Chairmans Desk: ఏపీలో రాజకీయం సరికొత్త లోతులకు దిగజారుతోంది. అధికారం మారితే.. ఇన్నాళ్లూ కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోవడం.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ వర్గం మరో వర్గం కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్రానికి ఎప్పట్నుంచో అనుభవమే. కానీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నవారెవరికీ రక్షణ ఉండదని తేలిపోయింది. వైసీపీ హయాంలో ఓ నేత ఏకంగా మాజీ సీఎం నివాసంపైకి దూసుకెళ్లడం కలకలం రేపింది. జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్న వ్యక్తి మీదకు అలా మందగా వెళ్లడం ఏంటని అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు టీడీపీ హయాంలో కొందరు నేతల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతల ఇళ్లపై దాడులు జరగటం.. వారి కుటుంబ సభ్యుల్నీ టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద విభజనతో ఎన్నో సమస్యలు చుట్టుకున్న ఏపీని ప్రధాన పార్టీలు.. గట్టెక్కించకపోగా.. తమ రాజకీయం కోసం సరికొత్త సమస్యను తెచ్చిపెట్టారనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
కొన్నేళ్లుగా ఏపీలో కొత్త సంస్కృతి మొదలైంది. రాజకీయ ప్రత్యర్ధుల ఇళ్లపై దాడులు,ఆస్తులు విధ్వంసం చేయడం, భయానక వాతావరణాన్ని సృష్టించడాన్ని ప్రధాన పార్టీలు అలవాటుగా మార్చుకున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇందుకు బాధ్యులే. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై వందలమంది మూకుమ్మడిగా దాడి చేయడం, తగలబెట్టడం ఇవన్నీ చూస్తే ఎలాంటి ఆంధ్రప్రదేశ్.. ఎలా మారిపోయింది అనిపిస్తుంది. బీహార్ సంస్కృతి గురించి చెప్పుకోవడం వినడమే మనకు తెలుసు. కానీ అదిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇలాంటి దృశ్యాలు కొన్ని చూశాం. ఇప్పుడు అదే ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది. జగన్ సర్కార్ విచ్చలవిడితనం, పొరపాట్లు, అరాచకాల వల్లే జనం వాళ్లని 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రజలు కోలుకోలేని తీర్పు ఇచ్చారు. తగిన గుణపాఠం నేర్పారు. కూటమి సర్కార్‌కు అందుకే అధికారం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా అదే పొరపాటు చేస్తోంది. అదే అరాచకం సృష్టిస్తోంది. అదే ప్రతీకార రాజకీయాలకు తెగబడుతోంది. ప్రజలు ఏం కోరుకుని కూటమికి అధికారం కట్టబెట్టారో దానికి విరుద్ధంగా ప్రభుత్వం వెళ్తోంది.
ఏ రాష్ట్రంలో అయినా శాంతిభద్రతల పరిరక్షమే ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. అంతేకానీ రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోమని ఏ రాష్ట్ర ప్రజలూ ఎవ్వరికీ అధికారం ఇవ్వరు. ఈ సంగతి ఏపీలో ప్రధాన పార్టీలకు ఇసుమంతైనా గుర్తుందా అంటే లేదనే చెప్పాలి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనే విషయాన్నే మర్చిపోయిన ఏపీ పార్టీలు.. ఎవరు అధికారంలోకి వచ్చినా.. తమ క్యాడర్ మనోభావాలు గౌరవించడం, వారి ప్రతీకారాలకు సహకరించడమే విద్యుక్త ధర్మంగా పనిచేస్తున్నాయి. అంతకుమించి ఆలోచించటానికి కూడా ఏ పార్టీకీ మనసు రావడం లేదు. పోనీ ప్రతీకారమైనా పద్ధతిగా తీర్చుకుంటున్నారా అంటే అదీ లేదు. రోజులు గడిచేకొద్దీ ప్రతీకారం పీక్స్‌కు వెళ్లి.. మధ్యయుగం నాటి దాడుల దాకా వెళ్లిపోతోంది. కాసేపు ప్రతీకారాల గురించి పక్కనపెడితే.. ప్రత్యక్షంగా ఆ దాడులు చూసిన సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే దుస్థితి ఉంది. వాళ్లూ వాళ్లూ కొట్టుకుని ఎక్కడ తమ మీద పడతారో అని.. చుట్టుపక్కల ప్రజలు దాడులు జరిగినంతసేపూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని క్షణం ఒక యుగంగా బతికారంటే నమ్మాల్సిందే. కావాలని చేయకపోయినా.. పైశాచిక స్థాయిలో దాడులు జరుగుతున్నప్పుడు.. పొరపాట్లు, గ్రహపాట్లు సహజం. అలాంటి పొరపాటో, గ్రహపాటో జరిగి ఏ సంబంధం లేని వారిపై దాడులు జరగవని, వారికి హాని ఉండదని ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఇక మూక మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటరిగా బుద్ధిగా ఉండేవారు కూడా.. గుంపులో ఉన్నప్పుడు వింతగా ప్రవర్తించడం మామూలే. అలాంటి అనూహ్య ప్రవర్తనలు.. ఎప్పుడు ఎవరికి హాని చేస్తాయో ఎవరూ చెప్పలేరు. కానీ ఏపీలో ప్రతీకార దాహంతో రగిలిపోతున్న ప్రధాన పార్టీలకు.. ప్రజలు.. వారి క్షేమం గురించిన ఆలోచనే లేకపోవడం రాష్ట్రం దురదృష్టం అనుకుని సరిపెట్టుకోవాల్సిన దుస్థితి.
అలాగని ఉమ్మడి ఏపీలో ప్రతీకారాలు అసలు లేవని కాదు. అప్పట్లోనూ ప్రతీకారాలున్నా.. అవి ఓ పరిమితికి లోబడి.. ఓ పద్ధతిగా ఉండేవి. ప్రత్యర్థుల్ని రాజకీయంగా తొక్కేయటం, వారి ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం లాంటివి సాధారణమే. కానీ ఏకంగా భౌతిక దాడులకు దిగటం, అసలు శాల్తీలే గల్లంతు చేయాలనే స్థాయి దిగజారుడు రాజకీయం మునుపెన్నడూ లేదు. అయితే రాజకీయ ప్రతీకారం ఒక్కసారిగా ఈ స్థాయికి దిగజారలేదు. మొదట బూతుల సంస్కృతి విచ్చలవిడిగా రాజ్యం చేసింది. బూతులు మాట్లాడేవాడే మొనగాడనే ట్రెండ్ సెట్ అయింది. ఆ తర్వాత నేతలతో పాటు వారి కుటుంబాల్నీ బజారుకు లాగే నీచ సంస్కృతి పురుడు పోసుకుంది. రాజకీయాల్లో ఉన్న పాపానికీ.. మీతో పాటు మీ కుటుంబం మీద బురద జల్లుతాం.. చచ్చినట్టు కడుక్కోవాల్సిందే అనే ధోరణి వచ్చేసింది. చివరకు కాస్త మర్యాదస్తులెవరైనా రాజకీయాల్లోకి రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ కారణంగానే కొందరు మంచి నేపథ్యం ఉన్న రాజకీయానికి దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వీధి రౌడీలు, గూండాల భాష వచ్చేసిందో.. అదే రాజ్యం చేయడం మొదలుపెట్టిందో.. ఎప్పుడైతే అధికారం కోసం ఏం చేసినా తప్పు కాదనే ధోరణి ప్రబలిందో.. ఎప్పుడైతే అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రత్యర్థులు లేకుండా చేయాలనే దురాలోచన మొగ్గ తొడిగిందో.. అప్పుడే రాజకీయాల్లో అన్ని రకాల విలువలూ పతనమయ్యాయి. అసలు రాజకీయానికి ఉన్న ప్రాథమిక నియమాలన్నీ గంగలో కలిసిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ప్రధాన పార్టీలన్నీ కలిసి.. రాజకీయాన్ని కొత్తగా ఆవిష్కరించాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల రాజకీయానికీ.. తమకూ తేడా ఉండాలనే దుగ్ధతో పరమ నైచ్యానికి తెగబడ్డాయి. అందుకే రాజకీయం విష సంస్కృతిగా మారిపోయింది. రాజకీయ నేతల్ని చూసి జనం భయపడే పరిస్థితి వచ్చింది. ఏపీలో రాజుకున్న రాజకీయ నైచ్యానిక ఇకనైనా ముగింపు పలకపోతే.. రాబోయే రోజుల్లో బీహార్ ప్రజలు కూడా మీ కంటే మీరే నయం అని బహిరంగంగా కామెంట్ చేసే పరిస్థితి ఎంతోదూరంలో ఉండకపోవచ్చు. ఏతావాతా ఏపీకి అన్నపూర్ణగా ఉన్నపేరు పోగొట్టేసి.. ఏపీ అంటే దాడులు, బూతులే అని చెప్పాల్సిందేనని నేతలు కంకణం కట్టుకున్న దుస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది.
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన ఏపీలో.. ఇలాంటి రాజకీయం జరుగుతుందని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదు. చివరకు బూతులు తిట్టుకుంటున్నప్పుడు కూడా ఇంతకుమించి దిగజారరులే అని సరిపెట్టుకున్నారు. కానీ ఏపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త లోతులకు దిగజారుతూ.. దిగజారుడుతనానికి కొత్త కొలబద్దను వెతుక్కోవాలని అందరికీ సవాల్ విసురుతున్నారు.
రాజకీయం చేయడం అంటే ప్రతీకారం తీర్చుకోవడమే.. అనే సిద్ధాంతాన్ని జనంలోకి కార్యకర్తల్లోకి నాయకుల్లోకి బలంగా ఎక్కిస్తున్నాయి ఏపీ పార్టీలు. ఏ విష సంస్కృతికి వ్యతిరేకంగా జనం ఓటు వేశారో.. ఏపీలో అదే విషసంస్కృతిని తిరిగి పెంచి పోషిస్తున్నారు. అధికారం వస్తే అందరూ ఒకటే … ఇలాగే ఉంటారు .. అని స్పష్టంగా చెబుతున్నట్టు ఉంది పరిస్థితి. రాష్ట్రవిభజన జరిగి 12 ఏళ్లు అయింది. రాజధాని లేదు. ఉద్యోగాల్లేవు. పరిశ్రమల్లేవు. విద్యాసంస్ధలు లేవు. ఎవరి అజెండా వారిదే. అవన్నీ గాలికొదిలేసి ఒకరిపై ఒకరు తెగబడి నరుక్కోవడం, కొట్టుకోవడం, ఇళ్లు తగలబెట్టుకోవడం.. ఇదేం సంస్కృతి? ఏపీ ఎటుపోతోంది? . ఇదే ప్రతీకార రాజకీయాలు , పరస్పర దాడులు కొనసాగితే.. మరో మూడేళ్ల తర్వాత అధికార మార్పిడి జరిగితే.. పరిస్ధితి ఏమిటి ? అప్పుడు నైతికంగా వీళ్లని ఖండించే హక్కు ఉంటుందా ? అప్పుడు మీరు చేశారు కాబట్టి.. ఇప్పుడు మేం చేశాం.. అనే వాదన కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఎక్కడోచోట ఫుల్స్టాప్ పెట్టాలి. పార్టీ శ్రేణులు పిచ్చెత్తిపోయినట్టు మూకలు మూకలుగా తెగబడి దాడులు చేస్తుంటే చూడ్డానికి 70mm సినిమాలా బానే ఉంటుంది. కానీ దాని పర్యవసానాలు ఎంద దారుణంగా ఉంటాయో ఆ కార్యకర్తల కుటుంబాలకే తెలుసు. నాయకులు ఎప్పుడూ ఏసీ గదుల్లో క్షేమంగానే ఉంటారు. వీళ్లంతా జైళ్లలో మగ్గిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఫైనల్‌గా సాధించేది ఏమీ ఉండదు. ఓ కుటుంబానికో , ఓ వ్యక్తికో రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం తప్ప.
మనం మధ్యయుగంలో లేం. ఇది ప్రజాస్వామ్య యుగం. ఇక్కడ వీధిపోరాటాలు, యుద్ధాలకు తావు లేదు. ఏమున్నా ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకోవాలి. ఎన్నికల్లో గెలుపోటములే గీటురాయి. అంతేకానీ ఎవరు బాగా దాడి చేస్తే.. ఎవరు ఎక్కువగా బూతులు తిడితే వారు గెలిచినట్టు ప్రకటించే విధానాలు ఏమీ లేవు. ఈ సంగతి ఏపీలో ప్రధాన పార్టీలకూ తెలుసు. కానీ అన్నీ తెలిసీ పనిగట్టుకుని బరితెగించి రోడ్డున పడటం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో పార్టీలు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఏపీ చాలా కష్టాల్లో ఉంది. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ.. రాష్ట్రాన్ని కష్టాల సుడిగుండం నుంచి బయటకు తేవాలి. అందుకోసం ఓ స్పష్టమైన కార్యాచరణ తీసుకుని.. రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలి. ఇప్పటికే ఏపీకి ఉన్న సమస్యల చిట్టా ఏంటో.. ప్రధాన పార్టీలు పోటాపోటీగానే చెబుతున్నాయి. మరి పరిస్థితి అలా ఉంటే.. మీరెలా ఉండాలనే నైతిక ప్రశ్న వేసుకోవటానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేకపోవడమే ఇక్కడ అసలైన చోద్యం. అప్పటికీ ఏపీ ప్రజలు తమ దగ్గరున్న ప్రత్యామ్నాయాలన్నీ ఉపయోగించారు. ఒకరు కాకపోతే మరొకరైనా రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని, తమకు మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశతో ఐదేళ్లకోసారి అధికారమార్పిడి కూడా చేశారు. కానీ ఏం చేసినా వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే తరహాలో ప్రధాన పార్టీలు పోటీపడి అరాచకానికి తెరలేపుతున్నాయి. పాలన సంగతి వదిలేసి.. రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడటమే పనిగా పెట్టుకున్నాయి. ఇప్పటికే రేపు వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగితే.. ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే కార్యాచరణ తయారుగా ఉందంటే అతిశయోక్తి కానే కాదు.
ప్రతీకార రాజకీయాల కోసం ఈ స్థాయిలో ఆలోచిస్తున్న పార్టీలు, నేతలు.. ఏపీ అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించడం లేదో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న స్థితిలో ముల్లుకర్ర పెట్టి పొడిచినా ఏపీలో పార్టీలకు చీమ కుట్టినట్టైనా ఉంటుందా అంటే సందేహమే. ఆ స్థాయిలో పార్టీల తోలు మందమైపోయింది. ఏపీలో ప్రధాన పార్టీల తీరు చూస్తుంటే కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఎలాగూ ఏపీ అభివృద్ధి అంత తేలిక కాదు కాబట్టి.. అరాచక సంస్కృతికి తెరలేపటం తేలికని ఈ రూట్ ఎంచుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రజలు కూడా పదేపదే అభివృద్ధి గురించి, సమస్యల గురించి అడగకుండా ఉండాలంటే.. వారి సాధారణ జీవనాన్ని డిస్టర్బ్ చేయాలనేది ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్నారా అనిపిస్తోంది. కాదు కాదు అలా అనిపించేలా ఏపీ పార్టీలే చేస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రాజకీయ ప్రత్యర్థులు లేకుండా చేయాలనుకునే పోకడలు ఎటు దారితీస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదు. కొంతమందైతే ఈ పెడదారులకు ప్రజలే అడ్డుకట్ట వేయాలని అని చెబుతున్నారు. కానీ ప్రజలకు కేవలం ఎన్నికల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. పైగా ప్రధాన పార్టీలన్నీ అదే బాటలో ఉన్నప్పుడు.. ఇక ఎవర్ని ఎన్నుకున్నా ఉపయోగం ఏముందనే కొత్త ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. చివరకు ఏపీ ప్రజలు మీరు మమ్మల్ని ఉద్ధరించకపోయినా పర్లేదు.. మరింత అధ్వాన్న స్థితికి దిగజార్చొద్దని పార్టీలకు మొర పెట్టుకునేలా రాజకీయం దిగజారుతోంది. అధికారం శాశ్వతం కాదని తెలిసీ, చివరకు మొదటిసారి ఎన్నికల్లో గెలిచినవారు కూడా కనీస స్పృహ లేకుండా నోటికి, చేతులకు పని చెబుతున్నారంటే ఎవర్ని ఏమనాలో తెలియని దుస్థితి.
మొత్తం మీద రాజకీయానికే కొత్త అర్థం చెబుతున్న ఏపీ నేతల్ని చూసి.. మిగతా రాష్ట్రాల నేతలు కూడా అనుసరిస్తే ఏం జరుగుతుందో ఊహించటానికే భయమేస్తోంది. ప్రగతిశీల రాజకీయాలు చేసే ఏపీ నేతల్ని ఇప్పటిదాకా చూసిన ప్రజలకు.. కొత్తగా అరాచకమే కేరాఫ్ అడ్రస్‌గా తయారైన నేతల్ని చూసి మతిపోతోంది. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే కొత్త పెట్టుబడులు రాకపోగా.. ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోతాయేమోననే ఆందోళన నెలకొంది. ఏపీలో రాజకీయ పార్టీలు ఎప్పటికి మారతాయనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఏపీలో రోజురోజుకీ దిగజారుతున్న రాజకీయం.. అంతకంతకూ రెచ్చిపోతున్న పార్టీల పోకడలు.. కచ్చితంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా చేయాల్సిన నేతలు.. పని గట్టుకుని రాష్ట్రం పరువు తీయాలని లక్ష్యంగా పెట్టుకోవడం.. సాధారణ ప్రజలకు తలబొప్పి కట్టిస్తోంది.
రాజకీయమన్నాక ప్రత్యర్థులు ఉంటారు. ఉండాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షమే పునాది అని ఎప్పుడో చెప్పారు. కానీ ఏపీలో ప్రధాన పార్టీలు మాత్రం అలా అనుకోవడం లేదు. ఉంటే మేమే ఉండాలి. మరొకరి అస్తిత్వమే ఉండొద్దనే ధోరణితో చెలరేగిపోతున్నాయి. ఇప్పటికే విజయవంతంగా ఏపీ సమాజాన్ని కులాల వారీగా, పార్టీల వారీగా విభజించిన నేతలు.. తటస్థులు అనేవారు ఎవరూ ఉండకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా.. ఎటో తేల్చుకో అని అల్టిమేటం ఇస్తున్నారు. ఇంకా బరితెగించి తటస్థుల మీదా ఏదో ఒక పార్టీ ముద్ర వేసి.. మరో పార్టీ వారిని శత్రువులుగా చూసే కొత్త సంస్కృతి కూడా ఏపీలో బయల్దేరింది. దీంతో కచ్చితంగా రాష్ట్రంలో ఉండాలంటే.. ఏదో ఒక పార్టీ ముద్ర వేసుకోవాల్సిందే అన్నంతగా పరిస్థితులు విషమించాయి. ఇలాంటి చెడు సంస్కృతిని ప్రధాన పార్టీలు పోషించటం రాజకీయ దురహంకారానికి పరాకాష్ట. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు అనే సూత్రానికి నీళ్లొదిలిన నేతలు.. తమ దృష్టిలో అధికారం దక్కించుకున్నవాళ్ల రాజులు.. ప్రజలు వట్టి తరాజులు అనుకుంటున్నారు. ఆ అహంకారం బాగా పెచ్చుమీరి.. చివరకు రాజకీయ ప్రత్యర్థుల్ని లేకుండా చేస్తే.. శాశ్వతంగా అధికారం దక్కుతుందనే దురాశతో.. ఎంతకైనా తెగిస్తున్నారు. దిగజారుతున్నారు. నిరంతర అధికారం అనే అందమైన ఊహ వారిని కుదురుగా ఉండనివ్వటం లేదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా దురాలోచనలు చేసి.. రాజకీయ నైచ్యానికి తెగబడుతున్నారు.
ఏ రాష్ట్రానికైనా రాజకీయ నాయకత్వం ముందడుగు వేయకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. కేవలం కొన్ని సందర్భాల్లోనే ప్రజలు నేతల్ని నడిపిస్తారు. నడిపించగలరు. కానీ ప్రతిసారీ అదే జరగాలని ఆశించలేం. అలా అనుకున్నా.. ప్రస్తుతం ఏపీకి వచ్చే కొద్దో గొప్పో ఆదాయానికి ప్రభుత్వాల బాధ్యత కంటే ప్రజల భాగస్వామ్యమే ఎక్కువ అనేది బహిరంగ రహస్యం. ఈ సంగతి కేంద్రం ఇచ్చే నివేదికల్లోనూ ఎప్పటికప్పుడు తేటతెల్లమౌతూనే ఉంది. అంటే ప్రజలు తమ శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా.. ప్రభుత్వాల నుంచి కనీస తోడ్పాటు లేదనది నిష్ఠూరంగా ఉన్నా నిజం. ప్రజలు, ప్రభుత్వాలు పరస్పర అవగాహనతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. దేశంలో అభివృద్ధి చెందిన, ఆర్థిక ప్రగతి సాధించిన రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే జరిగింది. చివరకు ఉమ్మడి రాష్ట్రంలోనూ అదే జరిగింది. ఆ సంగతి ఏపీలో ప్రధాన పార్టీలకు తెలిసినా.. ఏమీ తెలియనట్టే ప్రవర్తిస్తున్నాయి. అసలు రాజకీయాన్ని ఎందుకు అంత సంక్లిష్టం చేస్తున్నారనేది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మపదార్ధం.
ఏదో ఒక సూత్రాన్నో, సిద్ధాంతాన్నో నమ్ముకుని రాజకీయం చేయొచ్చు. చేసిన పని చెప్పుకునో.. ఫలానా పని చేస్తామని చెప్పుకునో కూడా రాజకీయం చేయొచ్చు. కానీ ఏపీలో మాత్రం కలగాపులగం రాజకీయం నడుస్తోంది. ప్రజల బలహీనతలు, బలాలు, అన్నింటినీ మిళితం చేసి.. పార్టీల అవకాశాలు, స్థితిగతుల్ని బేరీజు వేసి.. కలగూరగంప వ్యూహాలు వండివార్చి.. తిమ్మినిబమ్మిని చేసి అధికారం దక్కించుకోవటమే పరమావధిగా రాజకీయం నడుస్తోంది. నేతలు కూడా ఎవరికి వారే వ్యక్తిగత అడ్వాంటేజీలు పెంచుకోవడం మీద దృష్టి పెడుతున్నారే కానీ.. పనిలోపనిగా జనం దగ్గర మంచి పేరు సంపాదించుకుందామని అనుకోవడం లేదు. పైగా కొందరైతే ఏరికోరి చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు. అలాగైతే ఎక్కువ పాపులర్ అవుతామనే లెక్కలు వేసుకుంటున్నారు. ప్రజాదరణ పొందడం అంత తేలిక కాదు కాబట్టి.. కనీసం ప్రజలు భయపడేలా చేయగలిగితే.. ఎందుకొచ్చిన గొడవలే అని జనం ఓటేస్తారనుకుంటున్నారనేది అనేది తేలాల్సిన అంశం. ఏపీ అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయనేది కేవలం నిపుణులే కాదు.. నీతి ఆయోగ్ కూడా ఏటా ఇచ్చే నివేదికల్లో చెబుతూనే ఉంది. కానీ ప్రధాన పార్టీలు మాత్రం కళ్ల ముందే కనిపిస్తున్న అవకాశాల్ని కసిగా పూడ్చేసి.. అరాచక రాజకీయానికి తెరలేపి ఆనందిస్తున్నాయి. అంతకుమించి ఇంకేం కావాలనే విధానంలో ఆలోచిస్తున్నాయి. ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం. ఏపీ చరిత్ర సమస్తం పరస్పర బూతులు, దాడుల మయం అనుకునే దుస్థితికి తీసుకొస్తారా అని సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంతకుముందు ప్రతిపక్షం ఎక్కడోచోట అవకాశం తీసుకుని చిన్న సమస్యను పెద్దది చేసి.. గలాటా చేసి.. ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించేది. కానీ ఏపీలో పరిస్థితి రివర్స్ అవుతోంది. ప్రతిపక్షం బుద్ధులు మారాయా.. లేదా అనే విషయం పక్కనపెడితే.. అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం రెచ్చిపోతున్నాయి. ఎవరికి వారు ఐదేళ్ల అలెగ్జాండర్ అనే భ్రాంతిలో బతికేస్తున్నారు. తామూ చెంగిజ్ ఖాన్లు కావాలనుకుంటున్నారు. అందుకోసం ప్రజాస్వామ్య వ్యూహాలకు పాతరేసి.. ఆటవిక వ్యూహాలకు ఆజ్యం పోస్తున్నారు. రాజకీయం అంటే ఎక్కువమందిని కన్విన్స్ చేయాలని చెప్పేవారు. కానీ ఏపీ పార్టీలు మాత్రం ఎక్కువమందిని భయపెట్టడమే రాజకీయమని నిరూపిస్తున్నాయి.
ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవటమే రాజకీయం కాదని ఏపీ పార్టీలు తేల్చేస్తున్నాయి. పైగా అడ్డంగా నరకటమే అసలైన రాజకీయం అనే యావలో పడిపోతున్నాయి. అంత పని చేయటానికి ప్రత్యర్థులు ఎక్కడ ఎప్పుడు ఎలా దొరుకుతారా అని మాటువేసి మరీ స్కెచ్ గీస్తున్నాయి. ఇదేం సంస్కృతి అని ఎవరైనా అడిగితే.. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ప్రత్యర్థులపైనే నెపం నెడుతున్నారు. వారు చెడ్డవారు సరే.. మీరెందుకు అదే రొంపిలో దిగాలంటే.. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని వీర లాజిక్కు లాగుతున్నారు. మొత్తం మీద పాటాపోటీగా అరాచకాన్నే రాజకీయంగా పండించాలని ప్రధాన పార్టీలు కంకణం కట్టుకున్న దుస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఎవరి హితోక్తులూ వినటానికి నేతలు సిద్ధంగా లేరు. అసలు వారికి తెలియకపోతే కదా వేరొకరు చెప్పటానికి అనే సెటైర్లూ పడుతున్నాయి. అన్ని విషయాల మీదా పూర్తి అవగాహనతో.. పర్యవసానాలపై పూర్తి స్పృహతోనే ఆటవిక రాజకీయం చేస్తున్నామన్నట్టుగా పార్టీలు, నేతలు తమ చర్యలతో చాటిచెబుతున్నారు.
ఇక్కడ ఎవరికీ ఏపీ రాజకీయాలపై ఉద్దేశపూర్వకంగా కక్ష ఉండదు. కానీ ఏపీ రాజకీయ పరిణామ క్రమం చూస్తున్నవారెవరికైనా ఒక ఆవేదన కలగటం సహజం. ఇప్పటికే అభివృద్ధికి అవకాశం ఉండి కూడా.. ఏపీలో ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉందన్న అభిప్రాయాలున్నాయి. ఇది చాలదన్నట్టుగా లేని లా అండ్ ఆర్డర్ సమస్యను కూడా కొనితెచ్చుకోవటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి కచ్చితంగా ప్రధాన పార్టీలే సమాధానం చెప్పాలి. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలకు, ఆదరించిన ప్రజలకు మేలు చేయకపోగా.. మొత్తం రాష్ట్రానికే చెడ్డపేరు తెచ్చే అధికారం ఎవరిచ్చారో చెప్పాలి. ఎవరికి తోచినట్టు వారు తాత్కాలిక అధికారం కోసం అరాచకాన్ని సృష్టించుకుంటూ పోతే.. ఈ ఫలితాన్ని ప్రజలు ఎందుకు భరించాలో పార్టీలు, వాటి నేతలే ఆన్సర్ ఇవ్వాలి. చేతైతే ఏపీ సమస్యలు పరిష్కరించాలి. చేతకాకపోతే తమ వల్ల కాదని ప్రజల్ని క్షమాపణ కోరాలి. అంతేకానీ ఇలా రాజకీయ అరాచకత్వానికి తెరలేపటం.. క్షంతవ్యం కాదు. అసలు ఇలాంటి పార్టీలు, నేతలకు ప్రజాక్షేత్రంలో ఉండే అర్హత ఉందా.. లేదా అనేది పౌర సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఇంకా ఉపేక్షిస్తే ఈ అరాచక శక్తులు ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తాయో ఊహకు కూడా అందటం లేదు. ఇద్దరు మంచివాళ్ల మధ్య గొడవస్తే పరిష్కారం ఉంటుంది. ఒక మంచివాడు, ఒక చెడ్డవాడు కొట్టుకున్నా ఏదోలా పరిష్కారం చూపించవచ్చు. కానీ ఇద్దరు చెడ్డవాళ్ల గొడవను ఎవరూ పరిష్కరించలేరు. ఎందుకంటే నువ్వొకటంటే.. నేరెండంటా అనే పోకడతో ఏ తగవూ తెగదు. ఏ సమస్యా కొలిక్కిరాదు. ఏపీలో రాజకీయాలు ఎంతగా దిగజారాయంటే.. పొరపాటున ఎవరైనా మంచి పని చేసినా.. ఆ పని మంచిది కాదు చెడ్డదే అని ప్రత్యర్థులు పనిగట్టుకుని నిరూపిస్తున్నారు. అసలు పనిచేయకముందే.. మంచి ప్రయత్నాన్నే శాయశక్తులూ వినియోగించి అడ్డుకుంటున్నారు. తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు పొరపాటున కూడా మంచి పని జరకుండా, జరగనీయకుండా ప్రధాన పార్టీలు సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నాయి. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.