Cyber Crime: డబ్బులు ఎరగావేసి.. ఆఫర్ల పేరుతో.. ప్రముఖుల పేర్లతో.. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు.. ఆదమరిస్తే చాలు.. అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి గ్రామానికి చెందిన బిడ్డిక సోమేష్ అనే గిరిజన యువకుడు సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కాడు. యూట్యూబర్ హర్షసాయి హెల్పింగ్ టీమ్ అంటూ.. గిరిజనుడికి కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు.. హర్షసాయి సహాయ కేంద్రం నుండి 3 లక్షల రూపాయలు సహాయం చేస్తామని నమ్మబలికిన మోసగాళ్లు.. ఆ సొమ్మును బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తాం.. మీ బ్యాంకు వివరాలు చెప్పాలని కోరారు..
Read Also: Panjagutta PVR: పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం.. ‘కల్కి’ షో నిలిపివేత!
దీనికోసం వాట్సాప్ లో లింక్‌పంపిన కేటుగాళ్లు.. బ్యాంక్ అకౌంట్ వివరాలా నిర్ధారణ కోసం 1150 రూపాయలు వేయాలని సూచించారు.. రూ.1150 వేసిన వెంటనే లక్ష రూపాయలు బాధితునికి ఫోన్ పే ద్వారా వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు.. డబ్బులు జమ కాకపోవడంతో.. కాస్త అనుమానం వ్యక్తం చేసిన యువకుడికి జీఎస్టీ లేకపోవడం వలన డబ్బులు జమ అవ్వడం లేదని 2570 రూపాయలు ఒకసారి 9330 రూపాయలు ఒకసారి వేస్తే డబ్బులు జమ అవుతాయని మళ్ళీ నమ్మబలికారు.. ఆ ముఠా.. కేటుగాళ్ల మాటల గారడీలో పడి.. వాళ్లు అడిగిన డబ్బులు పంపించాడు యువకుడు.. ఆ సొమ్మును పంపించిన మరుక్షణం తమ వాట్సాప్ పేరు, డీపీ ఐపీఎస్ రాహుల్ శర్మ గా మార్చేసి.. నేను పోలీస్ ఉన్నతాధికారిని అంటూ.. తిరిగి బాధితుడినే బెదిరించారు.. ఇక, మోసపోయానని గుర్తుంచిన సోమేష్.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.