ఈ మధ్య కాలంలో రేబిస్ మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కుక్క పిల్ల గీరితే ఏమవుతుందిలే అని కొందరు నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పొతున్నారు. గతంలో ఓ కబడ్డీ ప్లేయర్ చిన్న కుక్క పిల్ల కరిస్తే.. నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కొల్పోయాడు. రెండు రోజుల క్రితం రేబిస్ తో చిన్న బాలుడు చనిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఏడూళ్ళ బయ్యారంలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కే తమ ఇంట్లో విషాదాన్ని నింపుతుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేదు. రేబిస్ వ్యాధి సోకి సందీప్( 25) అనే యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
రెండు నెలల క్రితం సందీప్ అనే యువకుడు వీధిలో ఓ కుక్కపిల్లని పెంచుకునేందుకు ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ కుక్క పిల్ల తన తండ్రిని కరవడంతో పాటు తనను కూడా గోర్లతో రక్కింది. దీంతో తన తండ్రికి స్థానిక పిహెచ్సిలో చికిత్స చేయించుకుని.. తనను మాత్రం కరవలేదు కదా అని అజాగ్రత్త వ్యవహరించడంతో.. చికిత్స తీసుకోలేదు సందీప్. వారం రోజుల క్రితం రేబిస్ లక్షణాలు కనిపించి సందీప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. రేబిస్ వ్యాధి సోకిందని డాక్టర్లు తెలపడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు. కుక్క రక్కడమే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించడమే యువకుడి ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.