Fraud : భర్త శ్రీధర్‌తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్‌దాస్ సహకారం డబ్బు నిజాయితీగా సంపాదించాలంటే కష్టం.. కానీ మోసం చేసి సంపాదించాలంటే ఈజీ. ఇదే ఫార్ములా అప్లై చేసింది ఆ కిలాడీ లేడి. ఏకంగా బడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుంది. షెల్ కంపెనీలు పెట్టింది.. ఫేక్ వర్క్ ఆర్డర్లు చూపించి వందల కోట్లు కొట్టేసింది. కానీ చివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కిలాడీ లేడీ బాగోతాన్ని బయట పెట్టారు. ఇంతకీ ఆ లేడీ ఎవరు? ఏ విధంగా బడా బాబులను బురిడీ కొట్టించింది?
ఇక్కడ చూడండి.. ఈమెనే ఆ కిలాడీ లేడీ. పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేదు..కానీ తెలివి తేటలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఈమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నిజానికి చూస్తే ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబులను మోసం చేసిన కేసులో ఈమెకు ఆమె భర్త శ్రీధర్‌తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్‌దాస్ సహకరించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు..
సంధ్యారాణి కన్నింగ్ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఈజీ మనీ కోసం ఏకంగా 40 వరకు షెల్ కంపెనీలు పెట్టింది. లేని కంపెనీలు ఉన్నట్లుగా నమ్మించి.. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించింది. వాటిని ఆయా కంపెనీల పేరుతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బులను పలు మ్యూల్ ఖాతాలకు మళ్లించింది. ఇందుకోసం దాదాపు 1800 మ్యూల్ ఖాతాలను ఉపయోగించుకుందంటే మామూలు విషయం కాదు. అలా మ్యూల్ ఖాతాల నుంచి చివరకు తన అకౌంట్లకు డబ్బులను మళ్లించుకుంది. ఇలా ఏకంగా రూ. 500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసిందని పోలీసులు చెబుతున్నారు… ఎంత పకడ్బందీగా చేసినా.. క్రిమినల్స్ ఎక్కడొ ఒక దగ్గర దొరికిపోతుంటారు. సరిగ్గా సంధ్యారాణి విషయంలో కూడా అదే జరిగింది. ఓ ఇండస్ట్రియలిస్ట్ ఫిర్యాదు చేయడంతో సంధ్యారాణి బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఆమెను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు…