అనుమానం పెనుభూతమైంది. దీంతో భార్యను అతి కిరాతకంగా చంపేశాడు ఓ భర్త. తిరుపతి మంగళం బొమ్మల క్వార్టర్స్ లో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత అతడు కూడా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. బొమ్మల క్వార్టర్స్‌కు చెందిన ఉషకు.. గంగాధర నెల్లూరు మండలం ఠాణాకు చెందిన లోకేశ్వర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ సమీప బంధువులు. ఉషా, లోకేశ్వర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో కాపురం సజావుగానే కొనసాగింది. ఐతే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి.
READ MORE: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
ఉష కరకంబాడిలోని అమర రాజా ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. BSNLలో కాంట్రాక్ట్ కింద టెక్నీషియన్‌గా పని చేస్తున్న లోకేశ్వర్ భార్యతో నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడు. ఉషపై అనుమానంతో లోకేశ్వర్ తరచూ గొడవపడుతుండడంతో భరించలేక పోయింది. పెళ్లి జరిగినప్పటి నుంచి మద్యం మత్తులో ఉషను వేధించేవాడు భర్త లోకేశ్వర్. ఏ పని చేయకుండా జల్సాలకు డబ్బులు కావాలని తరచూ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. అతని వేధింపులు, అనుమానం భరించలేక కొంతకాలం క్రితం ఉష ఇంటి నుంచి వెళ్లిపోయి తన తల్లితండ్రులతో ఉంటోంది.
READ MORE: MP Mithun Reddy Arrested: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్..
ఆ తర్వాత భర్తతో విడిపోవాలని కోర్టును ఆశ్రయించింది. అయినా లోకేష్ వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఉష. ఈ కేసు సంబంధించి 24వ తేదీన విచారణ ఉంది. దీంతో ఉషను హత్య చేయాలని భావించిన లోకేష్ పక్కా ప్లాన్ వేశాడు. ఉదయం 5 గంటల సమయంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఉష.. కంపెనీ బస్సు కోసం వెళుతుండగా.. భర్త లోకేశ్వర్ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేశాడు. కత్తితో దాడి చేసి చంపాడు. అప్పటివరకు మాటు వేసి భార్య రాక కోసం వెయిట్ చేసిన లోకేశ్వర్.. ఉషను వెంబడించి కత్తితో గొంతు కోసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఉష చనిపోయిన తరువాత.. నేరుగా ఇంటికి వెళ్లి తాడుతో ఉరివేసుకొని లోకేశ్వర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు.. ఇలా ఉష హత్యకు గురికాగా.. లోకేశ్వర్ ఆత్మహత్య చేసుకోని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో పిల్లలు మాత్రం అనాథలుగా మిగిలిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు పోలీసులు డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆమె సంపాదన కోసం నిత్యం నరకం చూపించేవాడని.. ప్రతి చిన్న విషయానికి అనుమానంతో వేధించేవాడని ఉష తండ్రి అవేదన వ్యక్తం చేశాడు. విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తలు ఇద్దరికి సర్దిచెప్పి సంసారం నిలబెట్టాలనుకున్నామని, అయితే ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతాడని ఊహించలేదని ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు.