Sridhar Vembu: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. ఆయన చర్యలపై స్వదేశంతో పాటు విదేశాల్లోను వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్రీధర్ వెంబు అమెరికా సర్కార్ హెచ్1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడంపై స్పందించారు. ఆయన వీసా ఫీజు పెంపును భారతదేశ విభజనతో పోల్చారు. అవసరమైతే మన వాళ్లు వెనక్కి వచ్చేసి.. ఐదేళ్ల సమయం తీసుకొని అయినా స్వదేశంలో సరైన జీవితాలను పునర్ నిర్మించుకోవాలని సూచించారు.
అమెరికాలో కొన్నేళ్లపాటు శ్రీధర్ వెంబు కూడా ఉద్యోగం చేసి తిరిగి భారత్‌కు వచ్చేశారు. ఆ తర్వాతనే ఆయన భారత్‌లో జోహో అనే కంపెనీ స్థాపించింది. ఇది సాస్ రంగంలో ప్రముఖమైన సంస్థగా ఎదిగింది. తాజా H-1B వీసా సంక్షోభం భారత్‌కు చెందిన ప్రతిభావంతులకు టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో పోలిస్తే దేశంలో అవకాశాలు పెరిగాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొంటే గొప్పగొప్ప ఆవిష్కరణలను సృష్టించవచ్చని చెబుతున్నారు.
ఆయన స్పందింస్తూ.. ‘‘నా సింధీ ఫ్రెండ్స్ నుంచి చాలా విషయాలు తెలుసుకొన్నాను. వారు దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో అన్ని వదిలి భారత్‌కు వచ్చారు. ఇక్కడే వారి జీవితాలను తిరిగి నిర్మించుకొన్నారు. తర్వాత కాలంలో వాళ్లు బలంగా పుంజుకొని సరికొత్త జీవితాన్ని సృష్టించుకున్నారు. అలాగే హెచ్1బీ వీసాలతో అమెరికాలో జీవిస్తున్న వారు కూడా అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఇదే సరైన సమయం అవసరం అయితే తిరిగి ఇంటికి వచ్చేయండి. మీ జీవితాలను పునర్ నిర్మించుకోవాలంటే ఐదేళ్ల సమయం పట్టొచ్చేమో. కానీ అది మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. భయంలో జీవించవద్దు. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. మీరు బాగా రాణించగలరు’’ అని ఆయన పోస్ట్ చేశారు.
READ ALSO: Maldives Tourism Threat: మాల్దివులు మాయం కానుందా? ముప్పు ముంగిట ప్రముఖ పర్యాటక ప్రాంతం!