ఈమధ్య లోన్ యాప్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో అధికారులు వాటిపై పూర్తి దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే కుడుస్, ఎస్ మనీ, రహీనో, పయనీర్ ఫైనాన్స్ కంపెనీలపై ఈడీ కొరడా ఝుళపించింది. రూ. 86 కోట్లు ఫ్రీజ్ చేసి, ఆ కంపెనీలపై విచారణ కొనసాగిస్తోంది. ఈడీ ఇప్పటికే రూ. 186 కోట్ల నగదును ఫ్రీజ్ చేసింది. విచారణలో బాగంగా లోన్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు ఏకంగా రూ. 940 కోట్లను వసూలు చేశాయని, ఈ లావాదేవీలన్నీ భారతదేశ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని తేలింది. ఆ డబ్బంతా హవాల ద్వారా చైనా కంపెనీలు విదేశాలకు తరలించినట్టు తెలిసింది.
మరోవైపు.. లోన్ యాప్స్ వలలో పడి ఎంతోమంది ప్రాణాలు తీసుకోవడంతో హైదారబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి వాటి భరతం పడుతున్నారు. అక్రమ ఆన్‌లైన్ యాప్స్‌పై చర్యలు తీసుకుంటున్నారు. 221 యాప్‌లు చట్టవిరుద్ధమని, వాటిలో చాలా యాప్స్ నకిలీవని తేలడంతో.. వాటిని వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌కు లేఖ రాశారు. ఇంతకుముందు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. తాము కొన్ని చట్టవిరుద్ధమైనవి, నకిలీవి అయిన కొన్ని యాప్స్‌ని గుర్తించామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అలాంటి యాప్స్ మరిన్ని ఉంటే.. వాటిని గుర్తించి, గూగుల్ మేనేజ్మెంట్‌కి తీసుకొస్తామన్నారు.