GST Council Meeting 2025: దీపావళి అంటే టపాకుల పండుగ, అయితే ఈసారి మాత్రం డబల్ ధమాకా ఉండబోతుంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రకటించారు. సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉండేలా జిఎస్టి స్లాబుల్లో మార్పులు రానున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి రెండు రోజులపాటు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఈసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ వినియోగ వస్తువుల ధరలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల పన్ను, రాష్ట్రాల ఆదాయం వంటి అంశాలతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
READ ALSO: Women Empowerment: గుడ్ న్యూస్.. ప్రతి మహిళకు రూ.10 వేలు.. సక్సెస్ అయితే రూ.2 లక్షలు.. ఎక్కడంటే
ప్రస్తుతం భారత్లో జీఎస్టీ వ్యవస్థ..
2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు 5%, 12%, 18%, 28% అంటూ మొత్తం నాలుగు స్లాబులు అమలులోకి వచ్చాయి. ఐదు ఏళ్లపాటు రాష్ట్రాలకు ఆదాయ పరిహారం ఇవ్వడానికి ఒక ప్రత్యేక cess విధించారు. అయితే ఆ వ్యవస్థ 2022లో ముగిసిపోయింది. ప్రస్తుతం కేంద్రం 12%, 28% స్లాబులను రద్దు చేసి, కేవలం 5%, 18% స్లాబులతోనే వ్యవస్థను కొనసాగించాలన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అదనంగా, లగ్జరీ కార్లు, పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లు వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించే ఆలోచనలో ఉంది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, మందులు, సైకిల్, పెన్సిల్‌లు 5% స్లాబ్‌లోకి వస్తాయి. టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్స్ 18% స్లాబ్‌లోకి వస్తాయి. దీంతో రోజువారీ ఖర్చులు తగ్గుతాయి. ఇవి వినియోగదారులకు ఊరట కలిగించే అంశాలు.
8 రాష్ట్రాల ఆందోళన ఏంటి..
జీఎస్టీ విషయంలో కొత్తగా తీసుకునేటటువంటి నిర్ణయాలు రాష్ట్రాలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. పన్ను తగ్గింపుతో ఆదాయం పడిపోతుందని, నష్టపరిహారం తప్పనిసరిగా ఇవ్వాలని హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయంతో ప్లాన్ చేసుకున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఆర్థిక ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలకు ఈ సమస్య ఉంటుందని, మిగతా వాళ్లందరూ కలిసి రావాలని కోరుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై కీలక చర్చ..
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే లక్ష్యంతో కేంద్రం 5% జీఎస్టీ ప్రతిపాదిస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం రూ.40 లక్షల వరకు ధర గల వాహనాలపై 18% పన్ను ఉండాలని భావిస్తున్నాయి. మొత్తానికి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సాధారణ ప్రజలకు ధరల తగ్గింపుతో ఊరట ఇస్తుందా? లేక రాష్ట్రాల ఆదాయ లోటు సమస్యను పెంచుతుందా? అన్నది రెండు రోజుల సమావేశం తర్వాత తేలనుంది.
READ ALSO: Maratha Reservation: ‘మేము గెలిచాము’.. నిరాహార దీక్షను విరమించిన మరాఠా నాయకుడు