3 Men Firing On Gold Shop Owner In Hyderabad Nagole: హైదరాబాద్‌లోని నాగోల్ స్నేహపురి కాలనీలో ముగ్గురు దుండగులు వీరంగం సృష్టించారు. తుపాకులతో ఒక బంగారం షాప్‌లోకి దూరిన ఆ ముగ్గురు.. షాప్ యజమానని బెదిరించి, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో వాళ్లు కాల్పులు జరపడంతో.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల్లో షాప్ యజమానితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహపురి కాలనీలోని ప్రధాన రోడ్లో ఉన్న మహదేవ్ జ్యువెలరీ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత ముగ్గురు దుండగులు 9:30 గంటల ప్రాంతంలో బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి షాప్ లోపలికి వెళ్లారు. అయితే.. లోపలికి వెళ్లిన వెంటనే, షట్టర్‌ని మూసివేశారు. ఆ వెంటనే తమతో తెచ్చుకున్న తుపాకులు బయటకు తీసి.. షాప్ యజమాని కళ్యాణ్ సింగ్‌తో పాటు వర్కర్లపై కాల్పులు జరిపారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, అక్కడి నుంచి దుండగులు పారిపోయారు.
అయితే.. దుండగులు జరిపిన కాల్పుల్లో కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాల్పుల శబ్దం వినిపించడంతో.. చుక్కపక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ షాప్‌లో దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని.. ఈ ముగ్గురు దుండగులు ఫాలో అయ్యారు. ఆభరణాలని కళ్యాణ్ సింగ్‌కి ఇస్తున్న సమయంలో దుండగులు షాప్‌లోకి చొరబడ్డారు. బంగారం తీసుకొని దుండగులు పారిపోతున్న సమయంలో.. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఫలితం లేకుండా పోయింది. పక్క వీధిలో మోటర్ బైక్‌ని పట్టుకొని, దాని మీద దుండగులు పారిపోయారు.
కంట్రీ మెడ్ పిస్తల్‌తో దుండగులు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దుండగులు రాజాస్థాన్, హర్యానా, యూపీ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పల్సర్ బైకు, మరో యాక్టివా బైక్‌పై దుండగులు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. రెండు బుల్లెట్ కేస్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల్లో గాయమైన వ్యక్తికి తలకు బలమైన గాయం కావడంతో.. ఎమ్ఆర్ఐ స్కాన్ సెంటర్‌కు వైద్యులు తరలించారు.