Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chairmans Desk: రాజకీయ పార్టీలన్నాక రాజకీయం చేయాలనే కాన్సెప్ట్‌ను ఎవరూ కాదనడం లేదు. కానీ అలాగని ప్రజలు, వారి సమస్యల గురించి మర్చిపోయి.. కేవలం రాజకీయమే పరమావధిగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఎప్పటికప్పుడు పౌరసమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న. దేశంలో పార్టీలు గాడి తప్పినప్పుడల్లా.. ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాలనను గాలికొదిలేసి.. రాజకీయాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టడం విమర్శలకు తావిస్తోంది. సహజంగా ఎన్నికల ఏడాదిలో పాలన వెనక్కిపోయి.. రాజకీయం ముందుకొస్తుంది. దీన్ని సహజ పరిణామంగా ప్రజలు కూడా చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న తీరే వేరు. పొద్దున లేచిన దగ్గర్నుంచీ.. పడుకునే దాకా.. ఎన్నికలు ఉన్నాయా.. లేదా అనే విషయంతో సంబంధం లేకుండా అనుక్షణం రాజకీయ మంత్రమే పఠిస్తున్నాయి పార్టీలు. ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఎవరికి వారు నిత్యం రాజకీయ గంగా ప్రవాహంలో మునిగి తేలుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు.. ప్రజాసమస్యలు వదిలేసి.. ప్రత్యర్థుల్ని వెంటాడటం, వేటాడటమే పనిగా పెట్టుకున్నాయి. పోనీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలైనా.. కాస్త ప్రజల పక్షాన పోరాడుతున్నాయా.. అంటే అదీ లేదు. అక్కడ కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. అలాగని దేశంలో, రాష్ట్రాల్లో ప్రజాసమస్యలు లేవా.. అంటే ఎందుకులేవు. చాలా ఉన్నాయి. కానీ పార్టీలు మాత్రం సమస్యల పరిష్కారం పక్కనపెడితే.. అసలు వాటి ఉనికిని గుర్తిస్తున్న దాఖాలలు కనిపించడం లేదు. ఇదే అంశంపై ఇవాళ్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
దేశంలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో గానీ ఇప్పుడు కేవలం రాజకీయాలే నడుస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లేదు.. పాలన లేదు.. ప్రతిపక్షాలు, పాలకపక్షాలు అందరూ జనాన్ని, జనం సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారు. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు, రాజకీయాలకు కావాల్సిన ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు. జనజీవితాలు ఎంత అధ్వాన్నంగానైనా ఉండనీ.. ఏ సమస్యలైనా రానీ.. కాలమే వాటిని పరిష్కరించాలి.. జనం వాళ్ల చావు చావాలి తప్ప లీడర్లు మాత్రం.. రాజకీయాలే చేస్తారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ తో అంతర్జాతీయంగా మనం అభాసుపాలయ్యాం. దేశం మొత్తానికి సంబంధించిన ఒక పరీక్షను సమర్థంగా నిర్వహించలేక కేంద్రం చతికిలపడింది. ఒకటికాదు, రెండుకాదు, నాలుగుసార్లు నీట్ పేపర్ లీక్ అయ్యింది. ఈ ఘోరాన్ని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కానీ, కేంద్రంలో ఎవ్వరికి చీమ కుట్టినట్టైనా లేదు. ఏళ్లకు ఏళ్ల కష్టపడి పరీక్షలు రాసి అవి రద్దైపోతే ఆ పిల్లల ఆవేదన ఎలా ఉంటుందో ఎవ్వరికి పట్టడం లేదు. కనీసం ఇలాంటి సంఘటనపై ప్రభుత్వం సిగ్గుకూడా పడటం లేదు. నీట్ పరీక్ష రాయటానికి వచ్చే విద్యార్థుల్ని నఖశిఖపర్యంతం క్షుణ్ణంగా తనిఖీలు చేసే యంత్రాంగం.. కీలకమైన పేపర్ తయారీ, దాని గోప్యత విషయాన్ని మాత్రం గాలికొదిలేస్తోంది. ఏటా నీట్ పరీక్ష సమయంలో జరిగే విద్యార్థుల తనిఖీలపై బోల్డన్ని ఆరోపణలున్నాయి. అయినా సరే ఏవో తిప్పలు పడి.. బాధని దిగమింగుకుని.. విద్యార్థులు చచ్చీచెడీ పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కోసం అధికార యంత్రాంగం పెట్టే బాధల్ని పంటి బిగువన ఓర్చుకుంటున్నారు. దీంతో విద్యార్థులంటే అలుసైపోయినట్టుగా ఉంది. అందుకే లక్షల మంది విద్యార్థులు పోటీపడే పరీక్ష పేపర్‌ను యథేచ్ఛగా లీక్ చేసి.. చివరకు బాధ్యులపై చర్యలు తీసుకోవటానికి కూడా మీనమేషాలు లెక్కించే తోలు మందం వ్యవస్థలు పోగుపడ్డాయి.
Also Read
- Chairman's Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
- Chairman's Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
- Chairmans Desk : ప్రొడక్షన్ క్వాలిటీ పేరుతో జరుగుతున్నదేంటి..?
- Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
చివరకు లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు నీట్ ప్రవేశపరీక్ష నిర్వహణ బాధ్యత తమదేనని కూడా ప్రభుత్వం భావించడంలేదు. ఇదే సమయంలో ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనేదానిపై పార్టీలు బిజీగా ఉన్నాయి. బెంగాల్లో తృణమూల్‌ను ఎలా అంతం చేయాలి.. ఆ పార్టీ ఎంపీలను ఎలా కొనాలి.. శివసేనను ఎలా చీల్చాలి.. ఎన్సీపీని ఎలా బలహీన పరచాలి.. అందుకు తెరవెనుక ఏ ఏ కసరత్తులు చేయాలి ఈ పనిలో బీజేపీ నాయకులు ఎంపీలు.. బిజీగా ఉన్నారు. నీట్ పరీక్ష వైఫల్యంపై కేంద్రంలోని పెద్దలు ఒక్కరు కూడా ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అది మనదేశంలో అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి.
పిల్లలు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో.. ప్రధాని వాళ్లకు సుద్దులు చెబుతుంటారు. కానీ పరీక్షలు ఎలా నిర్వహించాలో అధికారులకు ఎందుకు చెప్పరు..? కేవలం నీట్ మాత్రమే కాదు, దేశంలో చాలా ప్రధాన సమస్యలను కేంద్రం గాలికి వదిలేసింది. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి క్షీణించిపోతుంది. డాలర్‌తో పోల్చినపుడు రూపాయి వందకు చేరువలో ఉంది. పెట్రోలు లీటర్ 120 రూపాయలైంది. బంగారం కొనొద్దని ప్రభుత్వమే చెబుతోంది. కూరగాయలు, నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. సామాన్యుడి బతుకు దుర్భరంగా తయారైంది. మధ్యతరగతి వాడి బతుకు మరీ దారుణంగా ఉంది. అయినా కేంద్రంలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా కూల్చాలి, వేరే పార్టీల నేతలను ఎలా తరలించాలి, ఈ పనిమీదే కేంద్రంలోని పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. ఇక ఈడీ, సీబీఐ, ఐటీ అధికారంలో ఉన్నవారికోసమే పనిచేస్తూ వాళ్ల ప్రత్యర్థులను వేటాడే పనిలో బిజీగా ఉంటున్నాయి. సామాన్యుడికి రక్షణ ఇవ్వాల్సిన కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే పనిలో .. తమ కనీస వృత్తి ధర్మాన్ని ఎన్నడో గాలికి వదిలేశాయి. అసలు ఏ వ్యవస్థల మీద ప్రభుత్వాలకు పట్టుండటం లేదు. వ్యవస్థలు వాటికవే కిందామీద పడి పనిచేస్తున్నాయి. అంతేతప్పా, ప్రభుత్వాలకు వాటిపై ఏస్థాయిలోనూ పట్టుదొరకడం లేదు. రిటైల్ వ్యాపారులు , రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నేలకొరిగిపోయాయి. వాటికి పునరుజ్జీవం ఎలా ఇవ్వాలనే కసరత్తే జరగడం లేదు.
రాజకీయ సుస్థిరత ఉంటే.. దేశం బాగుపడుతుందనుకున్న జనం ఆలోచనల్ని పార్టీలు మొగ్గలోనే తుంచేస్తున్నాయి. తమ మీద అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దనే సంకేతాలిస్తున్నాయి. ఎక్కడైనా ఒక్కసారి తప్పు జరిగితే మరోసారి జరగకుండా చూసుకోవాలి. ఏ సమస్యకైనా మూలం ఎక్కడుందో కనిపెట్టి.. అక్కడ్నుంచి పరిష్కారం చూడాలి. అంతేకానీ ఎన్నిసార్లు పేపర్ లీకైనా.. తాత్కాలికంగా హడావుడి చేసి.. ఆ తర్వాత షరామామూలుగానే వదిలేస్తున్నారు. చివరకు సుప్రీంకోర్టు సూచనలకు మన్నన దక్కడం లేదంటే.. ఇక దేశంలో సామాన్యుడి గురించి పట్టించుకునేదెవరనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎక్కడైనా అధికార పక్షం బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షం కూడా ప్రజల తరపున బాధ్యత తీసుకోవాలి. ప్రజాస్వామ్య రథం సరిగా నడవాలంటే అధికార, ప్రతిపక్షాలనే రెండు చక్రాలూ సజావుగా నడవాలని రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడో నిర్దేశించారు. కానీ దేశంలో పార్టీలు మాత్రం ఆ సూత్రాల్ని ఎప్పుడో గాలికొదిలేశాయి. వేటికవే స్వీయ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పొలిటికల్ షో నడిపిస్తున్నాయి. ఈ మధ్యలో సామాన్యులు,వారి సమస్యలు, వేదనలు అన్నీ మట్టికొట్టుకుపోతున్నాయి. ఓవైపు సాంకేతికత పెరుగుతోంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతోంది. ప్రతిపక్షాలకు కూడా ప్రజాసమస్యలు తెలిసే మార్గాలు పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం ఏ వైపు నుంచీ రావడం లేదు. పైగా ఈరోజు కంటే నిన్నే మెరుగు అని నిట్టూర్చాల్సిన దుస్థితిలో సామాన్యులున్నారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత.. ప్రభుత్వాల బడ్జెట్ దగ్గర్నుంచీ సగటు కుటుంబ ఆదాయం వరకు.. ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ప్రతి అంశమూ చాలా ముఖ్యమైనది. అంతేకాదు ప్రస్తుత ప్రపంచంలో ఓ దేశం ఎంతగా పురోగమించిందో చెప్పటానికి ఆర్థిక గణాంకాలకు మించిన రుజువులు మరేవీ లేవు. కానీ ఇంత కీలకమైన ఆర్థిక రంగాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా.. అంటే లేదనే చెప్పాలి. సరే అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధాలు, సంక్షోభాల ప్రభావం మన ఆర్థికవ్యవస్థపై పడుతుంది. ఒక్కోసారి అది మన నియంత్రణలో లేకుండా పోతుంది అనే వాదన నిజమే అనుకుందాం. కానీ అంతమాత్రాన ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి పట్టించుకోలేవు. ఏ దేశానికైనా దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి. అందుకోసం క్రమపద్ధతిలో ఓ కార్యాచరణ రూపొందించుకోవాలి. అంతర్జాతీయ పరిణామాల్ని ఓ కంట గమనిస్తూనే.. మరోవైపు మన దారిలో మనం గమ్యం దిశగా సాగుతూనే ఉండాలి. ఒక్కోసారి ప్రయాణం వేగం పుంజుకోవచ్చు. మరికొన్నిసార్లు నిదానించవచ్చు. కానీ ఎప్పుడూ ఆగకూడదు. మరీ ముఖ్యంగా క్రాస్‌రోడ్స్ లో నుంచుని దిక్కుతోచని స్థితిలో దిక్కులు చూసే దుస్థితి అసలే రాకూడదు. మరి దేశంలో ఆర్థికవ్యవస్థ ఇప్పుడేతీరుగా ఉందో.. ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది ఎలా ఉందో దేశ ప్రజలందరికీ తెలుసు.
ఇక్కడ ఒక సమస్య అని కాదు. ఒక రంగమని కాదు. ఏతావాతా దేశం ముందు అనుకుంటే.. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ఉండాలి. అంతేకానీ నినాదాలు ఒకలా.. ఆచరణ మరోలా ఉంటే.. లక్ష్యాన్ని ఎలా చేరుతామనేది ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సిన విషయం. అఫ్కోర్స్ ఈ లక్ష్య సాధనకు ప్రజల సహకారం కూడా కావాలనేది కాదనలేని సత్యం. కానీ మొదట ప్రభుత్వాలు తమ బాధ్యతను తాము సరిగా నిర్వర్తిస్తే.. అప్పుడు పౌరుల నుంచి కూడా బాధ్యతను డిమాండ్ చేసి తీసుకోవచ్చు. గతంలో దేశాన్ని ముందుకు నడిపిన జాతి నేతలు.. అవసరమైనప్పుడు తాము త్యాగం చేసి.. దేశ ప్రజలంతా త్యాగం చేయాల్సిందేనని గట్టిగా అడగగలిగారు. మరి ఆ పరిస్థితుల్లో ఇప్పటి నేతలున్నారా.. లేదా అనేది కచ్చితంగా వారు ఆత్మావలోకనం చేసుకోవాల్సిందే.
మనది సమాఖ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరి అధికారాలు వారికున్నా.. అంతిమంగా రాష్ట్రాలన్నీ కేంద్రాన్నే ఆదర్శంగా తీసుకుంటాయి. మంచైనా, చెడైనా కేంద్రాన్ని గుడ్డిగా ఫాలో కావడం మన దేశంలో మొదట్నుంచీ ఉన్న ఆనవాయితీ. చివరకు ప్రత్యర్థి పార్టీలైనా సరే.. ప్రభుత్వం, పాలన విషయానికొచ్చేసరికి రాష్ట్రాలు కేంద్రం నుంచి మార్గదర్శకాలు, సూచనల కోసం ఎదురుచూస్తుంటాయి. అలాంటప్పుడు కేంద్రం తీరును బట్టి రాష్ట్రాలు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలో పాలన కంటే రాజకీయాలపై పెద్దపీట దక్కుతున్నప్పుడు.. రాష్ట్రాల్లో మాత్రం.. అందుకు విరుద్ధంగా జరగాలని ఎలా ఆశించగలం..? పైగా అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఇక్కడ పార్టీలు వెలగబెడుతున్నాయి. పైగా జాతీయస్థాయిలో చేసే రాజకీయాలతో పోలిస్తే.. రాష్ట్రస్థాయిలో రాజకీయాలు ఎప్పుడూ మరికాస్త వాడివేడిగానే ఉంటాయి.
విజయవాడలో ఒక రౌడీ షీటర్‌ను పోలీసులు ఎత్తుకెళ్లి చంపి కాల్చి బూడిద చేసేశారంటే, ఇక్కడ పోలీసు వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. అర్థమవుతుంది. ప్రభుత్వానికి పోలీసులపై ఏమాత్రం పట్టులేదని ఒక నియంత్రణ లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎంత రౌడీషీటర్ అయినా.. చట్టబద్ధంగా విచారణ జరిపి.. న్యాయబద్ధంగా శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఇక్కడ జరిగింది వేరు. అసలు ఎక్కడున్నాడో.. ఉన్నాడో.. లేదో కూడా చెప్పకుండా.. తల్లిని మానసిక క్షోభకు గురిచేయడం, పైగా పోలీసులే స్వయంగా తల్లిని స్టేషన్‌కు పిలిపించి మరీ నీ కొడుకుని చంపేస్తామని బెదిరించడం.. బరితెగింపుకు పరాకాష్టగా నిలుస్తోంది. అంతేకాదు.. తమను ఎవరూ ఏమీ చేయలేరనే ధిక్కార ధోరణి అడుగడుగునా కనిపిస్తోంది. ఇక తునిలో ఒక చిన్నారి మాయమై పదిహేను రోజులైతే ఇండియాలో టాప్ టెక్నాలజీ స్టేట్ డ్రోన్ల సాయంతో నడిచే ప్రభుత్వ యంత్రాంగం ఆ చిన్నారి ఎలా ఉందో ఎక్కడుందో ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మామూలు రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ కొత్త టెక్నాలజీ వచ్చినా తాము అడాప్ట్ చేసుకుంటున్నామని గొప్పలు చెబుతారు. కానీ అవసరానికి ఏదీ అక్కరకు కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాదా? ఆ మాటకొస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేయడం లిక్కర్ అమ్ముకోవడం.. తప్ప అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుంది..? అదేదో రేపే ఎన్నికలు అన్నట్లు నిత్యం సభలు సమావేశాలు.. ప్రత్యర్థులపై మాటల దాడి.. బూతుల పంచాంగం.. సోషల్ మీడియాలో .. ఒకరిపై ఒకరు కుట్రలు.. ఇవి మాత్రమే నడుస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ పాలన వ్యవహారాలు ఎక్కడా కనిపించడం లేదు.
ఇక్కడ కేంద్రంలో ఎలా ఉంటే.. రాష్ట్రంలోనూ అలాగే ఉండాలనే రూలేం లేదు. మామూలుగా విధానాల అమలుకు వచ్చేసరికి.. మా దారి మాదే అన్నట్టుగా వ్యవహరించే రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజాసమస్యల్ని పట్టించుకోకుండా వదిలేసే విషయంలో మాత్రం కేంద్రాన్ని తుచ తప్పకుండా ఫాలో కావడం వింతల్లోకెల్లా వింత. అంతిమంగా పార్టీలన్నీ ఆ తానుముక్కలే అనే విషయం ఇలాంటి సందర్భాల్లోనే రుజువవుతూ ఉంటుంది. చివరకు రైతుల సమస్యల్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒంగోలులో మద్దతు ధర కోసం పొగాకు రైతులు రోడ్డెక్కి.. ట్రాక్టర్ల ధర్నాతో నిరసన తెలిపినా.. ఎవరికీ పట్టడం లేదు. ఎవరేమనుకున్నా.. మేమింతే అన్నట్టుగా ఉంది పార్టీల తీరు. కేంద్రం అయినా.. రాష్ట్రం అయినా ప్రభుత్వం అన్నాక కొన్ని బాధ్యతలుంటాయి. ఓ రాజకీయ పార్టీగా రాజకీయం చేయడం తప్పు కాకపోవచ్చేమో కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా పాలనా బాధ్యతలు గాలికొదిలేయటం.. కచ్చితంగా తప్పే. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. తమ సమస్యల్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో తీర్చలేకపోయినా.. కనీసం సమస్యల పరిష్కారానికి తమకు తోడుగా ఉంటాయని ఆశించడం అత్యాశ కానే కాదు. ఆ మాత్రం కూడా చేయూత ఇవ్వనప్పుడు.. ఇక ప్రభుత్వాలు ఉండి తమకేం ప్రయోజనం అని ప్రజలు అనుకుంటే.. వారికి పార్టీలు ఏం సమాధానం చెబుతాయి..? ఎందుకంటే ప్రభుత్వంగా ఏం చేయాలో ఎవరూ పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ బాధ్యతలేంటో అధికారంలో ఉన్న పార్టీలన్నింటికీ క్లారిటీ ఉంది. అయినా సరే ప్రజాసమస్యలపై శీతకన్నేసి.. రాజకీయాల్లో మునిగితేలుతున్నాయి పార్టీలు. నిజానికి ప్రభుత్వాలు ఎక్స్‌ట్రామైల్ వెళ్లి ఆలోచించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ కనీస బాధ్యతలే పట్టని ప్రభుత్వాలు.. అంతకు మించి ఆలోచిస్తాయనుకోవడం అడియాసే అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు రాజకీయాలు వదిలేసి.. ప్రజాసమస్యలపై ఫోకస్ చేయాలంటే.. ఏం చేయాలా అని సామాన్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి.. ఎవరో ఒకరు ప్రభుత్వాల రూటుమార్చి.. సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నారు. కానీ అలా చేసేదెవరు..? ఎలా చేస్తారనేదే ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.
అప్పటికీ పౌరసమాజం తనవంతుగా ప్రభుత్వాలకు బాధ్యతలు గుర్తుచేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలను ప్రభుత్వాలు అసలే పట్టించుకోవడం లేదు. అదేమంటే పబ్లిసిటీ స్టంట్లు అనటానికి కూడా వెనుకాడటం లేదు. అంతేకానీ ఓ పార్టీ కాకపోతే మరో పార్టీ అయినా.. మన పని మనం సరిగ్గా చేస్తే.. ఇలాంటివాటికి స్థానం ఎక్కడుంటుంది అని సహేతుకంగా ఆలోచించడం లేదు. కొన్ని పార్టీలు ఇంకా దిగజారి.. ప్రజల నిరసనల్లోనూ రాజకీయాన్నే చూస్తున్నాయి. పోనీ వాటిని కాసేపు రాజకీయ నిరసనలు అనుకున్నా కూడా.. అప్పుడు కూడా సమస్య అయితే నిజమే కదా అనే ఆలోచన కరువవ్వటం మరింత శోచనీయం. ఏతావాతా ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయనే సంగతిని పార్టీలు కన్వీనియంట్‌గా మర్చిపోతున్నాయి. అంతేకాదు అధికారం దక్కేదాకా ఓడ మల్లన్న.. తీరా పవర్ చేతికి వచ్చాక బోడి మల్లన్న అంటున్నాయి. ప్రజలు తమను ప్రభుత్వంలో కూర్చోబెట్టింది.. తమకు జవాబుదారీగా ఉండి.. బాధ్యతాయుత పాలన అందించటానికే అనే సంగతి ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. పైగా అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయకపోగా.. దాన్ని దుర్వినియోగం చేసి.. రాజకీయ లబ్ధి చేసుకునే ప్రయత్నాలు మాత్రం నిష్ఠగా చేస్తున్నాయి. ఇలాంటి పనులు చేస్తూ కూడా.. పార్టీలన్నీ తాము సరిగానే వ్యవహరిస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడమే అసలైన చోద్యం.
ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం ఏ స్థాయికి వెళ్లిందో చెప్పటానికి.. రోజుకో కొత్త సమస్య పుట్టుకురావడానికి మించిన ఉదాహరణ అక్కర్లేదు. ప్రభుత్వాలు నడిపే పార్టీలు ఎలాగూ దీర్ఘకాలిక సమస్యల్ని పట్టించుకోవు. బాగా కష్టపడి పరిష్కారం వెతకాల్సిన వాటి జోలికే పోవు. కనీసం సీజనల్ సమస్యలకైనా పరిష్కారాలు చూస్తున్నాయా అంటే అదీ లేదు. పైగా ఉన్న సమస్యల్ని పరిష్కరించలేకపోగా.. తమ నిర్వాకంతో కొత్త సమస్యలు పుట్టుకొచ్చేలా చేయడంలో ప్రభుత్వాలు ఆరితేరాయి. దీంతో ప్రభుత్వం దృష్టిపడితే సమస్యలు పరిష్కారమౌతాయనే భావన పోయి.. సర్కారు వేలు పెడితే.. ఇక అంతే అనే ప్రమాదకర ఆలోచనలు ప్రజల్లో పెరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
సమస్యలకు పల్లె, పట్నం అనే తేడా లేదు. ఆ సమస్యలు వచ్చే ప్రాంతాల ఆదాయాలతోనూ పట్టింపు లేదు. కొన్నిచోట్ల ముందుచూపు లేక.. మరికొన్నిచోట్ల నిర్లక్ష్యంతో.. ఇంకొన్నిచోట్ల బాధ్యతారాహిత్యంతో.. ఇలా రకరకాల కారణాలతో ఎక్కడచూసినా సమస్యలు పేరుకుపోతున్నాయి. చివరకు హైదరాబాద్ నగరంలో గట్టిగా 7 సెం.మీ. వాన పడితే, ఆరుగంటలు ట్రాఫిక్ జామ్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు జనం. ఈ సమస్య ఇప్పటిది కాదు. కానీ ఏళ్లు గడిచినా పరిష్కారం చూపలేకపోవడం కచ్చితంగా యంత్రాంగం వైఫల్యమే. ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వాలు, కొత్త వ్యవస్థలు.. కొత్త ప్రయత్నాలు ఏం వచ్చినా.. జరుగుతున్నా.. సమస్యకు మాత్రం పరిష్కారం దొరకటం లేదు. రెగ్యులర్‌గా నీళ్లు నిలిచే ప్రాంతాలకు తోడుగా.. కొత్తగా నీళ్లు నిలిచే ప్రాంతాలు పుట్టుకొచ్చి.. అధికారులతో పాటు సామాన్యులకూ పెను సవాల్ విసురుతున్నాయి. దీంతో అందరూ వానలు పడాలని కోరుకుంటుంటే.. హైదరాబాదీలు మాత్రం వాన రావద్దని వరుణ దేవుడిని వేడుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాదీల బాధ ఇలా ఉంటే.. రైతులు విత్తనాలు దొరక్క, యూరియా దొరక్క రోజుల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఈ విషయంపైనా పార్టీలు సీరియస్‌గా దృష్టి పెట్టేకంటే.. ఇక్కడ కూడా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కావడం ప్రజల దురదృష్టం తప్ప మరోటి కాదు. అసలిలా సమస్యలు పేరుకుపోవడం.. వాటి పరిష్కారాలపై కనీస ఆలోచన లేకపోవడం.. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాదా? రాజకీయాలపై పెట్టే సమయంలో కొంతైనా పాలన వ్యవహారాలపై పెడితే, కేంద్రం , రాష్ట్రప్రభుత్వాల పనితీరు బాగుపడదా? కానీ పాలక ప్రతిపక్షాలన్నీ రాజకీయాలే చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ చేయాలని అనుకోవడంలేదు.
మంచి పాలన అందిస్తే పేరొస్తుంది. అంతే కదా. అదే గట్టిగా రాజకీయం చేస్తే.. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటాం. అధికారం చేతిలో ఉంటే.. ఏమైనా చేయొచ్చు. ఎవర్నైనా ఆడించవచ్చు. ఇంతకు మించి పార్టీలేవీ ఎక్కువ ఆలోచించటానికి ఇష్టపడటం లేదు. గతంలో ప్రభుత్వాలు విమర్శల ఉధృతి పెరిగినప్పుడైనా కాస్త సిగ్గుపడేవి. కానీ రానురానూ తోలుమందం ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎంతసేపూ తాము అనుకున్నది చేయడమే తప్ప.. ప్రజలు ఏమనుకుంటున్నారు.. సమాజం ఏం అడుగుతోంది అనే విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. అదేమంటే తాత్కాలికంగా కన్నీళ్లు తుడిచేసి.. అంతటితో సరిపెట్టుకోమని ముఖం మీదే చెబుతున్నారు. ఇంకా మాట్లాడితే.. మీకేం తెలుసు ప్రభుత్వాల బాధలు..? అంటూ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. వారి మాటలు వింటే ప్రజాసమస్యల పరిష్కారం ప్రభుత్వాల బాధ్యతా..? ప్రభుత్వాలపై ఈగ వాలకుండా చూసుకోవడం ప్రజల బాధ్యతా..? అనే ప్రశ్నలు కూడా దూసుకొస్తున్నాయి.
మొత్తం మీద రాజకీయం చేయడంలో ఆరితేరిన పార్టీలు.. ప్రజాసమస్యలతో కూడా రాజకీయమే చేస్తున్నాయి. దీంతో సరళంగా కనిపించే పరిష్కారాలు కూడా సంక్లిష్టంగా మారుతున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వం కాస్త దృష్టిపెడితే పరిష్కారమయ్యే సమస్యలు కూడా పార్టీల రాజకీయం పుణ్యమా అని బ్రహ్మపదార్ధంగా మారుతున్నాయి. అసలే సమస్యలతో సతమౌతున్న సామాన్యులకు.. పార్టీల రాజకీయం గోరుచుట్టుపై రోకటిపోటులా మారుతోంది. దేనికైనా వేళాపాళా ఉండాలని విసుక్కుంటున్నా కూడా పార్టీలు వినిపించుకోవడం లేదు. పనిగట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్ని కూడా రాజకీయ రంగస్థలాలుగా మార్చడంతో.. ప్రజలకు ప్రభుత్వాలు అంటేనే ఓ రకమైన విరక్తి వస్తుందేమో అనే సందేహాలొస్తున్నాయి.
తమ పని తాము చేయటానికి నిబంధనలు వెతికే ప్రభుత్వాలు.. ప్రజా సమస్యల పరిష్కారం ఎలాగూ ముందే వదిలేశాయి. కానీ రాజకీయం చేయటానికి మాత్రం నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ.. కనీస మర్యాదకూ తిలోదకాలిచ్చేస్తున్నాయి. అదేమంటే.. ఆమాత్రం రాజకీయం చేయకపోతే.. పార్టీయే ఉండదు.. ఇక ప్రభుత్వం సంగతి దేవుడెరుగు అని బహిరంగంగానే చెబుతున్నాయి. ఎక్కడా ప్రజలేమనుకుంటారోనని మొహమాటపడటం లేదు. ఐదేళ్లూ అధికారంలో ఉన్న పాపానికీ కొన్ని సమస్యలైనా పరిష్కరించాలి కదా అనే చాదస్తానికి నీళ్లొదిలేస్తున్నాయి. పైగా ఏ పనీ చేయకుండా.. మళ్లీ అధికారంలోకి రావడమెలాగా అని పార్టీలన్నీ నిత్యం పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనల సారమే నిత్య రాజకీయం అనే విశ్లేషణలు కూడా లేకపోలేదు. చివరకు పార్టీలన్నీ కలిసి.. రాజకీయమే ముందు.. పాలన తర్వాతే అనే సూత్రానికి ఏకగ్రీవంగా ఓటేశాయని తేలిపోయింది. అంతేకాదు అనవసరంగా ప్రజాసమస్యల పరిష్కారం అనే రొంపి లోకి దిగితే.. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అనుకోవాల్సి వచ్చే ప్రమాదముందని శంకిస్తున్నాయి. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.
తాజావార్తలు
-
Chairman’s Desk: అసలు ప్రభుత్వాల బాధ్యతేంటి..? పార్టీలు చేస్తున్న పనేంటి..?
-
Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
-
TG20 League: 4,6,6,4,6,6 బ్యాటింగ్ విధ్వంసం.. 32 బంతుల్లో సెంచరీ..
-
Mega Surprise: మా ఇంటి బంగారానికి చిరు సత్కారం
-
Sachin Tendulkar Viral Video: వర్షంలో చిన్నపిల్లాడిగా మారిపోయిన సచిన్.. వైరల్‌గా మారిన వీడియో
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!