Chairman’s Desk : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదకొండేళ్లైంది. ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.అలాగని ఏపీలో అభివృద్ధికి అవకాశాల్లేవని కాదు. కానీ ఉన్న బలాలపై దృష్టి పెట్టకుండా.. ఎక్కడో చూసిన అభివృద్ధినే.. అక్కడ రిపీట్ చేయాలనుకోవడమే మైనస్ గా మారుతోంది. ప్రతి రాష్ట్రానికీ వ్యూహాత్మక అనుకూలతలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతే కానీ ఓ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మోడల్.. మరో రాష్ట్రంలో అమలు చేస్తామనడం ఆచరణ సాధ్యం కాదు. కానీ ఏపీలో ఏ పార్టీ వాస్తవాల గురించి ఆలోచించడం లేదు. ఏ సర్కారు వచ్చినా నేల విడిచి సాము చేయడం అలవాటైపోయింది. అసలు ఏపీకి ఉన్న బలాలేంటి..? పార్టీల రాజకీయంతో ఎలాంటి నష్టం జరుగుతోంది..? అనువుగాని విధానాలకు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతుంది. విభజనలో ఆ రాష్ట్రం దారుణంగా నష్టపోయింది. కానీ విభజన తర్వాత పార్టీల రాజకీయాలకు మరోసారి బలైపోయింది. విభజన జరిగి 11 ఏళ్లయిన ఈరోజుకి దారి తెన్నూలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికి మూడు ప్రభుత్వాలు వచ్చాయి. ఎవరి విధానాలు వాళ్ళవి. ఎవరి పాలన వాళ్లది. వాస్తవాలు…. భవిష్యత్తు ప్రణాళికలు , గాలికి వదిలేసి సొంత అజెండాలు, సొంత ప్రణాళికలు తో ఇప్పటికీ రాష్ట్రం ఎదుగు బోదుగు లేకుండా చేశారు. చివరికి ఆ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఎదుగుదల ఉండదు… ఇలాగే ఉంటుంది అనే భావన ప్రజల్లో కలిగేటట్లు చేశారు. దీనికి ప్రధాన కారణం, పాలకులు ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా అర్థం చేసుకోకుండా, ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తమ సొంత ఐడియాలు, సొంత విధానాలు, సొంత ప్రయోజనాలు ప్రణాళికలతో ఇష్టం వచ్చినట్లు చేయడమే. నాయకుల పాపాలే ఏపీకి శాపాలుగా మారి..ఇప్పటికీ ఎదుగు బొదుగు లేకుండా ఆ రాష్ట్రం బాలారిష్టాలు పడుతూనే ఉంది.
ఏపీలో అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. కానీ ఆ దిశగా దృష్టి పెట్టే ముందుచూపు పాలకులకు కరువైంది. ఎక్కడో చూసిన అభివృద్ధినో, ఎక్కడో ఉన్న మోడల్ నో కాపీ కొట్టడమే కానీ.. ఆంధ్రప్రదేశ్ కు సొంత అభివృద్ధి ప్రణాళిక, అజెండా ఉండాలనే ఊహే ఎవరికీ రావడం లేదు. ఏపీకి గ్రోత్ ఇంజిన్ గా మారే లక్షణాలున్నాయని ఆర్థిక వేత్తలు ఎప్పుడో గుర్తించారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం ఆ స్పృహ ఉండటం లేదు. ఎంతసేపూ రాజకీయంగా పైచేయి సాధించాలనే తాపత్రయమే కానీ.. ఏపీని త్వరగా సెట్ చేద్దామనే ఆలోచన కరువైపోయింది. దీంతో ప్రజలు అభివృద్ధి కాముకులైనా.. ఆ అభివృద్ధి కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్నాడో సినీ కవి. ప్రస్తుత ఏపీ ముఖ చిత్రం చూస్తే.. అక్కడి ప్రజలు కూడా అలాగే అనుకోవాల్సి వస్తోంది. ఓ ప్రభుత్వం కాకపోతే మరో సర్కారైనా ఏపీ ఫేటు మారుస్తుందని ఆశపడ్డ జనానికి ఎప్పటికప్పుడు నిరాశే మిగులుతోంది. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా.. ఏపీ రాత మార్చలేకపోతున్నారు. దీంతో ప్రజలు కూడా విసిగివేసారిపోతున్నారు. అసలు అభివృద్ధికి అవకాశం లేదనుకున్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరుగుతోంది. కానీ ఏపీలో మాత్రం అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుగా ఉంది పరిస్థితి. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఛత్తీస్ గఢ్ లో కూడా ఐదేళ్లలో రాజధాని నిర్మాణం ఓ కొలిక్కి వచ్చింది. కానీ చెన్నై, హైదరాబాద్ నగరాలను తామే అభివృద్ధి చేశామని చెప్పుకునే ఏపీ ప్రజలకు.. సొంత రాష్ట్రంలో రాజధాని లేకపోవటం ఇప్పటికీ లోటుగానే ఉంది. రాజధాని నిర్మాణం పేరుతో అక్కడ జరుగుతున్న తంతు చూసి అందరికీ మతిపోతోంది.
ఏపీ ప్రజలు మొదట్నుంచీ సొంత ప్రాంతం వదిలేసి.. వలస వెళ్లిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పుడు విభజన తర్వాత కూడా అదే పోకడ కొనసాగుతోంది. ఎంతసేపూ ఏపీలో కూడా హైదరాబాద్ లాంటి నగరం రావాలని కోరుకోవడమే కానీ.. అందుకు తగ్గ కార్యాచరణ ఉండటం లేదు. పైగా అయినదానికీ, కానిదానికీ ఏపీని తెలంగాణలో పోల్చడం కూడా అలవాటైపోయింది. కానీ రెండు రాష్ట్రాలకూ మౌలిక స్వరూపంలో తేడా ఉందనే సంగతి ఎవరూ గుర్తించడం లేదు.
తెలంగాణ ఇప్పటికే పారిశ్రామిక రాష్ట్రంగా ముద్రపడిపోయింది. ఇప్పటికీ తెలంగాణకి పెట్టుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేది, వ్యాపారాలు చేసేది కూడా ఏపీ వాళ్లే అన్నది గమనించాల్సిన విషయం. హైదరాబాద్ కి కావలసినంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాతావరణం అన్ని రకాలుగా అనుకూలం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రోడ్స్… ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. దీంతో ఈరోజుకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం లేకుండానే వాళ్లకు అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతం కనుక… హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు.
హైదరాబాద్ ఏమీ ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దీని వెనక వందల సంవత్సరాలు చరిత్ర ఉంది. అలాగే ఇది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని. ఈ కారణంగా హైదరాబాద్ కి పెట్టుబడులు రావడం… హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందడం అనేది కాలానుగుణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ.. ఇదే మోడల్ లో మరొక చోట జరగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ ను ఉదాహరణగా తీసుకుంటే.. దేశవ్యాప్తంగా రియల్ మాంద్యం ఉంది. ఎంతో డిమాండ్ ఉండీ బాగా లాభాలొచ్చే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజధానిని అభివృద్ధి చేసి.. అక్కడ రియల్ ఎస్టేట్ లో లాభాలు తెస్తామనడమనేది అసాధ్యమైన విషయం. పైగా హైదరాబాద్ ఇప్పటికే ఆటో మోడ్ లో ఉంది. దాంతో ఏపీకి పోలిక పెట్టాల్సిన పనిలేదు. హైదరాబాద్ లో ఏ రంగం ఇప్పటికిప్పుడు అభివృద్ధి చెందలేదు.ఇక్కడ సహజ పరిణామ క్రమంలో అభివృద్ధి జరిగింది. అంతే కానీ టార్గెట్లు పెట్టుకుని.. అల్లాఉద్దీన్ అద్భుత దీపం కథ లాంటిది రిపీట్ అవుతుందనుకోవడం ప్రజల్ని మభ్యపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా హైదరాబాద్ తో పోలిక మానుకుని.. ఏపీలో ఉన్న అవకాశాల్ని అన్వేషించాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఈ వాస్తవాల గురించి పట్టించుకోకుండా ఏపీ నేతలు మనకూ హైదరాబాద్ లాంటి రాజధాని కావాలని ఏపీలో ఊదరగొడుతున్నారు. అది నిజమేనని కొందరు ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీంతో అంతకంతకూ ఏపీ ప్రజల్లో ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడటం లేదు. దీంతో పోటీపడి ప్రజల్లో ఆకాశమంత ఆశలు పెంచేసిన నేతలు.. ఆచరణలో బండి ముందుకు కదలక ఆపసోపాలు పడుతున్నారు. అయినా సరే వాస్తవాలు గుర్తించడానికి సిద్ధపడటం లేదు. పైగా చిన్నగీత పక్కన పెద్దగీత గీసిన చందంగా.. ప్రజల ముందు ఎప్పటికప్పుడు సరికొత్త ఆకాంక్షల్ని పెడుతూ.. వారిని మభ్యపెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి జరిగినా, జరగకపోయినా.. రాజకీయ పబ్బం గడిస్తే అంతేచాలు అనుకుంటున్నారు.
నిజానికి రాష్ట్ర విభజన ఏపీ పాలిట ఒక మానని గాయం. విభజన సక్రమంగా జరగకపోవడం. ఆనాడు పాలకులు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎలా పడితే అలా విభజన చేయడంతో.. ఇప్పటికీ ఆ పాపాలు ఏపీని శాపాలుగా వెంటాడుతూనే ఉన్నాయి.11 సంవత్సరాలు తర్వాత కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు అనడానికి మరో తిరుగులేని నిదర్శనం ఏంటంటే , ఇప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో శాశ్వతంగా నివసించడం లేదు. వారాంతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు వెళ్ళిపోతే. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదు వచ్చేస్తారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు శని ఆదివారాలు హైదరాబాదులో వాలిపోతారు. అంటే 11 ఏళ్ల తర్వాత కూడా ఏపీని నివాసయోగ్యమైన ప్రాంతంగా, మంత్రులు ముఖ్యమంత్రి ,మాజీ ముఖ్యమంత్రి అంగీకరించలేకపోతున్నారు. మరి సామాన్య ప్రజలు పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు అక్కడ శాశ్వతంగా ఉండాలని ఎందుకు అనుకుంటారు.? కనీసం అమరావతిలో కాకపోయినా.. నేతలందరికీ సొంతూళ్లున్నాయి. సొంతిళ్లున్నాయి. కనీసం అక్కడయినా ఉండి.. ఎవరికి వారు చొరవ తీసుకుని ఆయా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెడితే కచ్చితంగా దశాబ్దకాలంలో మరింత మెరుగైన ఏపీ సాక్షాత్కరించేదనడంలో సందేహం లేదు. కానీ బాధ్యత తీసుకోవాల్సిన నేతలు కాడి కింద పడేస్తున్నారు. ప్రజలు కూడా ఎప్పటిలాగే ఎక్కడ మెరుగైన అవకాశాలు దొరికితే అక్కడే స్థిరపడటానికి అలవాటుపడ్డారు. దీంతో ఏపీ ఎవరికీ పట్టకుండా.. బాలారిష్టాలతో సతమతం కావాల్సిన దుస్థితి నెలకొంది.