అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ ఓటీటీలలో వస్తున్న ఆంథాలజీలను చూసి… తెలుగువాళ్ళు సైతం అలాంటి వాటిని తీయగలరు అని నిరూపించడానికి నలుగురు ప్రముఖ తెలుగు దర్శకులు నడుంకట్టారు. నిజానికి వాళ్ళను అందుకు ప్రేరేపించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనుకోవచ్చు. బడ్జెట్ పరమైన పరిమితులు కూడా బహుశా పెద్దంతగా ఉండి ఉండకపోవచ్చు. దాంతో ఉన్నంతలో ఈ ఆంధాలజీని కాస్తంత గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గదే. కానీ పేరున్న ఈ నలుగురు దర్శకులు తీసిన ‘పిట్ట కథలు’ చూస్తే… నీరసం వస్తుంది. ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిని తూకమేసినట్టుగా కాస్తంత బోల్డ్ సన్నివేశాలతోనూ, సంభాషణలతోనూ నింపే ప్రయత్నం చేశారు. వీటిని చూస్తే… పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందం గుర్తొస్తుంది.
తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న తరుణ్ భాస్కర్ రూపొందించిన కథ ‘రాముల’. తెలంగాణా గ్రామీణ ప్రాంతంలోని ఓ రాజకీయ నేత కొడుకుకు, ఓ బీదింటి అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ. ఈ ఇద్దరు ప్రేమికుల మధ్య ఏర్పడిన అంతరాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం నిచ్చెన మెట్టుగా ఉపయోగించుకున్న మహిళా నేత కథ కూడా ఇందులో అత్యంత కీలకమైంది. ఆ మహిళా నేతగా మంచు లక్ష్మీ నటించింది. తెలంగాణ రాజకీయాల మీద, భాష మీద మంచి పట్టున్న వ్యక్తి కావడంతో ఇక్కడి నేపథ్యంలోనే కథను నడిపాడు తరుణ్ భాస్కర్. అయితే ఆయన నుండి కొత్తదనాన్ని ఆశించే వారికి ‘రాముల’ ఎపిసోడ్ నిరాశను కలిగిస్తుంది. ఎందుకంటే… అతను ఎన్నో పరిమితులు ఉన్న వెండితెర మీదనే తనదైన శైలిలో వినోదాత్మకంగా ‘పెళ్ళిచూపులు’ను తెరకెక్కించాడు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీగా ‘ఈ నగరానికి ఏమైందీ’ని రూపొందించాడు. ఇక ఓటీటీలో తొలిసారి తెలుగులో తీస్తున్న ఆంధాలజీలో తరుణ్ భాస్కర్ ఇంకేదో కొత్తగా, సమ్ థింగ్ డిఫెరెంట్ గా ప్రయత్నిస్తాడని అనుకునే వారిని ‘రాముల’ నిరాశనే మిగుల్చుతుంది.
‘అలా మొదలైంది’ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో తెలుగువారి ముందుకు దర్శకురాలిగా వచ్చిన నందినీ రెడ్డి ఈ ఆంథాలజీతో రూపొందించిన ఎపిసోడ్ ‘మీరా’. అనుమానించే భర్తతో కలిసి జీవితాన్ని సాగించడం అనేది భార్యకు ముళ్ళ మీద ప్రయాణం లాంటిది. ఈ సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు అలాంటి అనుమానపు భర్తలతో రాజీ పడి జీవించేస్తున్నారు. అయితే… ఇందులో మీరా ప్రవర్తన భర్త అనుమాన పడటానికి తావిచ్చేలానే ఉంటుంది. భర్త అనుమానాలకు బలం చేకూరేలా ఆమె వ్యవహరిస్తుంటుంది. అయితే భర్త అనుమానం హద్దులు మీరిన తర్వాత మీరా ఏం చేసిందన్నదే దీని క్లయిమాక్స్. నందినీ రెడ్డి ఓ యూనిక్ పాయింట్ ను తీసుకున్ని చక్కగా డీల్ చేశారు. కానీ ఆమె చూపించిన పరిష్కారానికి ఎంతమంది అంగీకారం తెలుపుతారనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది. ఇందులో జగపతిబాబు, అమలాపాల్ భార్యభర్తలుగా నటించడం విశేషం. ఈ మొత్తం నాలుగు కథల సమాహారంలో కాస్తంత సెన్సిబుల్ గా ఉన్నది నందినీరెడ్డి రూపొందించిన ‘మీరా’నే అని చెప్పొచ్చు.
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి థాట్ ప్రొవోకింగ్ మూవీ తీసిన దర్శకుడు నాగ అశ్విన్. అంతేకాదు, రెండో సినిమా ‘మహానటి’తో జాతీయ అవార్డులనూ అందుకున్నాడు. అతను రూపొందించిన ఎపిసోడ్ ‘ఎక్స్ లైఫ్’. ఫ్యూచర్ లో జరిగే కథాంశాన్ని నాగ అశ్విన్ ఎంపిక చేసుకున్నాడు కానీ అది ఈ తరానికి ఏ మాత్రం కనెక్ట్ కాదు. టెక్నాలజీ సాయంతో ఏదో చూపించాలనుకుని ఏదో చూపించినట్టు అయ్యింది. ముఖ్యంగా శుత్రీహాసన్ ఇందులో నటించింది అనగానే మనం ఏదేదో ఎక్స్ పెక్ట్ చేస్తాం. ఓ స్టార్ హీరోయిన్ నుండి నాగ అశ్విన్ తనకు కావాల్సిన నటన రాబట్టుకుంటాడని భావిస్తాం. కానీ ఆమె సంభాషణలే అసలు అర్థం కాని పరిస్థితి. సెన్సార్ కు తావులేని ఓటీటీలో లిప్ లాక్ లకు కొదవ ఉండదని ఈ ‘ఎక్స్ లైఫ్’ నిరూపిస్తుంది. మొత్తం మీద ఈ గందరగోళానికి అలవాటు పడే టైమ్ కి క్లయిమాక్స్ వచ్చేసి రిలీఫ్ ను కలిగిస్తుంది.
తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. అతను దర్శకత్వం వహించిన ఎపిసోడ్ ‘పింకీ’. విడాకులు పొందిన తర్వాత కూడా పాత బంధాలను వదులుకోలేని వ్యక్తుల కథ ఇది. ఇలాంటి సంఘటనలు సమాజంలో జరగడం లేదని చెప్పలేం. కానీ చాలా అవి రేర్ కేసులు. వాటిని జనరలైజ్ చేస్తూ, అదే ప్రేమ అన్నట్టుగా చూపడం సరిగా లేదు. సంకల్పరెడ్డి తన మనసులోని భావాలను లేదా కాగితం మీద రాసుకున్న కాన్సెప్ట్ ను అనుకున్న విధంగా, కన్వెన్సింగ్ గా చెప్పలేదనిపిస్తుంది. మొత్తం మీద ఇది కూడా హాఫ్ కుక్డ్ మీల్స్ నే తలపిస్తుంది.
నిజం చెప్పాలంటే… ‘పిట్టకథలు’ ఆంథాలజీ గురించి అతిగా ఊహించుకునే వారిదే తప్పేమో అనే సందేహమూ వస్తుంది. తమిళంలో ఇటీవల వచ్చిన రెండూ మూడు ఆంథాలజీలను చూసి, వాటిని ఆయా దర్శకులు కన్విక్షన్ తో తీసిన విధానం చూసి మనవాళ్ళూ కూడా ఆ తరహాలో తీస్తారనే ఆశలు పెట్టుకోవడం మొదటి తప్పు. సినిమాల కోసం ప్రాణం పెట్టే ఈ నలుగురు పాపులర్ డైరెక్టర్స్… ఈ అంథాలజీని తీయడానికి అంతటి అంకితభావాన్ని చూపించలేదని పిస్తోంది. తెలుగులో వచ్చిన తొలి ఆంధాలజీ ని చూడాలనే ఆసక్తితో ఓ సారి ‘పిట్టకధలు’ను చూడొచ్చు. కానీ ఆ తర్వాత సమయం వృధా అయ్యిందని పెదవి విరిస్తే ప్రయోజనం ఉండదు!