AP Crime: సెల్ ఫోన్ దొంగలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం జోలపాలెంలో జరిగింది. సెల్‌ఫోన్ విషయంపై జరిగిన గొడవలో దంపతులపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. మదనపల్లె మండలంలోని చీకల బయలు పంచాయితీ, జోలపేటకు చెందిన దంపతులు నారాయణ, విజయమ్మ కాపురం ఉండే ఇంటి పక్కనే ఉంటున్న వసంత్ అనే వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే, నారాయణ, విజయమ్మ దంపతులపై అనుమానంతో ఉన్న వసంత్.. ఉదయం నుండి దూషించడం ప్రారంభించాడు.. ఇది గమనించిన ఆ దంపతులు వసంత్ ను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన వసంత్.. సెల్ ఫోన్ మీరే ఎత్తుకుపోయారంటూ కోపంతో ఊగిపోయాడు.. మాటామాట పెరిగింది.. వాగ్వాదం జరిగిందే.. ఇక, సహనం కోల్పోయిన వసంత్.. కొడవలితో నారాయణ, విజయమ్మపై దాడికి దిగాడు.. ఈ ఘటనలో దంపతులు ఇద్దరికీ తీవ్రగాయాలు అయినట్టుగా తెలుస్తుండగా.. బాధితులను కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు నారాయణ, విజయమ్మ.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. ఆ తర్వాత ఆస్పత్రిలో బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.