Boyfriend Cheated Girl In The Name of Love In Mahbubnagar: ప్రేమిస్తున్నానన్నాడు.. పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు.. నువ్వు లేకుండా బ్రతకలేనని అన్నాడు. అది చూసి ఆ అమ్మాయి కూడా అతడ్ని ప్రేమించింది. తానే సర్వస్వమని భావించింది. అతని కోసం కుటుంబ సభ్యుల్ని వదులుకోవడానికి కూడా సిద్ధమైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాక.. అతడు మోసం చేసి వెళ్లిపోయాడు. నువ్వు నాకిక వద్దు అని వదిలేశాడు. దీంతో.. తనకు న్యాయం చేయాలని కోరుతూ, ఆ అమ్మాయి ఇప్పుడు పోరాటం చేస్తోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తెజవత్ రాంసింగ్ తండాకు చెందిన భూక్యా సందీప్, చర్ల తండాకు చెందిన సౌజన్యకు అనుకోకుండా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుంటానని సందీప్ మాటివ్వడంతో.. సౌజన్య అతడ్ని ప్రేమించింది. మూడు సంవత్సరాలు వీళ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. సందీప్ కూడా అమరప్రేమికుడిలా బిల్డప్ ఇస్తూ వచ్చాడు. అయితే.. ఇన్నాళ్లయినా సందీప్ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. పైగా, కొన్ని రోజుల నుంచి అతడు దూరం పెడుతున్న భావన సౌజన్యకు కలిగింది. దీంతో.. ఆమె పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. కానీ.. సందీప్ అందుకు నిరాకరించాడు.
దాంతో ప్రియుడి చేతిలో తాను మోసపోయానని గ్రహించిన సౌజన్య.. న్యాయ పోరాటానికి దిగింది. పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. మౌన పోరాటం చేస్తోంది. సందీప్‌ని ఎంతో నమ్మానని, కానీ అతడు ఇలా దారుణంగా మోసం చేస్తాడని ఏనాడూ ఊహించలేదని, తనకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం వీడనని సౌజన్న వెల్లడించింది. మరి, ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.