NTV Telugu Site icon

East Godavari: ప్రాణాలు తీసిన ఫ్లెక్సీలు.. నలుగురు స్పాట్‌ డెడ్‌

Undrajavaram

Undrajavaram

East Godavari: ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు యువకుల ప్రాణాలు కోల్పోయారు.. విగ్రహావిష్కరణ ఇప్పటికే వివాదాస్పదం కాగా.. విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.. అయితే, గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఆది నుండి వివాదాల మయమైంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.. చివరికి జిల్లా కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారుల చొరవతో సమస్య తీరింది. ఎట్టకేలకు సోమవారం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు. ఈ ఏర్పాట్లే నలుగురి ప్రాణాలను బలిగొంది.

Read Also: Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు..

భారీ ఏర్పాట్ల నేపథ్యంలో ఫ్లెక్సీలు కడుతున్న నలుగురు యువకులకు కరెంట్ షాక్ తగలడంతో స్పాట్‌లోనే మృతిచెందారు.. మృతులను బొల్లా వీర్రాజు (25), కాశగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ పెద్దయ్య(29)గా గుర్తించారు.. ఘటనా స్థలంలోనే నలుగురు యువకులు మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి.. మరో వ్యక్తి కోమటి అనంత రావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటలకు జరిగిన ఈ ఘటనతో గ్రామంతో పాటు యావత్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.