Paytm: డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దని ఆదేశించగా.. ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచుతూ ఊరటనిచ్చింది. తాజాగా పేటీఎంకి మరో ఊరట లభించింది. పేటీఎం యాప్ UPI లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదాను ఇచ్చే అంశాన్ని పరిగణించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సూచించింది.
Read Also: Most Expensive Maggie : ఈ మ్యాగీ చాలా ఖరీదైనది.. ఎందుకో తెలుసా?
‘@paytm’ ఐడీతో యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తున్న వారికి డిజిటల్ చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ హోదా ఇచ్చే అంశాన్ని ఎన్‌పీసీఐ పరిశీలించనుంది. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది. ఒక వేళ థర్డ్ పార్టీ స్టేటస్ ఇస్తే పేటీఎం యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ చేసే వీలు కలుగుతుంది. అలాగే, పేటీఎంను ఇతర బ్యాంకులకు మార్చుకునేందుకు వీలుగా అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సామర్థ్యం కలిగిన నాలుగైదు బ్యాంకులకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు సర్టిఫికేషన్ ఇవ్వాలని కోరింది.