తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్షాలపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మెరుగైన ఫలితాల సాధనతో.. క్షేత్రస్థాయిలో కూడా కాంగ్రెస్ క్యాడర్ బలోపేతమైంది. ఈ విషయంలో రేవంత్ అండ్ టీమ్ సక్సెస్ అయ్యారని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దగ్గర్నుంచి తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపోల్స్‌లో కాంగ్రెస్ విజయాల ఊపు కొనసాగుతోంది. అంతమాత్రాన మున్సిపల్ ఫలితాలను రెఫరెండంగా చూడలేం. ఎందుకంటే కొన్నిచోట్ల ఇది రెఫరెండం కావచ్చు. మరికొన్నిచోట్ల కాకపోవచ్చు. దీనికి తోడు సాధారణంగా స్థానిక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సంప్రదాయం. అలాగని ఈ ఫలితాల్ని ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికంగా తీసుకోలేం. అటు ఏపీ అనుభవం చూసుకున్నా.. స్థానిక ఎన్నికల్లో ఏకంగా 96 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన వైసీపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడింది. కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ జాగ్రత్తపడాలి. ఈ ఫలితాల జోష్‌ను, క్షేత్రస్థాయిలో పెరిగిన క్యాడర్ బలాన్ని ఉపయోగించుకుని.. సరైన వ్యూహంతో ముందుకెళ్లాలి. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 85శాతం పురపాలక సంఘాలు కైవసం చేసుకోవడం.. ఏడింటిలో ఆరు కార్పొరేషన్లు స్పష్టంగా దక్కించుకోవడం.. ఆ పార్టీ నాయకత్వంలోనూ.. కేడర్‌లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేయడం ద్వారా తెలంగాణ ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని.. కాంగ్రెస్ నిరూపించుకుంది. తమకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన గెలుపు .. గాలివాటం గెలుపు కాదని, ప్రజలు స్పష్టంగా తమవైపు ఉన్నారని.. వరుస విజయాల ద్వారా కాంగ్రెస్ నిరూపించుకుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గత మూడు దశాబ్దాల్లో ఎఫ్పుడూ కాంగ్రెస్‌కు ఇంతటి ఫలితాలు రాలేదని పలువురు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. సమష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైందని ఇప్పటికే సీఎం ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి రాష్ట్రస్థాయిలో జరిగినవి పంచాయతీ ఎన్నికలు. వాటిల్లోనే అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ శాతం విజయాలు సాధించారు. అయితే అప్పుడు తమ ఓటమిని అంగీకరించటానికి ప్రతిపక్షాలకు మనసొప్పలేదు. పైగా పార్టీ రహిత ఎన్నికలు కావడంతో.. ఎవరికి వారు తమకు వచ్చిన స్థానాల సంఖ్య పెంచి చూపించారనే ఆరోపణలు కూడా చేశాయి. అంతటితో ఆగకుండా అసలు కథ మున్సిపోల్స్‌లో తేలుతుందని ప్రభుత్వానికి సవాల్ కూడా విసిరాయి. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల సరళిలో ఏమైనా మార్పు వస్తుందేమో అనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పుడు మున్సిపోల్స్ ఫలితాలు అందరి అంచనాలకూ తెరదించాయి. ఏకంగా 85 శాతం వరకు మున్సిపాల్టీలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.. తన సత్తా చాటింది. ఈ ఎన్నికలు పంచాయతీలకు భిన్నంగా పార్టీ గుర్తుల మీదే జరగడంతో.. ప్రతిపక్షాలకు కూడా ప్రజలే సరైన సమాధానం చెప్పినట్టయింది.
సాధారణంగా అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అలా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార పార్టీగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కొత్తేం కాదు. కానీ కాంగ్రెస్ కేవలం ఆ అడ్వాంటేజ్‌ను మాత్రమే నమ్ముకోలేదు. కట్టుదిట్టంగా ఎలక్షనీరింగ్ చేసింది. సీఎం నుంచి కార్యకర్త దాకా అందరూ సమష్టి కృషి చేశారు. మంత్రులందరికీ టార్గెట్లు ఫిక్స్ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలను లైట్ తీస్కోవద్దని, సీరియస్‌గా పనిచేయాల్సిందేనని సీఎం పదేపదే చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే తమ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో.. ఎక్కడికక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు.. మంత్రుల ఆధ్వర్యంలో పోటాపోటీగా పనిచేయడం కలిసొచ్చింది. దీంతో ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు కనీస పోటీ ఇవ్వలేక చేతులెత్తేశాయి. కొన్నిచోట్ల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా.. హస్తం పార్టీ జాగ్రత్తపడింది. దానికి సరైన ఫలితమే దక్కింది.
ఏ ఎన్నికనూ తేలికగా తీసుకోకూడదనే తెలంగాణ కాంగ్రెస్ విధానమే విజయాలు తెచ్చిపెడుతోందనేది ఆ పార్టీ నేతలు చెప్పే మాట. కాంగ్రెస్ నేతల మాటలు పక్కనపెడితే.. ఇతర పార్టీలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల కోసం అధికార పార్టీ ఎక్కువ కసరత్తు చేసిందని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. అప్పటికీ ప్రతిపక్షాలు కాంగ్రెస్ సన్నద్ధతపై విపరీతమైన సెటైర్లు వేశాయి. స్థానిక ఎన్నికలకు కూడా రాష్ట్రస్థాయి నేతల ప్రచారం ఏంటని, పాలన బాగాలేక.. అధికార పార్టీ ప్రచారంలో తంటాలు పడుతోందని ఆరోపణలు చేశాయి. కానీ ప్రతిపక్షాల సెటైర్లు పట్టించుకోని కాంగ్రెస్.. తాను అనుకున్న వ్యూహం అనుకున్నట్టు అమలుచేయడంపైనే ఫోకస్ పెట్టి.. ఫలితం సాధించింది.
గతంలో కాంగ్రెస్ అంటేనే అంతర్గత విభేదాలు కామన్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. సమష్టి కృషితో వచ్చే గెలుపుని రుచి చూసిన నేతలు.. ఇక ఆ రుచిని వదిలిపెట్టకూడదని డిసైడైయ్యారు. అందుకు అనుగుణంగానే అడపాదడపా అభిప్రాయభేదాలు వచ్చినా.. వాటిన మనసులో పెట్టుకోకుండా.. ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పనిచేయడం అలవాటుచేసుకున్నారు. ఈ పోకడ కాంగ్రెస్ కు పెద్ద అడ్వాంటేజ్‌గా మారిందనే విషయాన్ని వరుస ఎన్నికల విజయాలే చాటిచెబుతున్నాయి.
ఒక్కసారి నేతల స్థాయిలో ఐక్యత అలవాటుగా మారినప్పుడు.. అది కిందిస్థాయి వరకు బాగా పనిచేస్తోంది. క్యాడర్ కూడా మునుపటి మాదిరిగా గిల్లికజ్జాలు పెట్టుకోకుండా.. బాధ్యతలు పంచుకుని పనిచేయటానికి అలవాటుపడ్డారు. ఫలానా ప్రాంతంలో ఫలానా నేతే పనిచేయాలనే ఇగోకు పోకుండా.. ఎక్కడ ఎవరికి బలం ఉంటే.. వారు పనిచేసే కొత్త సిద్ధాంతం తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టుగా స్థానిక నేతలు, క్యాడర్ కూడా తమ బలాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కు వరుస విజయాలు సాధ్యమౌతున్నాయి. మరీ ముఖ్యంగా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కష్టాలు పడ్డ నేతలు, క్యాడర్.. మరోసారి అధికారాన్ని చేజార్చుకోకూడదనే పట్టుదలతో కనిపిస్తున్నారు. వీటన్నింటి ఫలితమే వరుస విజయాలని గాంధీభవన్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి.
ఏ ఎన్నికలొచ్చినా.. ప్రభుత్వపరంగా ఏం చేయాలో.. పార్టీ పరంగా ఎలా పనిచేయాలో ముందే బ్లూ ప్రింట్ రెడీ అవుతోంది. ముందుగా రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత బ్లూప్రింట్ కు తుదిరూపు వస్తోంది. ఒక్కసారి బ్లూప్రింట్ రెడీ అయ్యాక.. జిల్లాల వారీగా నేతల్ని పిలిచి మాట్లాడి.. బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరుగుతోంది. తర్వాత ఇంఛార్జ్ మంత్రుల బాధ్యతల గురించి చెబుతున్నారు. ఎవరికి వారు మెరుగైన సాధించాల్సిందేనని టార్గెట్లు పెడుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తంగా పార్టీకి ఉపయోగపడుతోందని తేలిపోయింది. ఇక్కడ సీఎం దగ్గర్నుంచీ కార్యకర్త దాకా ఎవరికీ మినహాయింపు లేదు. అంతిమ లక్ష్యం పార్టీ విజయమే. ఈ ప్రాథమిక సూత్రమే.. కాంగ్రెస్ ను గెలుపు బాట పట్టించిందనడంలో అతిశయోక్తి లేనే లేదు.
కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనమైన స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఆ పార్టీ కేడర్‌కు నిజంగా ఉత్తేజకరమైన గెలుపుగా చెప్పుకోవచ్చు. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడూ అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. తెలుగురాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువశాతం అధికార పార్టీనే గెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వ పనితీరుకు లోకల్‌బాడీ ఎన్నికలను కొలబద్దగా తీసుకోలేం. అలా అనుకుంటే ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ 96శాతం స్టైక్ రేట్‌తో లోకల్‌బాడీ ఎలక్షన్స్ గెలిచింది. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితమొచ్చిందో అందరం చూశాం. కాబట్టి.. స్థానిక సంస్థల ఎన్నికలు .. వాటి ఫలితాలు.. పార్టీ, ప్రభుత్వ పనితీరుకు ప్రాతిపదిక కాదు. కేవలం స్థానిక ఎన్నికల విజయాలే కొలమానంగా తీసుకుని.. ప్రజలందరూ సంతృప్తిగానే ఉన్నారని, ఇక మనకు ఢోకాలేదని పూర్తిగా ఆదమరిస్తే ప్రమాదం పొంచి ఉండొచ్చు. ఈ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ కూడా ఆత్మవిశ్వాసం మాత్రమే పెంచుకుని.. అతివిశ్వాసానికి పోకుండా సరైన కార్యాచరణ తీసుకోవడం కీలకం.
స్థానిక ఎన్నికల గెలుపును ప్రభుత్వ పనితీరుకు కొలమానం కాకపోయినా.. పార్టీ పరంగా అయితే కాంగ్రెస్ కు లబ్ధి చేకూరిందని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వల్ల కాంగ్రెస్ పార్టీకి.. తెలంగాణలో వ్యవస్థీకృతమైన కొత్త నిర్మాణం ఏర్పడింది. స్థూలంగా చెప్పాలంటే, ఆ పార్టీ వ్యవస్థీకృతంగా నిర్మాణాత్మకంగా బలపడినట్లే. ఆ విషయంలో సీఎం రేవంత్ అండ్ టీమ్ కచ్చితంగా సక్సెస్ అయ్యారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికవడం ద్వారా గ్రౌండ్ లెవల్లో పార్టీ కచ్చితంగా బలోపేతమవుతుంది. ఇలా పెరిగిన బలం భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఉపయోగపడుతుంది. అప్పటివరకూ.. క్షేత్రస్థాయిలో పెరిగిన క్యాడర్ ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలా చూసుకుంటే.. ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ చేసింది చెప్పుకోవటానికి కావాల్సినంత అవకాశం దక్కుతుంది. అదే విధంగా ప్రభుత్వ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా క్యాడర్ ద్వారా అభిప్రాయ సేకరణ చేసే వీలుంటుంది. తద్వారా ప్రభుత్వ పరంగా కూడా లోటుపాట్లు సరిచేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది. కాకపోతే పెరిగిన క్యాడర్‌కు ఎప్పుడూ చేతి నిండా పని కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఇక్కడ ప్రతి ఎన్నికకు అజెండా వేరుగా ఉంటుందనే వాస్తవాన్ని విస్మరించటానికి వీల్లేదు. అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటేసే సమయంలో ఓటర్లు దృష్టిలో పెట్టుకునే అంశాలు వేరుగానే ఉంటాయి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో స్థానిక సమస్యలే కీలక పాత్ర పోషించాయి. దీనికి అనుబంధంగా రాష్ట్రస్థాయి అంశాలు ఉంటే ఉండొచ్చు కానీ.. పూర్తిగా స్థానిక అంశాల్ని పక్కనపెట్టే పరిస్థితి ఉండదు. అందుకే అగ్రనేతలు కూడా తమ ప్రచారంలో స్థానిక విషయాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవటానికి వీల్లేదు. ఇప్పుడు ఒకలా ఆలోచించిన ఓటర్లు కూడా రేపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ ఫలితాలను ఫైనల్‌గా తీసుకోవటానికి లేదు. ఇప్పటివరకు కాంగ్రెస్ కూడా అలాంటి పొరపాటు చేయలేదు. ప్రతి ఎన్నికకూ కొత్తగా కసరత్తు చేస్తూనే వచ్చింది. గతకాలపు సానుకూలతల్ని గుర్తుంచుకుందే కానీ.. వాటినే నమ్ముకుని.. ప్రస్తుత కసరత్తును పక్కనపెట్టేసే పిచ్చిపని చేయలేదు. ఇప్పుడు మున్సిపోల్స్ విజయం తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అలాంటి అడ్వాంటేజ్ చాలా అరుదుగా వస్తుంది. సాధారణంగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రతిపక్షాలన్నీ కూడబలుక్కుని అధికార పక్షంపై ప్రజావ్యతిరేకత పెంచటానికి శాయశక్తులా కృషిచేస్తాయి. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాల్ని తిప్పికొడుతూ.. ప్రజల్లో సానుకూలతను కాపాడుకోవడం పవర్లో ఉన్న పార్టీకి సవాల్. ఆ సవాల్‌ను సమర్థవంతంగా కాచుకున్న పార్టీనే మరోసారి అధికార ఉట్టి కొట్టగలుగుతుంది. ఇప్పుడంటే మున్సిపోల్స్ జరిగే నాటికి కాంగ్రెస్ రెండేళ్ల పాలనే పూర్తిచేసుకుంది. ఇంకా మూడేళ్ల పాలన మిగిలి ఉంది కాబట్టి.. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్ ఉన్నా.. టైముంది కదా అని ఓటర్లు సరిపెట్టుకోవచ్చు. కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇలా కుదరదు. అప్పుడు చెప్పినవన్నీ చేసి చూపించాం అని చెప్పుకునే స్థాయిలో ఉండాల్సిందే. అలాగే గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి సాధికారికంగా చెప్పుకోగలగాలి. ఆ అంశాల్లో ప్రతిపక్షాల నుంచి దూసుకొచ్చే విమర్శలకు ఎక్కడికక్కడ కౌంటర్ ఇవ్వగలిగాలి. అప్పుడే విజయాల ఊపు కొనసాగుతుంది. అలాగే ప్రజల్లో సానుకూలత కొనసాగించటానికి.. రాబోయే మూడేళ్లూ సరైన కార్యాచరణ తీసుకోవడమే కాంగ్రెస్ విజయావకాశాల్ని పెంచుతుంది.
ఇప్పటివరకు కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనకు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు పోలిక పెడుతూ.. ఓటర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇదే ఒరవడి కొనసాగాలంటే.. ఆ సానుకూలత అలాగే ఉండేలా నడుచుకోవాలి. పరిపాలన కూడా ఇదే విధంగా కొనసాగాలి. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దిద్దుకోవాలి. అన్నింటికీ మించి ఇప్పటిలాగే ఎప్పటికప్పుడు పార్టీతో సమన్వయం చేసుకోవాలి. పార్టీ, ప్రభుత్వానిది ఒకటే మాటగా కొనసాగడం కీలకం. అప్పుడే క్యాడర్ కూడా ఇప్పటిలాగే మెరుగైన సమన్వయంతో పనిచేస్తారు. నేతలూ కలిసికట్టుగా కృషి చేసి.. మంచి ఫలితాలు సాధిస్తారు. ఓవరాల్‌గా ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఈ జోష్ కొనసాగించటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వరుస విజయాలు వస్తున్నప్పుడే కాస్త నేల మీద నిలబడాలి. క్షేత్రస్థాయి వాస్తవాలు గమనంలోకి తీసుకోవాలి. ఎక్కడా అతి అంచనాలకు పోకుండా.. వాస్తవ బలాబలాలేమిటో ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ.. హత్యలుండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ పరంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వపరంగా చేయగలిగిన పనులన్నీ చేసేసి.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సిద్ధపడాలి. అంతకుముందే వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సాధికారిక విజయంపై కన్నేసి వ్యూహరచన చేయాలి. జీహెచ్ఎంసీ కోసం ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుని, పని విభజన చేసుకుని.. సమష్టిగా కదలాల్సిన సందర్భమిది. ఇప్పుడు ఏమరుపాటుగా ఉంటే.. ప్రతిపక్షాలకు చేజేతులా అవకాశం ఇచ్చినట్టవుతుంది. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడాలి. మున్సిపోల్స్ ఫలితాల్ని బట్టి ప్రజాభిప్రాయంపై ఓ అంచనాకు రాకుండా.. కాస్త విజయోత్సాహం తగ్గిన తర్వాతైనా.. క్షేత్రస్థాయిలో ప్రజల ఉద్దేశాలు, మనోభావాలు ఎలా ఉన్నాయో క్యాడర్ ద్వారా తెలుసుకోవాలి. అలా వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా కార్యాచరణ తీసుకుని.. పనిచేయాలి.
ఇప్పటివరకు పంచాయతీలు, పురపాలక ఎన్నికల ద్వారా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కలిసికట్టుగా పనిచేశారు. అక్కడ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను, పార్టీ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులపై పడింది. అందుకే .. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం.. కాలికి బలపం కట్టుకొని ఇంటింటికి తిరిగి.. తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సి వచ్చింది. నాయకులకు, పార్టీకి వ్యక్తిగతంగా పార్టీపరంగా.. కేడర్ డెవలప్ కావడం.. స్థానిక సంస్థల ఎన్నికల వల్ల జరిగిన అతిపెద్ద ప్రయోజనం. ఈ ప్రయోజనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడమే ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉంటుందని.. సీఎం పదే పదే ఆత్మవిశ్వాసంతో మాట్లాడటంలో.. తప్పేమి లేదు. దానికి కారణం.. కింది స్థాయినుంచి పార్టీ బలోపేతం కావడమే. లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితాలవల్ల.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆత్మవిశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతాయి. దీన్ని బేస్‌గా చేసుకొని మున్ముందు.. బలంగా పనిచేసుకుంటూ వెళ్లడానికి అవకాశముంటుంది.
ఏ విషయంలో అయినా కీడెంచి మేలెంచటం మంచిదంటారు. రాజకీయాలకు ఈ సూత్రం మరింత బాగా వర్తిస్తుందని అన్ని పార్టీలూ ఒప్పుకునే విషయమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెల్చిన స్థానాల కంటే ఓడిన స్థానాలపై ఫోకస్ పెట్టి.. ఎందుకు ఓడామో ఆత్మపరిశీలన చేసుకుంటే.. పార్టీ బలహీనతలు అవగతమౌతాయి. అప్పుడు భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన కూడా తేలికవుతుంది. నిజానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ వరుస విజయాల వెనుక వ్యూహం ఇదేననే వాదన కూడా లేకపోలేదు. అందుకే కొన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ వ్యూహమేమిటో కూడా అంతుబట్టలేదనే విశ్లేషణలున్నాయి. అదే నిజమైతే.. ఇకపైనా అదే ప్లాన్ ప్రకారం వెళ్తే మరింత ప్రయోజనం దక్కవచ్చు.
బలాల మీద అతినమ్మకంతో బలహీనతల్ని లైట్ తీస్కునే పోకడ కంటే.. బలహీనతల్ని బలాలుగా మార్చుకునే వ్యూహమే ఎప్పుడూ పైచేయి సాధిస్తుంది. కాంగ్రెస్ కూడా ఇదే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తే.. ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఈ విజయాన్ని చూసి పొంగిపోకుండా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సమీక్షా సమావేశాల్లో అభిప్రాయపడుతున్నారు. మెజార్టీ స్థానాలు గెలిచినంత మాత్రాన అసలు పార్టీ పరంగా సమస్యలే లేవని కాదు. వాటిని అధిగమించి గెలిచామని మాత్రమే అనుకోవాలని అంటున్నారు. ఆ విషయాన్ని ఎవరైనా కొట్టిపారేయటానికి వీల్లేదు. పంచాయతీ ఎన్నికల విజయంతో పొంగిపోకుండా జరిగిన పొరపాట్లు దిద్దుకోబట్టే.. మున్సిపోల్స్‌లో కాంగ్రెస్ కు ఈ స్థాయి విజయం దక్కిందని గాంధీభవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు మున్సిపోల్స్ విజయానికి ఉబ్బితబ్బిబ్బు కాకుండా.. జరిగిన పొరపాట్లను దిద్దుకోవటంపై దృష్టి సారిస్తే.. కాంగ్రెస్ కు భవిష్యత్తులోనూ విజయాలు దక్కుతాయనడంలో సందేహం లేదు.
ఇప్పటికైతే తామేం చేశామో.. ఇంకా ఏం చేయాలో కాంగ్రెస్ కు కచ్చితమైన ప్రణాళిక ఉంది. క్యాబినెట్ అంతా ఒక్కతాటిపై నడుస్తోంది. సీఎం నాయకత్వంలో అందరూ సమష్టి కృషిని నమ్ముకుంటున్నారు. దీనికి సమాంతరంగా గాంధీభవన్ కేంద్రంగా పార్టీ కూడా ఒక్కతాటిపైకి వచ్చింది. ఎక్కడైనా చిన్న చిన్న తేడాలున్నా.. అగ్రనేతలు సముదాయిస్తున్నారు. ఇప్పటికీ కొందరు నేతల్లో అలక ఉన్నా.. వారు కూడా ఎన్నికల సమయానికి పార్టీ విజయమే పరమావధిగా పనిచేసేలా చూసుకోవాలనే సంకల్పం కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. ముందు సంకల్పం బాగుంటే.. తర్వాత పని అదే జరుగుతుందంటారు. అలా చూసుకుంటే.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సంకల్పం గట్టిగానే ఉంది. ఇక అందుకు అనుగుణంగా కార్యాచరణే రూపుదిద్దుకోవాలి. నేతలు, క్యాడర్ మున్సిపోల్స్ విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించిన తర్వాత మరోసారి గాంధీభవన్‌లో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతుందని, అప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై అగ్రనేతలు దిశానిర్దేశం చేస్తారని కాంగ్రెస్ లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
గత రెండేళ్లలో కాంగ్రెస్ కేవలం తన వ్యూహాల అమలుపైనా దృష్టిపెట్టలేదు. అటు ప్రతిపక్షాల ఎత్తుగడల్ని కూడా గమనిస్తూ.. వాటిని ఎప్పటికప్పుడు సమర్థంగా కౌంటర్ చేస్తూ వచ్చింది. ఇకపై కూడా అదే వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం వరుస ఓటములతో డీలాపడిన ప్రతిపక్షాలు.. తమకు ఒక్క ఛాన్స్ రాకపోతుందా అని చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నాయి. వాటికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా.. ప్రజల్లో సానుకూలతను కొనసాగించుకుంటూ రావడమే కాంగ్రెస్ చేయాల్సిన మొదటి పని. ఇక్కడ కేవలం పనులు చేయడమే కాదు.. చేసిన పనులు ఎలా జరిగాయో.. చేయాల్సిన పనులు ఎందుకు చేయలేకపోయారో కూడా ఎప్పటికప్పుడు ప్రజలు కన్విన్స్ అయ్యేలా చెప్పడం కూడా కీలకమే. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు సరైన కమ్యూనికేషన్ ఉంటే.. చాలాసార్లు విజయం తేలికగా సాధ్యమౌతుంది. ఎన్నోసార్లు ఆ కమ్యూనికేషన్ లోపమే.. అధికార పార్టీల పుట్టి ముంచిందనే సంగతి కాంగ్రెస్ కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏతావాతా మున్సిపోల్స్ విజయంతో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని సరైన దిశగా ఉపయోగించుకోవడం, క్షేత్రస్థాయిలో బలపడ్డ క్యాడర్‌ను సరైన ప్రణాళికతో కార్యోన్ముఖుల్ని చేయడం.. కాంగ్రెస్ ముందున్న తక్షణ కర్తవ్యాలు. ఒక్కసారి ఈ రెండు పనులు గాడిన పడ్డాయంటే.. అప్పుడు కాంగ్రెస్ కు తిరుగుండదనే అభిప్రాయాలున్నాయి. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.