ఆ దంపతులిది బుధవారం వివాహ వార్షికోత్సవం. ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని భావించారు. కానీ అదే వారికి చివరి రోజు అని గమనించలేకపోయారు. ఇంట్లో నుంచే మృత్యువు ఎదురొస్తుందని ఆ జంట గమనించలేకపోయారు. తెల్లారేసరికి శవాలుగా మారిపోయారు. ఈ ఘటనలో కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు హత్యకు గురయ్యారు. మృతులు భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. కుమారుడు రాజేష్ ఉదయం 5 గంటలకు మార్నింగ్ వాక్‌కు వెళ్లాడని, ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు, సోదరి మృతదేహాలు పడి ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించారు. అగంతకులు వచ్చినట్లు ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో కుమారుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ముగ్గురిని తానే చంపినట్లుగా ఒప్పుకున్నాడు. తన తండ్రి పదే పదే అవమానించడం, తిట్టడం వల్లే చంపేసినట్లు రాజేష్ తెలిపాడు. తోబుట్టువులతో పోల్చి పదే పదే అవమానించడం జీర్ణించుకోలేకపోయినట్లు నిందితుడు వెల్లడించారు. మొత్తానికి కని పెంచి.. పెద్ద చేస్తే.. కడుపున పుట్టినోడి చేతిలో హతం కావడం అత్యంత దారుణంగా చెప్పొచ్చు.