Human Sacrifice: ఛత్తీస్‌గఢ్ మూఢనమ్మకాలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ‘నరబలి’ వంటి ఆచారాలకు బలయ్యారు. తాజాగా రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నానమ్మని చంపేశాడు. ఇది నరబలి అని అధికారులు అనుమానిస్తున్నారు. నానమ్మని చంపి, రక్తంతో శివలింగానికి అభిషేకం చేశాడని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నందిని పోలీస్ స్టేషన్ పరిధిలోని నన్‌కట్టి గ్రామంలో చోటు చేసుకుందని ధామ్‌ధా ఏరియా పోలీస్ అధికారి సంజయ్ పుంధీర్ తెలిపారు.
Read Also: Group-1 Candidates: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో విద్యార్థులు
స్థానికుల ద్వారా ఈ సంఘటన గురించి అప్రమత్తం చేయడంతో, పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. బాధితురాలిని 70 ఏళ్ల రుక్మణి గోస్మామిగా గుర్తించారు. బాడీని పోస్టుమార్టంకి తరలించారు. నానమ్మని చంపిన తర్వాత నిందితుడు గుల్షన్ గోస్వామి(30) ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుల్షన్ తన నానమ్మతో కలిసి శివాలయానికి దగ్గరగా ఉన్న గదిలో నివసించే వాడు. ప్రతీరోజూ ఆలయంలో పూజలు నిర్వహించే వాడు. శనివారం సాయంత్రం అతను తన నానమ్మని ఇంట్లో త్రిశూలంతో చంపి, ఆలయంలోని శివలింగంపై ఆమె రక్తాన్ని అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఆలయం నుంచి ఇంటికి వచ్చిన అతను అదే శివలింగంతో పొడుచుకుని తీవ్రగాయాలపాలయ్యాడు. గుల్షన్‌ను రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.