వికారాబాద్‌లోని దోమ మండలం ఊటుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో.. ప్రియుడి ఇంటి ముందే ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈసీఐఎల్‌కు చెందిన దీప బంజారాహిల్స్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తోంది. అక్కడే ఈమెకు నవీన్ అనే అబ్బాయితో ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నవీన్ నమ్మించడంతో.. తానే సర్వస్వమని దీప అతడ్ని ప్రేమించింది.
అయితే.. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నవీన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకోనని మొహం చాటేశాడు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే.. రూ. 10 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు దీప కుటుంబ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్లగా.. తాము అడిగినంత కట్నం ఇస్తేనే పెళ్లికి అంగీకరిస్తామని అన్నారు. తామంతా ఇచ్చుకోలేమని దీప కుటుంబీకులు ప్రాధేయపడినా.. నవీన్ ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దీప.. అక్కడే ఉన్న బ్లేడ్ తీసుకొని, గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
వెంటనే దీపను పరిగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు చికిత్స అందించడంతో.. దీప ప్రాణపాయ స్థితి నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.