GST On Online Gaming: మనం వాడే దాదాపు అన్ని వస్తువులపై పన్నును విధిస్తున్నారు. వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్‌టీ) పేరుతో పన్నును విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జీఎస్‌టీ కేంద్రం(సెంట్రల్)తోపాటు స్టేట్(రాష్ట్రం) కూడా పన్ను రూపంలో విధిస్తున్నాయి. వీటికి తోడు ఇకపై ఆన్‌లైన్ గేమింగ్‌పై కూడా పన్ను విధించనున్నారు. ఆన్‌లైన్ క్రీడలపై పన్ను విధించడానికి సంబంధించిన సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో ఆన్‌గేమింగ్‌పై ఇక జీఎస్‌టీని విధించనున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్నుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై (Online Gaming) 28 శాతం పన్ను విధించాలని ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ (GST council) సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
Read also: Bholaa Shankar: పొరపాటున కూడా థియేటర్ విజిట్ కు రావద్దు మెహర్ అన్నా..
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు మరియు క్యాసినోలలో బెట్టింగ్‌ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017 మరియు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్, 2017కి సవరణలు కోరుతూ శుక్రవారం లోక్‌సభ బిల్లును ఆమోదించింది. లోక్‌సభలో జీఎస్‌టీ సవరణ బిల్లుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యులు అధిర్ రంజన్ చౌదరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్య కేంద్రం వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇంటిగ్రేటెడ్ వస్తుసేవల పన్ను (సవరణ) బిల్లు 2023లకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకురావాలనుకున్న బిల్లులను అన్నింటిని పార్లమెంటులో ప్రవేశపెట్టినట్టు అయింది. ఇప్పటికే కీలక బిల్లులను ఆమోదించుకున్న కేంద్రం.. వర్షాకాల సమావేశాల చివరి రోజు ఈ సవరణ బిల్లును తీసుకువచ్చింది. రాజ్యసభలో కూడా జీఎస్‌టీ సవరణ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రాల శాసనసభలు కూడా GST చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జీఎస్‌టీ ఎంత అనేది స్పష్టం అవుతుంది.