Reliance Jio: దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవల్లో అంతరాయం కలిగింది. నెట్‌వర్క్ డౌన్ కావడంతో జియో ఇంటర్నెట్, కాల్స్, ఫైబర్ సేవలు నిలిచిపోయాయని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్‌లో సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో నెట్‌వర్క్ నుంచి కాల్స్ చేసుకునేందుకు, మాట్లాడేందుకు కుదరట్లేదని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్‌లు పంపించేందుకు నెట్‌వర్క్ పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ కాల్ వాడుకుంటున్నారు.
Read Also: NIA Raids: గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్.. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు
దేశంలోని ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన యూజర్ల నుంచి ముఖ్యంగా జియో నెట్‌వర్క్‌లో సమస్యలు ఏర్పడాయి. డౌన్ డిటెక్టర్ పోర్టల్ వివరాల ప్రకారం.. 37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావడం లేదని.. 37 శాతం మంది కాల్స్, ఎస్ఎంఎస్‌లు చేసుకోలేకపోతున్నట్టు వివరించారు. అటు 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్‌లోనూ సమస్యలు ఉన్నట్లు వాపోయారు. కాగా సాధారణ కాల్స్‌కే దిక్కు లేదు కానీ 5జీ సేవలను అందించేందుకు ఎలా ప్లాన్ చేస్తారని జియో యాజమాన్యాన్ని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ముందు నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా జియో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Also: Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?