Credit Card Frauds : హైదరాబాద్ నగరంలో కొత్తగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులు వాడుతున్న వారినే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ఫిషింగ్, నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, రివార్డ్ పాయింట్లు పేరుతో SMS లు, ఇలా ఎన్నో పద్ధతుల్లో ప్రజల బ్యాంకు అకౌంట్ వివరాలు, OTP లను దొంగిలిస్తున్నారు.
తమ క్రెడిట్ కార్డుతో ఆన్‌లైన్ కొనుగోలు చేసే వారే సైబర్ క్రిమినల్స్ టార్గెట్. నకిలీ మర్చెంట్ వెబ్‌సైట్ల లింకులను SMS లేదా ఇమెయిల్ రూపంలో పంపుతున్నారు. అవి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించేలా తయారు చేస్తారు. ఆ లింక్‌లోకి లాగిన్ అవుతూనే యూజర్ కార్డ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతున్నాయి. ‘‘మీ కార్డ్‌లో 10,000 రివార్డ్ పాయింట్లు ఉన్నాయి, వాటిని రీడీమ్ చేసుకోండి’’ లేదా ‘‘మీ క్రెడిట్ లిమిట్ పెంచుతాం’’ అనే SMS, కాల్స్ ద్వారా ప్రజలను నమ్మిస్తారు. ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లతో మాట్లాడే వారు నిజమైన బ్యాంక్ అధికారుల్లా ప్రవర్తిస్తారు. కార్డ్ నంబర్, CVV, OTP అడిగి, సెకన్లలో ఖాతా ఖాళీ చేస్తారు.
ఇంకో కొత్త పద్ధతి — క్లాసిఫైడ్ సైట్లలో ఫేక్ బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్లు ప్రచురించడం. ప్రజలు సమస్య పరిష్కారం కోసం ఆ నంబర్‌కు కాల్ చేస్తే, అదే సైబర్ నేరగాళ్ల జాలంలో పడిపోతారు. ఇలా అనేకమంది మోసపోతున్నారు. కొన్ని సందర్భాల్లో “మీ బ్యాంక్ యాప్ కొత్త వెర్షన్ విడుదలైంది, వెంటనే అప్డేట్ చేసుకోండి” అని SMS పంపుతారు. అందులో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేస్తే నేరగాళ్లకు యూజర్ ఫోన్ కంట్రోల్ దక్కుతుంది. తర్వాత బ్యాంక్ యాప్ పాస్‌వర్డ్‌లు, OTPలు, కార్డ్ వివరాలు సులభంగా దొరుకుతాయి.
రెండు రోజులుగా CCS సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల క్యూలు తగ్గడం లేదు. ఎక్కువ ఫిర్యాదులు క్రెడిట్ కార్డ్ మోసాల గురించే వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి లింక్ అయినా క్లిక్ చేసేముందు రెండు సార్లు ఆలోచించాలని, అపరిచిత నంబర్లకు OTPలు, కార్డ్ వివరాలు చెప్పొద్దని సూచిస్తున్నారు.
బ్యాంక్ పేరు చెప్పి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మవద్దన, OTP, CVV నంబర్ ఎవరితోనూ పంచుకోవద్దని, అధికారిక బ్యాంక్ యాప్‌లు, వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే బ్యాంక్‌కి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930) కి సమాచారం ఇవ్వాలని, క్రెడిట్ కార్డ్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. చిన్న అప్రమత్తతే పెద్ద నష్టాన్ని తప్పించగలదని అధికారులు చెబుతున్నారు.
Dude : డ్యూడ్ సినిమాలో మెరిసిన వివాదాస్పద హీరోయిన్.. ఎవరంటే?