ఆస్ట్రేలియాకు చెందిన ఒక బాలిక కిడ్నాప్ కేసు సుఖంతామైంది. 18 రోజుల తరువాత చిన్నారి క్షేమంగా తల్లిదండ్రులను చేరుకోవడంతో పోలీసులు, అధికారులు, స్థానికులు సంతోషంతో గంతులు వేశారు. ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతానికి చెందిన క్లియో కిడ్నాప్ సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత నెల తల్లిదండ్రులతో కలిసి పిక్నిక్ కి వెళ్లిన క్లియో స్మిత్(4)ను అర్ధరాత్రి టెంట్ లో నుంచి ఒక దుండగుడు ఎత్తుకుపోయాడు. దీంతో తల్లిదండ్రులు క్లియో కోసం పోలీసులను ఆశ్రయించారు. ఎన్నిరోజూలు వెతికినా క్లియో ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. దీనికోసం పోలీసులు సైతం డిటెక్టివ్స్ సాయం తీసుకున్నారు.
సుమారు 18 రోజుల నిరీక్షణ అనంతరం క్లియో స్మిత్ ని దాచిపెట్టిన స్థావరాన్ని పోలీసులు కనుగొన్నారు. పక్కా ప్లాన్ తో ఆ స్థావరాన్ని చుట్టుముట్టి క్లియో స్మిత్ ఉన్న గదిలోకి వెళ్లగా అక్కడ స్పృహలేని స్థితిలో క్లియో కనిపించడంతో పోలీసులు కంటతడి పెట్టారు. అలా ఉన్నా కూడా చిన్నారి తన పేరును, మిగతా వివరాలను దైర్యంగా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం చిన్నారిని వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. క్లియో తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. ముక్కుపచ్చలారని పసికందు కిడ్నాప్ వ్యవహారం ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రస్తుతం క్లియో కనిపించడంతో వారిద్దరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.