లో ఒక వ్యక్తి బ్యాగును ఇచ్చినట్లు తెలిపాడు. మరోవైపు రెండో బ్యాగును పరిశీలించినప్పుడు ఇస్త్రీ పెట్టెలో దాచిపెట్టిన 2.11 కోట్ల విలువైన 2,117 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. కడప జిల్లాకు చెందిన మరో వ్యక్తి దీన్ని వదిలేసి వెళ్లినట్లు గుర్తించి ఈ నెల 17న అతన్ని అరెస్టు చేశారు… ఈ రెండు ఘటనలలో.. బంగారాన్ని ఎయిర్ పోర్టు వద్దకు తీసుకు వచ్చి బ్యాగులు వదిలి పెట్టి వెళ్లడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తంగా 4 కోట్ల రూపాయలు విలువచేసే బంగారానికి సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు…