GO First Airlines: ఇండియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఫస్ట్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఎక్కడికైనా కేవలం రూ.1,199కే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు తక్కువ ధరకే అంతర్జాతీయ ప్రయాణం పొందవచ్చని సూచించింది. ఈ మేరకు రూ.6,599కే అంతర్జాతీయంగా విమాన టిక్కెట్లు పొందవచ్చని ట్వీట్ చేసింది. ఈ సేల్ ఈనెల 16 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటుందని.. ఈ టిక్కెట్లతో ఫిబ్రవరి 4 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో 8 నెలల కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
Read Also: Off The Record: నాని వార్ మొదలెట్టేశారా?
ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులకు సరసమైన, సౌకర్యవంతమైన విమాన ప్రయాణాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని గోఫస్ట్ ఎయిర్ సీఈవో కౌశిక్ ఖోనా వెల్లడించారు. ఈ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు ఫ్రీగా రీషెడ్యూలింగ్ సదుపాయాన్ని పొందుతున్నారని తెలిపారు. దీంతో పాటు ఉచిత రద్దు ప్రయోజనం కూడా పొందుతారని పేర్కొన్నారు. అంటే టికెట్ రద్దు చేసినా.. ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ చేపట్టిన ఈ సేల్‌లో 10 లక్షల కంటే ఎక్కువ సీట్లు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.