Mahatma Gandhi NREGS: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జులై నెలలో వర్క్ జనరేషన్ 50 శాతం పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుండటంతో కార్మికులు వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. రివర్స్ మైగ్రేషన్ తగ్గటం కూడా మరో కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లోనూ ఉపాధి హామీ పథకం కింద వర్క్ జనరేషన్ వరుసగా పెరిగి జులైలో ఒక్కసారిగా తగ్గింది.
రాష్ట్రాలకు ‘జీఎస్టీ’
వస్తు మరియు సేవల పన్ను పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం సుమారు 35 వేల కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఈ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వాలకు సెప్టెంబర్ చివరి నాటికి అందే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీఎస్టీ పరిహారం విలువ ఒకటీ పాయింట్ రెండు ట్రిలియన్ రూపాయలకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
India as Vishwa Guru again: ఇండియా మళ్లీ విశ్వ గురువు కావాలనే భావన.. ప్రతి భారతీయుడి హృదయ స్పందన..
వడ్డీ తగ్గింపు
చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వడ్డీ రేట్లను తగ్గించింది. ఏడాది లోపు వ్యవధి గల రుణాలపై కనీస వడ్డీలో కోత పెట్టింది. 2.85 శాతం నుంచి 2.75 శాతానికి సవరించింది. ఈ ఏడాది 5.5 శాతం జీడీపీ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు అదనంగా 6 వేల కోట్ల డాలర్ల మూలధనాన్ని అందించింది.
సానుకూలమే
ఈ నెలలో స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొననున్నాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం దిగొస్తుండటమే దీనికి కారణం. దీంతో మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలు రానున్నాయి. మన దేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం జులై నెలలో 7 శాతం లోపే నమోదైంది. గత నాలుగు నెలల్లో ఇంత తక్కువ ఇన్‌ఫ్లేషన్ ఉండటం ఇదే తొలిసారి. దీనికి భిన్నంగా సెన్సెక్స్ నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 59 వేల మార్కును తాకిన సంగతి తెలిసిందే.
సగానికి పైనే
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ నికర అప్పు 54 శాతం తగ్గింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 464 కోట్ల రూపాయల రుణం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం అప్పు వెయ్యి కోట్లకు పైనే ఉండగా ఇప్పుడు సగానికి పైగా తగ్గినట్లు సంస్థ తెలిపింది. ఎంబసీ గ్రూపుతో విలీన ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యువల్ సమీక్ష అనంతరం పూర్తవుతుందని పేర్కొంది.
ఈవీల కోసం..
ఇండియాలో విద్యుత్ వాహనాల అభివృద్ధితోపాటు గ్లోబల్ మార్కెట్‌లో వ్యాపార విస్తరణ కోసం మన మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ జర్మనీ సంస్థ వోక్స్‌వ్యాగన్‌తో చర్చలు జరుపుతోంది. మరో ఐదేళ్లలో రెండు లక్షల విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయాలని ఆశిస్తోంది. తద్వారా 2027 నాటికి సుమారు 50 వేల కోట్ల రూపాయల ఆదాయం పొందాలని భావిస్తోంది. ఈవీల కోసం ఈ సంస్థ ఇప్పటికే బిలియన్ డాలర్లకు పైగా ఖర్చుపెట్టడానికి కమిట్ అయింది.