వందల ఎకరాల భూమి.. ఆ భూమికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు.. వారసులు లేరు.. అయితే తామే వారసులమంటూ ఒక వీలునామ పట్టుకొని ఇద్దరు వచ్చారు. 126 ఎకరాల భూమి తమ పేరు మీద వీలునామా రాసి మా వాళ్లు చనిపోయారంటూ పత్రాలు చూపెట్టారు. పేపర్లు చూసి అధికారులు నమ్మారు.. ఏకంగా 126 ఎకరాల భూమిని వాళ్లకు కట్టబెట్టారు. కానీ వీలునామా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారు..
READ MORE: Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
చేవెళ్ల మండలం పామెనకి చెందిన పట్లోళ్ల ప్రతాప్‌రెడ్డి ఓ భూస్వామి. ఇతనికి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతాప్‌రెడ్డికి వివాహమైనా సంతానం లేదు. పదేళ్ల కిందట భార్య అనసూయ, 2018 అక్టోబరు 9న ప్రతాప్‌రెడ్డి మరణించారు. దూరపు బంధువులు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ఫిరోజ్‌గూడకు చెందిన గుమ్మల జగన్మోహన్‌రెడ్డి అలియాస్ మోహన్‌రెడ్డి, అతని భార్య సురేఖ, వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన పట్లోళ్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామానికి చెందిన ఇందిరాదేవి, గుమ్మళ్ల ప్రసన్న, గుమ్మల అనంత్‌రెడ్డి, గుమ్మల సత్యానారాయణరెడ్డి, గుమ్మల మధుసూదన్‌రెడ్డికి ప్రతాప రెడ్డి భూమిపై కన్ను పడింది. అంతా కలిసి పథకం వేశారు. మోహన్‌రెడ్డి, సురేఖ దంపతులు ప్రతాప్‌రెడ్డికి తల్లి తరఫు బంధువులు. ప్రతాప్‌రెడ్డి తనను దత్తత తీసుకున్నారని, ఆధార్, రేషన్ కార్డులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించాడు. 2018 అక్టోబరు 9న ప్రతాప్‌రెడ్డి మరణించగా.. అంతకు ఏడాది ముందు డిసెంబరు 3న ఆయన ఒక వీలునామా రాశారని.. దాని ప్రకారం మరణాంతరం భూములు, ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఇందుకు రామకృష్ణారెడ్డి, ఇందిరాదేవి సాక్ష్యమని నకిలీ పత్రం సృష్టించాడు.
READ MORE: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
వారసుడినంటూ రెవెన్యూ అధికారులను నమ్మించి.. 50 కిపైగా ఎకరాలను మోహన్‌రెడ్డి, సురేఖ పేరు మీదికి.. మిగిలిన భూమిని ఇతర నిందితుల పేర్ల మీదకు బదలాయించుకున్నారు. ప్రతాప్‌రెడ్డి బ్యాంకు ఖాతాలోని 19 లక్షలు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి తండ్రి తరపు బంధువు పట్లోళ్ల రామేశ్వర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు.. కేసు నమోదు చేసి వీలునామా అసలైందో కాదో తేల్చాలని పోలీసులను ఆదేశించింది.. పోలీసులు మోహన్‌రెడ్డి సమర్పించిన వీలునామాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అది నకిలీదని తేలింది. ప్రతాప్‌రెడ్డి ఇతర సంతకాలతో పోల్చగా ఫోర్జరీ చేసినట్లు బయటపడింది. దీనికితోడు మోహన్‌రెడ్డి 2017కు ముందు తీసుకున్న రేషన్, ఆధార్ కార్డుల్లో తండ్రి పేరు హనుమంతరెడ్డిగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో పోలీసులు మోహన్‌రెడ్డి ఆయన భార్య సురేఖను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.