సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వరుసగా 11వ సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం వల్ల ఇండ్ల కొనుగోలుదారులకు తక్కువ వడ్డీరేట్లకే ఇంటి రుణాలు లభించనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ముగిసిన ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. రెపో, రివర్స్‌రెపో రేట్లతోపాటు అన్ని రకాల వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.
వచ్చే ఏడాది మార్చి (2023 మార్చి 31) నెలాఖరు వరకు హోంలోన్ నిబంధనలను హేతుబద్ధీకరిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ఇంతకుముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 అక్టోబర్‌లో రిస్క్ వెయిట్స్‌ను హేతుబద్ధీకరించింది. 2022 మార్చి నెలాఖరు వరకు ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) విలువ 80 శాతం అంతకంటే తక్కువ ఉంటే, రిస్క్ వెయిట్ 35 శాతం.. 80 శాతానికి పైగా / 90 శాతం ఎల్టీవీ ఉంటే రిస్క్ వెయిట్ 50 శాతం ఇస్తారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చే ఇండ్ల రుణాల కోసం పక్కన బెట్టే మొత్తం నిధులను రిస్క్ వెయిట్ అని పిలుస్తారు. రిస్క్ వెయిట్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు రుణాలివ్వడానికి ముందుకు రావు. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసింది. దేశీయంగా ఇంధన, కమొడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం
గమనార్హం.