Rain Drops in Panjagutta PVR: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పంజాగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్‌లో వర్షపు నీరు పడింది. థియేటర్ పైకప్పు నుంచి ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చూస్తున్న ప్రేక్షకుల మీద నీటి చుక్కలు పడ్డాయి. దాంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వర్షపు చుక్కలు పడుతుండడంతో కొందరు ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చారు.
పీవీఆర్ థియేటర్‌లో వర్షం నీరు పడుతున్నా.. నిర్వాహకులు మాత్రం కల్కి షోను నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ.. ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. అయినా కూడా యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఇష్టం ఉన్నవాళ్లు సినిమా చూడండి, లేదంటే వెళ్లిపోవచ్చు అంటూ వెటకారపు సమాధానం ఇచ్చారు. దీంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై థియేటర్ యాజమాన్యం కల్కి షోను నిలిపివేశారు. తమ టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు ప్రేక్షకులు ఆందోళన చేశారు.
Also Read: Mukesh Ambani-Virat Kohli: అంబానీ సర్.. మీరు విరాట్ కోహ్లీని కొనలేరు!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’. జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగిన సినిమా లేదు కాబట్టి.. ఈ వసూళ్ల హవా ఇంకా కొనసాగనుంది. కల్కి టికెట్ ధరలు సాధారణ స్థాయికి రావడంతో.. రెండోసారి మూవీని చూసేందుకు ఫాన్స్ ఆసక్తి చూపుతున్నారు.