ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే ఆఫర్ వస్తే.. ఎవరు వదులుకుంటారు చెప్పండి? దీనికితోడు నిరుద్యోగ సమస్య ఒకటి. ఈ రెండింటిని (ఆశ, నిరుద్యోగం) ఆసరాగా తీసుకొని, ఓ ప్రైవేట్ కంపెనీ వందల మందికి కుచ్చటోపీ పెట్టింది. వారి వద్ద నుంచి కోట్లు దండుకొని, పత్తా లేకుండా మాయమైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఆ సంస్థ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తమది యూఎస్ బేస్డ్ కంపెనీ అని, ఇంట్లోనే కూర్చొని నెలకు రూ. 3 లక్షలు సంపాదించొచ్చని ఆశ చూపించింది. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, కేవలం పుస్తకాలను స్కాన్ చేసి పంపిస్తే చాలని పేర్కొంది. అయితే.. ఈ ఉద్యోగం పొందేందుకు రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ పెట్టింది. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికింది. పనేమో సులభం, జీతం రూ. 3 లక్షలు, పైగా వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇన్ని సౌకర్యాలున్నప్పుడు లక్షన్నర ఇవ్వడంలో తప్పులేదనుకొని, దాదాపు వెయ్యి మంది సభ్యులు వాళ్లు చెప్పినట్టు డబ్బులు డిపాజిట్ చేశారు.
ఇలా ఆ కంపెనీ వెయ్యి మంది నుంచి ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది. కట్ చేస్తే.. మూడు నెలలు గడిచినా, తాము చేసిన పనికి ఆ సంస్థ డబ్బులు చెల్లించలేదు. ఏంటని ప్రశ్నిద్దామని చూస్తే, ఆలోపే ఆ కంపెనీ జెండా ఎత్తేసింది. దీంతో.. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. వాటిని ఖాతరు చేయకుండా జనాలు మోసాలకు గురవుతూనే ఉన్నారు.