AP Cyber Crime: తాము పెట్టే పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తాయంటే.. ఎవరైనా.. ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.. కానీ, దాని మాటున మోసం ఉందేమో అని ఒక్క క్షణం ఆలోచించనవారే కంత్రీగాళ్ల బారినపడకుండా ఉంటారు.. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ.. టెలిగ్రామ్ యాప్‌లో మోసగాళ్ల వలలో చిక్కుకుంది.. రూ.100 ఇస్తే.. రూ.400 ఇస్తామంటూ ఆ మహిళను తమ ముగ్గులోకి దింపిన కేటుగాళ్లు.. మొదట చెప్పినట్టుగానే రూ.100కు రూ.400 ఇచ్చారు.. దీంతో.. రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మిన మహిళ.. క్రమంగా పెద్ద మొత్తంలో వారు చెప్పినట్టుగా పంపించింది.. కానీ, డబ్బులు తిరిగిరాకపోవడంతో.. చివరకు ప్రాణాలు తీసుకుంది..
Read Also: Delhi: మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన స్రవంతి అనే 25 ఏళ్ల మహిళ.. ఓ టెలిగ్రామ్ యాప్ లో మోసపోయింది.. నిన్న మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. అది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.. ఆమెకు తేజ ప్రణవి (6), హర్షవర్ధన్ రామ్ ( 4) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే, రూ.100 వేస్తే 400 రూపాయలు వస్తాయని చెప్పిన యాప్ నిర్వాహకులు.. ఈ నెల 17,18 తేదీల్లో రూ.100లు డబ్బులు పంపగా.. 400 రూపాయలు సదరు మహిళకు పంపించారు.. ఇక, రూ.10,000 వేస్తే రెట్టింపు రూ.20,000 వస్తాయని ఆశ చూపారు.. నిజమేనని నమ్మి ఇలా పలు దఫాలుగా రూ.1,35చ000 పోగొట్టుకుంది ఆ మహిళ.. చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.