భారత్‌లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ దాటేశాయి.. అసలే కరోనా కష్టాల్లో ఈ పెట్రోల్, డీజిల్ పై వరుసగా వడ్డింపులు ఏంటి? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, పెట్రో ధరలు మాత్రం ఇప్పుడు తగ్గడం సంగతి అటుంచితే.. వడ్డింపు కూడా తప్పదనే తరహాలో వ్యాఖ్యలుచేశారు.. కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించడం కుదరని స్పష్టం చేసిన ఆయన.. ప్రజలకు ఉపశమనం కల్పించలేమని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పడిపోయిందని.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయం తగ్గే సూచనలే కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు.. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగంపై చేయాల్సిన ఖర్చు పెరిగిపోతోందని.. దీంతో పాటు సంక్షేమ రంగంపై కూడా ఖర్చులు పెరిగిపోయాయని.. ఓవైపు ఆదాయం తగ్గడం.. మరోవైపు ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో.. పెట్రో ధరలు తగ్గించడం ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టంగా తెలిపారు. ఇక, భారత్‌లో పెట్రో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడమే కారణంగా తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్.