Chairman’s Desk: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడూ డైనమిక్ మార్కెట్టే. చాన్నాళ్ల పాటు ముందడుగే కానీ.. వెనకడుగు లేకుండా సాగిన చరిత్ర దీనికి ఉంది. అయితే గత నాలుగైదేళ్లుగా మాత్రం మార్కెట్లో స్తబ్ధత ఏర్పడింది. మొదట్లో రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్‌కు సర్కారు మారటమే కారణమనే తప్పుడు ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒడుదుడుకులకు.. రేవంత్ సర్కారుకు ఏమీ సంబంధం లేరు. ఇక్కడ 2022 నుంచే ఎన్టీవీ మార్కెట్ బాగాలేదని చెబుతూనే ఉంది. అసలు రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ప్రభుత్వాలపై ఆధారపడదు. అలాగైతే ఏపీలో స్థిరమైన సర్కారే ఉంది. చంద్రబాబు సమర్థతపైనా ఎవరికీ సందేహాల్లేవు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకోలేదు. ఏపీలో రియల్ ఎస్టేట్‌కు గ్లోబల్ మార్కెట్ లేదు. లోకల్ గా కొనుగోలు శక్తి లేదు. అందుకు భిన్నంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు గ్లోబల్ మార్కెట్ ఉంది. కొనుగోలు శక్తి కూడా ఎక్కువ. అందుకే మార్కెట్ పడిపోయినా.. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందా అని ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి సానుకూల పరిస్థితులు రాగానే మళ్లీ కొనటానికి రెడీ అవుతారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మూడేళ్ల తర్వాత రియాల్టీకి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ రియల్ మార్కెట్లో కదలిక వచ్చి.. పూర్వవైభవం దిశగా సాగుతోంది. ఈ పునరుత్థానానికి వేర్వేరు కారణాలు కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపనతో పాటు అక్కడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం.. పెట్టుబడిదారుల్ని విశేషంగా ఆకర్షించింది. ఇక ట్రిపుల్ ఆర్, మెట్రో రెండోదశ విస్తరణ పనులు కూడా సమాంతరంగా ప్లాన్ చేశారు. దీంతో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో సర్కారు కేవలం మాటలు చెప్పడం కాదు.. నిర్మాణాత్మక వైఖరికి కట్టుబడిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఇక ఇటీవలి జరిగిన మరో పరిణామం ఏంటంటే.. జీహెచ్‌ఎంసీలో శివారు మున్సిపాల్టీలను కలుపుతూ బృహత్ నగరం ఏర్పాటుకు ముందడుగు పడింది. దీంతో ప్రధాన నగర విస్తరణ జరిగి.. శివారు ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల పెంపుతో.. రియాల్టీ డిమాండ్ కు ఊతమిచ్చే పరిస్థితి ఏర్పడింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో సరికొత్త ఆర్థికవ్యవస్థను హైదరాబాద్ కు పరిచయం చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన, అందుకోసం ఇప్పటికే విడుదల చేసిన దశల వారీ అభివృద్ధి ప్రణాళిక కూడా రియల్ ఎస్టేట్ వర్గాలను ఆకర్షిస్తున్నాయి.
గత రెండేళ్లలో డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పుడు కార్యరూపం దాల్చే సమయం వచ్చింది. దీంతో హైదరాబాద్ కు కొత్త ఉద్యోగాలు, కొత్త కంపెనీలు వరుస కట్టనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఇళ్లు, ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగటం ఖాయం. అందుకోసం రియల్ ఎస్టేట్ వర్గాలు కూడా ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. గ్లోబల్ సమ్మిట్ పుణ్యమా కేవలం ఐటీ, ఫార్మా రంగాలే కాకుండా.. మిగతా రంగాల నుంచి కూడా పెట్టుబడులు వెల్లువెత్తుతాయని తేలిపోయింది. అందుకు తగ్గట్టుగా కమర్షియల్ స్పేస్‌కూ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి శకునములే అని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. వివిధ ప్రాజెక్టుల రూపకల్పనలో అవి బిజీగా ఉన్నాయి. ఇప్పటికే సానుకూల సంకేతాలను అందిపుచ్చుకుని చకచకా నిర్మాణాలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ను కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పెడుతూ సర్కారు ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ అన్ని వర్గాలనూ బాగా ఆకర్షించింది. కోర్ అర్బన్ రీజియన్ కు ఆనుకుని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ రీజియన్ ఎకానమీకి కూడా ప్రణాళికలు రచించారు. దీంతో ఇన్నాళ్లూ హైదరాబాద్ కే పరిమితమైన రియల్ ఎస్టేట్ వృద్ధి.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు. దీనికి తోడు సమ్మిట్‌లో ప్రపంచ దిగ్గజాల నోట హైదరాబాద్ పై ప్రశంసలు వినిపించటం.. మరోసారి సిటీపై ప్రపంచం దృష్టి పడేలా చేస్తుందనే విశ్వాసం రియాల్టీ వర్గాల్లో పెరిగింది.
రియల్ ఎస్టేట్ రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, అస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్‌పల్లి. కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికి రికార్డ్ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలే కోకాపేటలో ఎకరం రూ.175 కోట్లు పలకటం కూడా రియల్ ఎస్టేట్‌లో జోష్ పెంచింది. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క చదరపు అడుగు కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చదరపు అడుగుల నివాస స్థలానికి డిమాండ్ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం కూడా ఏర్పడుతుంది. దీనికి తోడు ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తర ణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30-50 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ కు ప్రణాళికలు చేసింది. త్రిబుల్ ఆర్తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటి మెరుగవుతుంది. ఇంటర్ ఛేంజ్‌లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులతో వాణిజ్య కార్యకలాపాలు పెరగటం కూడా రియాల్టీకి కలిసొచ్చే అంశమే.
హైదరాబాద్‌లో గడచిన నాలుగేళ్ల నుంచి లక్షన్నర యూనిట్లు అమ్మకాల్లేక ఖాళీగా పడివున్నాయి. నిర్మాణాలు బాగా స్లో అయ్యాయి. వున్న అపార్టుమెంట్లు సేల్ అవక.. కొత్తవి నిలిచిపోయాయి. బిల్డర్లు క్రమంగా ఒక మెట్టు దిగి, అధిక లాభాలు తగ్గించుకుని ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రేటుకి అపార్టుమెంట్లు అమ్మడంతో, జనం నిదానంగా ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు బాగా వస్తుండటంతో, చాలామంది సెకండ్ ఇన్వెస్ట్‌మెంటుకి వెళ్తున్నారు. పైగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై అంచనాలు బాగుండటం.. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే పెరుగుతున్న అనుకూలతలు కూడా రియాల్టీ వర్గాల ఆలోచనను మార్చేశాయి. మరీ ముఖ్యంగా గత రెండేళ్లలో ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో బయటపడుతున్న ప్రతికూతలు.. మరోసారి అందర్నీ హైదరాబాద్ వైపు చూసేలా చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్న ల్యాండ్ బ్యాంక్, వాతావరణం.. అన్నీ కేవలం హైదరాబాద్ కే ప్రత్యేకమైన సానుకూలతలు. వీటిని ఎవరూ కాదనలేరు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ని మించింది లేదు. సువిశాలంగా విస్తరించటానికి ఉన్న హైదరాబాద్ కి ఉన్న అవకాశం..ఓ వరంగా మారింది. ఇక కల్చరల్ గా ఎన్నో సంస్కృతుల కలయిక..హైదరాబాద్ ని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయినవారు కనిపిస్తారు. పైగా ఇంత ముందంజలో ఉన్న నగరంలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఇక్కడ నెలకు పదివేలు సంపాదించేవారు కూడా ప్రశాంతంగానే బతికే అవకాశం ఉంది. ఇక చెన్నైలాంటి నగరాలకు ఉన్నట్టు తాగునీటికి కూడా ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ కలిసి హైదరాబాద్ ని దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాయి. ఏపీలో రియల్ ఎస్టేట్ పూర్తిగా నిరాశాజనకంగా ఉండటం.. హైదరాబాద్‌లో ఒక రూపాయి పెడితే.. రెండేళ్లలో అది రెండ్రూపాయలు అవుతుందని భరోసా రావడం.. ఎక్కువ మంది ఏపీలో కంటే, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడానికి అసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ ఏపీ ప్రజాప్రతినిధులు వీకెండ్‌లో హైదరాబాద్‌కు క్యూ కట్టడం చూసి.. ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యులు కూడా హైదరాబాద్ భవిష్యత్తుకు తిరుగులేదనే నిర్ణయానికి వస్తున్నారు. దీంతో ఇప్పటికే హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న ఏపీ యువత కూడా అమరావతి అభివృద్ధి కోసం ఎదురుచూసే బదులు.. ముందు హైదరాబాద్ లో ఇళ్లు కొనుక్కుని సెటిలైతే బెటరనే ఆలోచన చేస్తున్నారు. ఈ పోకడ కూడా హైదరాబాద్ రియల్ మార్కెట్ కు ఊతమిచ్చేదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధర కంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు. ఇవి పెరగకపోగా… అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగో లుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే.. డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీనికి తగ్గట్టుగా నగర విస్తరణకు ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. కేవలం తాత్కాలిక ప్లాన్లతో సరిపెట్టకుండా.. రాబోయే యాభయ్యేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్ కు ఢోకా లేదనే నమ్మకం అంతకంతకూ పెరుగుతోంది. అసలీస్థాయిలో మరో నగరాభివృద్ధి గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్న పరిస్థితి లేకపోవడం కూడా.. భాగ్యనగరానికి కలిసొస్తోంది. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు పరంగా ఫోకస్ ఉన్న హైదరాబాద్ ను వదిలేసి.. మరో నగరం గురించో, ప్రాంతం గురించో ఆలోచించాల్సిన పనేంటనే ఆలోచన రావడంతో.. రియల్ ఎస్టేట్ వర్గాలు సంబరపడుతున్నాయి. దేశంలోని లగ్జరీ గృహ విక్రయాలలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ-ఎన్ సీఆర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు. చెన్నై కంటే భాగ్యనగరంలోనే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. లగ్జరీ గృహ విక్రయాలకు జాబ్లీహిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాలు హాట్ స్పాట్లు మారాయి. ఆయా ప్రాంతాల్లో రూ. 30-40 కోట్లు మధ్య ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు సైతం నమోదవుతున్నాయి. ఇలా అన్నిరకాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పురోగతి కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మార్కెట్ ఆశాజనకంగా లేదని నీరసపట్ట రియాల్టీ వర్గాలు.. ఇప్పుడు ఒకదానిక తర్వాత ఒకటిగా జరుగుతున్న సానుకూల పరిణామాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కదలిక వచ్చి పూర్వవైభవం దిశగా వెళ్తోంది. ఒక రెండేళ్ల పాటు ప్రస్తుత ట్రెండ్‌ను ఎవరూ చెడగొట్టకుండా ఉంటే చాలు. మళ్లీ పూర్వవైభవం చూస్తామని రియాల్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కానీ ఏమూలో వారికి ఓ చిన్న అనుమానం లేకపోలేదు. అదేంటంటే కడివెడు పాలను చిన్న విషపు చుక్క చెడగొట్టినట్టుగా.. రియల్ ఎస్టేట్‌లో సానుకూలతను.. కొందరు బిల్డర్లే పనిగట్టుకుని చెడగొడతారేమోనని భయపడుతున్నారు. ఎందుకంటే ఏ బిజినెస్ కు అయినా డిమాండ్, సప్లై సూత్రం వర్తిస్తుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే.. రేటు పెరుగుతుంది. సప్లై ఎక్కువగా రేటు తగ్గుతుంది. ఇది అందరికీ తెలిసిన సింపుల్ బిజినెస్ ట్రిక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు కూడా ఇదే సూత్రం అన్వయించొచ్చు. మొన్నటివరకు హైదరాబాద్ లో డిమాండ్ కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎప్పటికప్పుడు మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి.. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించేవాళ్లు బిల్డర్లు. కానీ గత మూడేళ్లుగా ఈ పరిస్థితి మారింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ మార్కెట్ స్థిరంగా ఉంది కదా అని.. డిమాండ్ ను ఎవరికి వారే ఊహించుకుని విచ్చలవిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ శివార్లు దాటేసి.. అవుటర్ రింగ్ రోడ్డు అవతల వరకూ వెళ్లిపోయారు. నిర్మాణ వ్యయం కూడా భారీగా పెంచేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లాంటి ప్రైమ్ ఏరియాలతో సమానంగా అవుటర్ రింగ్ రోడ్డు అవతల కూడా కొందరు ధరలు చెప్పారు. అదేమంటే ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలని ఊదరగొట్టారు. ఈ అతి పోకడలే రివర్సై.. స్తబ్ధతకు దారితీసింది. ఇప్పుడు సానకూలత వచ్చింది కాబట్టి.. పాత తప్పులు పునరావృతం చేయకుండా.. సమష్టిగా వ్యాపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే కానీ.. అనారోగ్యకర పోటీలకు పోయి.. ఎవ్వరికీ లాభం లేకుండా చేసే తీరు మంచిది కాదనే సూచనలు వస్తున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాల్సిందే. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు. కట్టే వాళ్లు ఉండాలి.. కొనేవాళ్లు ఉండాలి. ఇద్దరి మధ్యా అందుబాటులో ఉండటం అనే అంశం ఒకటి నిరంతరం కొనసాగాలి. అప్పుడే అటు స్థిరాస్థి సంస్థలు కళకళలాడతాయి. ఇటు జనం ఆశలు కూడా నెరవేరతాయి. జనానికి అందకుండా భూముల్ని ఆకాశంలోకి లేపితే ప్రయోజనమేంటి?. నగరం కేవలం ధనవంతులకోసమే కాదు.. అన్ని రకాల ఆదాయ వర్గాల వాళ్లూ ఉంటారు. అందరికీ ఓ సొంతిల్లు ఉండాలి. ఆ కల అందనిది అయిపోకూడదు. ప్రజల జీవనప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను.. ఇష్టారాజ్యంగా పెంచితే అసలుకే మోసం వస్తుందనే సంగతి ఇప్పటికే బిల్డర్లందరికీ అనుభవంలోకి వచ్చింది. ఏ మార్కెట్ అయినా మధ్యతరగతికి అందుబాటులో ఉంటేనే జోరు చూపిస్తుంది. కానీ కొన్నాళ్లుగా రియల్ మార్కెట్ మధ్యతరగతికి దూరమైందనే వాదన కూడా ఉంది. ఇప్పుడు సానుకూల సమయంలో.. మధ్యతరగతిని మరింతగా ఆకర్షించేలా బిల్డర్లు కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావడం సముచితంగా ఉంటుంది. ధరల విషయంలో రాజీధోరణి ప్రదర్శిస్తూ.. వ్యాపార చక్రం సజావుగా తిరిగేలా చూసుకోవడం ఏ రంగానికైనా కీలకం. రేట్లు ఒక్కసారి తగ్గించాల్సి ఉంటుంది. ఒక్కోసారి పెంచాల్సి ఉంటుంది. కానీ ఏ సందర్భంలో అయినా.. సగటు వ్యాపార పరిమాణంలో తేడా రాకుండా చూసుకోవడమే తెలివైన వ్యాపారుల లక్షణం. వ్యాపారం కంటే రేట్లే ముఖ్యమనే ఆలోచన ఎప్పుడైతే మొగ్గతొడిగిందో.. అప్పట్నుంచే రియల్ ఎస్టేట్ తడబడింది. సొంతిల్లు కోసం చూసేవారికంటే.. పెట్టుబడులు పెట్టేవారే రియల్ మార్కెట్ కు మహారాజపోషకులనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
అత్యాశకు పోయి.. వినియోగదారుల్ని బెదరగొట్టకుండా.. జాగ్రత్తగా బిజినెస్ చేయాలి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వెలిగిపోయిన దశలో అప్పటి బిల్డర్లు అనుసరించిన వ్యాపారసూత్రాలు, రచించిన ప్రణాళికల్ని ఓసారి గుర్తుకుతెచ్చుకోవాలి. సహజంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను చేజేతులా చెడగొట్టకుండా ఉంటే అదే పదివేలనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అనుకోని కారణాలతో నష్టం వస్తే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ స్వీయ తప్పిదాలతో తమ గొయ్యి తామే తవ్వుకునే వారిని ఎవరూ బాగుచేయలేరని ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి. బిల్డర్లు అత్యాశకు పోయి, కస్టమర్లను భయపెట్టకుండా, రూపాయికి పది రూపాయలు లాభం ఆశించకుండా, పద్ధతిగా అమ్మకాలు చేస్తే.. త్వరలోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదుట పడుతుంది. అలా కాదని.. అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. రియల్ మార్కెట్ మళ్లీ కుదేలయ్యే ప్రమాదం ఉంది. మొన్నటివరకూ రియల్ స్తబ్ధత కారణంగా చిన్నా, పెద్దా బిల్డర్లందరికీ ఇబ్బందులు తప్పలేదు. సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి అంటారు. కష్టాలు మాత్రం కామన్. మరి ఈ కష్టకాలం అయినా బిల్డర్లలో ఐకమత్యం తెచ్చిందా.. లేదా అనే విషయం ఇప్పుడు తేలిపోతుంది. మొన్నటిదాకా రియల్ స్తబ్ధతకు రకరకాల కారణాలు చెప్పారు. ఇతరులపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు. అంతేకానీ స్వీయ లోపంబులెరుగుట కూసువిద్య అనే సంగతి మర్చిపోయారు. ఇప్పుడు బిల్డర్లు చెప్పిన చాలా సాకుల ఉనికే లేదు. ముఖ్యంగా ప్రభుత్వం గురించి బిల్డర్లు చేసిన తప్పుడు ప్రచారం ఎదురుతన్నింది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వాలతో సంబంధం ఉండనది సీనియర్ బిల్డర్లు మొదట్నుంచీ చెబుతూనే ఉన్నారు. ఏ ప్రభుత్వమూ పనిగట్టుుకుని రియల్ ఎస్టేట్ రంగాన్ని పెంచాలనో.. తగ్గించాలనో ప్రయత్నించదని గుర్తుచేస్తున్నారు. కేవలం ప్రభుత్వ విధానాల్ని అందిపుచ్చుకోవడంలోనే రియాల్టీ వృద్ధి ఉంటుందనే వాస్తవం గమనించాలని హితవు చెబుతున్నారు. మరో సంగతి ఏమిటంటే రియల్ మార్కెట్ కు సానుకూలత ఏర్పడటంతో.. బిల్డర్ల పాత్ర చాలా తక్కువే. కనీసం ఈ సానుకూలతను మరింత ముందుకు తీసుకెళ్లడంలో అయినా తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది. ఇదీ ఈ వారం ఛైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.