భారత్‌లో ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తల లిస్ట్ పెద్దదే.. ఇప్పుడు మరో భారీ మోసం వెలుగు చూసింది.. 17 బ్యాంకులను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు, ఏకంగా రూ.34,615 కోట్లకు మోసం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఇక, రంగంలోకి దిగిన సీబీఐ.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్), మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్, సుధాకర్ శెట్టిపై కేసు నమోదు చేసింది.. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.. ముంబైకి చెందిన ప్రైవేట్ కంపెనీపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచ్ నుండి అందిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసింది సీబీఐ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను నిందితులు రూ.34,615 కోట్లు మోసం చేశారని అభియోగాలు మోపారు..
Read Also: Covid 19: తెలంగాణలో భారీగా కొత్త కేసులు
ఈ అతిపెద్ద స్కామ్‌పై ఈ నెల 20న కేసు నమోదు చేసిన సీబీఐ.. 50 మందికిపైగా అధికారుల బృందంతో ఇవాళ ముంబైలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.. ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై మోపారు.. 2010 నుంచి 2018 మధ్యలో ఆయా బ్యాంకుల నుంచి దాదాపు రూ.42,871 కోట్ల వరకు రుణాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది సీబీఐ. ఇక, వాస్తవాలను దాచేస్తూ కుట్రపూరితంగా వ్యవహరించారని.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేశారని సీబీఐ తన ప్రకటనలో పేర్కొంది.. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని పేర్కొంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ కుట్రపూరిత చర్యలతో బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది. ఈ భారీ స్కామ్‌లో దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కపిల్ వాధావన్, ధీరజ్ రాజేష్ కుమార్ వాధావన్, సుధాకర్ శెట్టి, అమరిల్లిస్ రియల్టర్స్, గుల్మార్గ్ రియల్టర్స్, Skylark Buildcon, దర్శన్ డెవలపర్స్, సిగ్టియా కన్స్ట్రక్షన్, క్రియేటోజ్ బిల్డర్స్, టౌన్‌షిప్ డెవలపర్స్, శిశిర్ రియాలిటీ, సన్‌బ్లింక్ రియల్ ఎస్టేట్ సహా పలు ప్రాంతాల్లో ఈరోజు సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారుల బృందాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.