చికోటి ప్రవీణ్ ని గంటలు తరబడి ఈడీ విచారిస్తుంది .మొదటి రోజు 14 గంటల పాటు విచారించిన ఈడీ.. రెండో రోజు 11 గంటల పాటు విచారించింది. ఇప్పటివరకు 25 గంటల పాటు ఈడీ చికోటి ప్రవీణ్ ను విచారించింది. చికోటి ఆర్థిక లావాదేవులపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశాల్లో క్యాసినో ఆడితే అక్కడి డబ్బుని ఇక్కడికి తీసుకొచ్చారా, లేదంటే కాయిన్స్ అక్కడ ఇచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకున్నారా అనే విషయం మీద ప్రధానంగా విచారణ జరిపింది. అక్కడ ఆట ఆడి ఇక్కడ డబ్బులు తీసుకుంటే అది వాళ్ళకి హవాలా కిందికి వస్తుందని ఈ నేపథ్యంలో అలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది అనే విషయాన్ని ఈడీ ప్రవీణ్ దగ్గర నుంచి రాబట్టింది.
విదేశీ క్యాసినోల వ్యవహారంలో ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, దాసరి మాధవరెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు వరుసగా రెండో రోజూ విచారించాయి. తొలిరోజు దాదాపు 14 గంటలపాటు ఈడీ కార్యాలయంలోనే గడిపిన వీరిద్దరూ.. రెండో రోజు దాదాపు పది గంటల విచారణ తర్వాత మాధవరెడ్డి వెళ్లిపోగా, ప్రవీణ్ విచారణ మూడో రోజు కూడా కొనసాగుతోంది. రెండో రోజు ప్రధానంగా హవాలా లావాదేవీలపైనే ఈడీ అధికారులు వీరిని విచారించారు. క్యాసినోలో ఇచ్చే టోకెన్లకు సంబంధించిన డబ్బు మార్పిడి ఎలా జరిగేదనే విషయమై ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.
క్యాసినోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పంటర్లు రూ.కోట్లలో జూదం ఆడినట్లు ఈడీ అనుమానిస్తోంది. వీరిలో కీలక ప్రజాప్రతినిధులతోపాటు సంపన్న వ్యాపారులున్నట్లు ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. ఆ లావాదేవీల గుట్టుతేల్చే పనిలో భాగంగానే ఈడీ బృందాలు ప్రవీణ్, మాధవరెడ్డిల బ్యాంకు ఖాతాలతోపాటు పంటర్లను తరలించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానాల వ్యవహారం గురించి ఆరా తీశాయి. ఈ విషయాల గురించి ఈడీ అడిగిన ప్రశ్నలకు పలు సందర్భాల్లో వారిద్దరూ తడబడినట్లు సమాచారం. మరోవైపు క్యాసినో ప్రచారం కోసం సినీతారలకు ముట్టజెప్పిన పారితోషికాన్ని ఏరూపంలో ఇచ్చారని ప్రశ్నించగా, ప్రవీణ్ పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఆడంబరమైన జీవితం గడుపుతూ ఆ దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేస్తూ వచ్చిన ప్రవీణ్‌కు ఇప్పుడా దృశ్యాలే సమస్యలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. వాటికి ఖర్చు చేసేందుకు వినియోగించిన సొమ్మును ఎలా సంపాదించారని ఈడీ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న బ్యాంకు ఖాతాల వివరాలను ప్రవీణ్ అధికారులకు చూపించగా, అందులోని తేడాల గురించి వారు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రవీణ్ బర్త్‌డే పార్టీకి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టుగా మీడియాలో వచ్చిన వార్తల్ని ఈడీ అడిగినట్టు తెలుస్తోంది. చిట్‌ఫండ్ కంపెనీతో సంబంధం లేదనీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు చీకోటి ప్రవీణ్‌తో ఆర్థిక సంబంధాలున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ మాజీ ఎమ్మెల్యేకు వరంగల్ జిల్లాలోని ఓ చిట్‌ఫండ్ కంపెనీలో భాగస్వామ్యం ఉందని.. ఆ కంపెనీ సొమ్మును ప్రవీణ్ ద్వారా హవాలా మార్గంలో తరలించారనే పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఆ విషయమై ఈడీ ప్రవీణ్ వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. ఆ కంపెనీతో తనకెలాంటి సంబంధం లేదని ప్రవీణ్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు విచారణలో భాగంగా రెండో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. మీడియా అతిగా ఊహించుకుంటోందని వ్యాఖ్యానించారు. పది ఛానెళ్లలో పది రకాలుగా చూపిస్తున్నారని, నిజాలు నిదానంగా బయటకు తెలుస్తాయని తెలిపారు. తన పేరిట ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నారని, వాటిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు.
క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చికోటి ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేస్తోంది.ఈ క్రమంలోనే చికోటి ప్రవీణ్ ట్వీట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చికోటి ప్రవీణ్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు తెలిసింది. @praveenchikotii పేరుతో ట్విట్టర్‌లో నకిలీ ఖాతాను గుర్తించాడు చికోటి ప్రవీణ్. వాటి ద్వారా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నేతలను ప్రవీణ్ బెదిరిస్తున్నట్టు.. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం ఆయా ట్వీట్లలో ప్రస్తావిస్తు ఫేక్ పోస్ట్‌లు పెట్టినట్లు సమాచారం. సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు చికోటి ప్రవీణ్. తప్పుడు ఫేక్ అకౌంట్‌లపై చర్యలు తీసుకుంటానని పేర్కొన‍్నాడు. ఆయా నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని.. సీసీఎస్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు ప్రవీణ్. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చికోటి ప్రవీణ్ బుధవారం ఫిర్యాదు చేశాడు. తన పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నకిలీ ఖాతాలతో తన పేరుపై సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్ట్ లు చేస్తున్నారంటూ తెలిపాడు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని పోలీసులను కోరినట్లు చీకోటి వెల్లడించాడు. ఫేక్ అకౌంట్ వల్ల తాను చాలా మానసిక ఒత్తిడికి గురతున్నానని పేర్కొన్నాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తనకు పరిచయమే లేదని చెప్పాడు. దీని వెనుక ఏపీకి చెందిన కొందరు నాయకులు చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. కొందరు నాయకులు అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసని చికోటి తెలిపాడు. రాజకీయాలకు తనకు ముడిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఖాతాల విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు.