గత కొంత కాలంగా వివిధ భాషల్లో వస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ను చూస్తుంటే మన వాళ్ళంతా మూస పంథాలో సాగిపోతున్నారనే భావన కలుగుతోంది. తీస్తే బయోపిక్స్ తీస్తున్నారు లేదా ఎవరైనా క్రీడాకారుడు తనకు జరిగిన అవమానాన్ని తన తర్వాత తరానికి శిక్షణ ఇచ్చి తద్వారా తన పగప్రతీకారాలను తీర్చుకున్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కాకపోతే తనకు క్రీడా మైదానంలో జరిగిన అన్యాయానికి తానే ఓ ఐదు, పదేళ్ళ తర్వాత తిరిగి గెలుపుతో బదులిచ్చిన చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల హిందీలో వచ్చిన ‘తూఫాన్’, తాజాగా తమిళంలో వచ్చిన ‘సార్పట్ట పరంపర’ ఈ మూడో కోవకు చెందిన సినిమాలే. హారర్ థ్రిల్లర్ ‘టెడ్డీ’ చిత్రం తర్వాత ఓటీటీలో విడుదలైన ఆర్య రెండో సినిమా ఇది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘సార్పట్ట’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తమిళ, తెలుగు భాషల్లో ఉంది.
ఈ చిత్ర కథ కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన 1975 కాలం నాటిది. తమిళనాడులోని అధికారపార్టీ డి.ఎం.కె. బలంగా ఉండటంతో కేంద్ర నియతృత్వ పోకడలు ఇక్కడ సాగవు. ఈ దేశాన్ని వదిలి వెళుతూ, ఆంగ్లేయులు మనవాళ్ళకు అంటగట్టి వెళ్ళిన బాక్సింగ్ ఆటకు నార్త్ మద్రాస్ కేంద్రంగా ఉంటుంది. రాజకీయ నేతల అండదండలతో బాక్సింగ్ పోటీలు జరుగుతుంటాయి. అందులో ప్రధానంగా సార్పట్ట పరంపర కు, ఇడియప్ప పరంపరకు మధ్య గట్టి పోరు సాగుతుంటుంది. గతంలో సార్పట్టకు చెందిన రంగ, ఇడియప్పకు చెందిన సింహాచలంను ఓడించడంతో ఇద్దరూ ఆ తర్వాత తమ శిష్యులను బరిలోకి దింపి ఆధిపత్యాన్ని నిరూపించుకునే పనిలో పడతారు. ఆ క్రమంలో పోర్ట్ ట్రస్ట్ లో పనిచేసే సమర (ఆర్య) తల్లి, భార్య మాటలను కాదని బాక్సింగ్ బరిలోకి దిగుతాడు. అతను తన సత్తా చాటుతున్న సమయంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాజకీయ నేతలను, డీఎంకె సానుభూతి పరులను అరెస్ట్ చేస్తుంది. దాంతో సమర బాక్సింగ్ గురువు రంగా కూడా అరెస్ట్ అవుతాడు. అక్కడి నుండి సమర జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? గతి తప్పి తాగుడుకు బానిస అయిన సమర తిరిగి బాక్సింగ్ బరిలో దిగాడా? విజేతగా నిలిచాడా? లేదా? అనేది మిగతా కథ.
సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలు తెరకెక్కించిన పా. రంజిత్ రూపొందించిన సినిమా ‘సార్పట్ట పరంపర’. దీనికి ఆయన సహ నిర్మాత కూడా. దీనికంటే ముందు హిందీలో ఫ్రీడమ్ ఫైటర్ బిస్రా ముండా బయోపిక్ తీయాలని పా. రంజిత్ అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో ‘సార్పట్ట’ కథను రాసుకుని కార్తీని అప్రోచ్ అయ్యాడు. అతని డేట్స్ దొరక్కపోవడంతో చివరకు ఆర్యతో ఈ మూవీని తెరకెక్కించాడు. దర్శకుడు రంజిత్ గత చిత్రాలతో పోల్చినప్పుడు ‘సార్పట్ట’ ఆ స్థాయిలో లేదని అర్థమైపోతుంది. కాలానుగుణంగా పాత్రలను తీర్చిదిద్దినా, అప్పటి రాజకీయ అంశాలకు చోటు కల్పించినా, అవేవీ ఈ సినిమా పట్ల ఆసక్తిని కలిగించలేకపోయాయి. అంత మాత్రం చేత ఈ చిత్రంలోని పాత్రలన్నీ పేలవంగా ఉన్నాయని చెప్పలేం. సమర తల్లి, భార్య పాత్రలను రంజిత్ బలంగానే రాసుకున్నారు. కానీ రెండు పరంపరలకు చెందిన గురువుల మధ్య ఇగోనే ఈ స్టోరీ డ్రైవ్ చేస్తుంది. దానితో పాటు వ్యక్తిగత స్వార్థంతో ఒకే పరంపరలోని వారు ఒకరిని ఒకరు వెన్నుపోటు పొడుచుకునే సన్నివేశాలు సినిమా అంతా ఉన్నాయి. ఇవేవీ వీక్షకులకు ఉత్సుకతను కలిగించవు. పైగా సినిమా పతాకసన్నివేశం కూడా ఊహకు అందే విధంగానే ఉంది. సన్నివేశాలు డిమాండ్ చేసినా, చేయకపోయినా పా. రంజిత్ తన మనసులోని భావాలను ఏదో రకంగా కొన్ని పాత్రల ద్వారా వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. డాడీ పాత్రతో ‘ఇవి మన రోజులు’ అనిపించడం, సమర తల్లితో ‘నేను పనిమనిషినే కానీ బానిసను కాద’ని చెప్పించడంలో పా. రంజిత్ ముద్ర కనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే… బాక్సర్ గా ఆర్య మేకోవర్ మెప్పిస్తుంది. సెంటిమెంట్ సీన్స్ లోనూ ఫర్వాలేదనిపించాడు. సమర భార్యగా దుషర విజయన్, తల్లిగా అనుపమ కుమార్, డాడీ పాత్రలో జాన్ విజయ్ చక్కగా నటించారు. పశుపతి నటనకు వంక పెట్టడానికి లేదు. సంచనా నటరాజన్, కలైయారసన్, జాన్ కొక్కెన్, షబీర్ కల్లరక్కల్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంతోష్ నారాయణ స్వరపరిచిన రెండు పాటలు పెద్దంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. మురళీ జి కెమెరాపనితనం బాగానే ఉంది. అయితే… ఈ అనువాద చిత్రంలో గోడలు, బ్యానర్లపై కనిపించే తెలుగు రాతలన్నీ తప్పుల తడకలే. ఈ విషయంలో దర్శక నిర్మాతల నిర్లక్ష్యం క్షమించరానిది. ఇవన్నీ పక్కనపెడితే పా. రంజిత్ మూవీ ‘కబాలి’ విడుదలైన జూలై 22నే ‘సార్పట్ట పరంపర’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావడం విశేషం. ఈ పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా… ఆ తరహా కథాంశాలను ఇష్టపడేవారికి మాత్రమే నచ్చే ఆస్కారం ఉంది.
రేటింగ్: 2.25 / 5
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనాలు
ఊహకందే క్లయిమాక్స్
సినిమా నిడివి
ట్యాగ్ లైన్: పంచ్ మిస్సయ్యింది!