Crime News: తండ్రి.. పుట్టిన ప్రతి బిడ్డకు మొదటి గురువు.. రోల్ మోడల్.. ఎన్ని కష్టాలు ఉన్నా ఆయన ఉన్నాడనే ధైర్యం. అతనే నమ్మకం.. కానీ, కొంతమంది తండ్రుల వలన నాన్న అనే పదానికి మచ్చ ఏర్పడుతోంది. ఒక ఆడపిల్ల తండ్రితో కలిసి ఒంటరిగా ఉండాలన్నా, హత్తుకోవలన్నా భయపడే దుస్థితికి తీసుకొచ్చారు. తండ్రి అనే బంధం మనసులో నుంచి తీసి తండ్రి కూడా ఒక మగాడే అని అమ్మాయిలు గుర్తించుకొనే స్థాయికి వచ్చారు. కామంతో కొట్టుకుంటూ కన్న కూతుర్లను కూడా వదలకుండా అత్యాచారం చేస్తున్న కీచకులను ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. అలాంటి ఒక కీచకుడుకు కోర్టు సరైన శిక్ష విధించింది. ఆ కీచకుడు చచ్చేవరకు జైల్లోనే ఉంచాలని ఆదేశించింది. 2017 లో లాలాపేట పరిధిలోని నల్ల చెరువులో గర్భం దాల్చిన యువతి ఆత్మహత్య కేసులో తండ్రే హంతకుడని ఋజువు కావడంతో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా లాలాపేట పరిధిలో మహంకాళి నాగరాజు అనే వ్యక్తి కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఇక ఆమెపై కొన్ని నెలల క్రితం ఈ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి కన్నా కూతురు అనే విచక్షణ లేకుండా ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం జరిపాడు. దీంతో కూతురు గర్భం దాల్చింది. ఈ విషయం తెలియడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. ఇక తండ్రి అరాచకాలను తట్టుకోలేని యువతి ఎదురుతిరగడంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు నాగరాజు. ఇక ఈ బాధలు భరించడం కంటే చావే నయం అనుకున్న యువతి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. కూతురి మరణం కూడా ఈ కసాయివాడిని కరిగించలేకపోయింది. కూతురు ఆత్మహత్య కేసు కాకుండా ఆమెకు మతిస్థిమితం లేదని కోర్టును నమ్మించాడు. ఇక నాగరాజుపై అనుమానం వచ్చిన కోర్టు మృతురాలి గర్భంలో పిండానికి డీఎన్ఏ టెస్ట్ చేసి చూడగా అసలు గుట్టు బయటపడింది. ఇంత దారుణానికి పాల్పడిన నాగరాజు పై కోర్టు మండిపడింది. నిందితుడును చచ్చేవరకు జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి సీతా రామకృష్ణ రావు తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన గుంటూరు లో సంచలనంగా మారింది.