Flat Sizes: దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భారతదేశంలోని టాప్-7 నగరాల్లో సగటున ‘ఫ్లాట్ సైజ్’ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్, కోల్‌కతా రెండు నగరాల్లోనే ఫ్లాట్ సైజ్ తగ్గింది.
అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా పరిశోధన ప్రకారం.. న్యూ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, పూణే, చెన్నై నగరాల్లో 2022లో 1,175 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్ సగటున 2023లో 1,300 చదరపు అడుగులకు చేరినట్లు ఆదివారం తన పరిశోధనల్లో పేర్కొంది. పెద్ద ఇళ్ల కోసం డిమాండ్ పెరిగింది. కోవిడ్ మహమ్మారి కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. కోవిత సంవత్సరాల తర్వాత 2023 నుంచి గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.
ఏడు నగరాల్లో ఢిల్లీ గతేడాదిలో సగటున ఫ్లాట్ పరిమాణంలో అత్యధిక వృద్ధిని సాధించింది. 2022లో 1,375 చదరపు అడుగుల నుండి 2023లో 1,890 చదరపు అడుగులకు పెరిగింది. ఏకంగా 37 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఢిల్లీలో పెద్ద పరిమాణంలో గృహాలకు, ముఖ్యంగా లగ్జరీ అపార్ట్మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Read Also: Ayodhya Ram Temple: రామమందిరంపై యూఎన్‌కి పాకిస్తాన్ మొర.. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోగలదా.?
నివేదికలోని కీలక అంశాలు:
* భారతదేశంలోని టాప్-7 నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధిక ఫ్లాట్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 2023లో 2,300 చదరపు అడుగులతో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో 1,890 sq. ft.తో ఢిల్లీ రెండోస్థానంలో ఉంది.
* చెన్నై, బెంగళూర్ నగరాల్లో వరసగా ఫ్లాట్ పరిమాణాలు 1,260 మరియు 1,484 చదరపు అడుగులుగా ఉంది.
*2023లో సగటున ఫ్లాట్ పరిమాణం తగ్గిన నగరాల్లో ముంబై, కోల్‌కతా ఉన్నాయి.
* ముంబైలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 840 చదరపు అడుగుల నుండి 2023లో 794 చదరపు అడుగులకు తగ్గింది. ఇది 5 శాతం వార్షిక క్షీణతను సూచిస్తుంది. అయితే 5 ఏళ్ల వ్యవధిలో ముంబైలో సగటు పరిమాణాలు 2019కి సమానంగా 784 చ.అ.గా ఉంది.
*కోల్‌కతాలో, సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 1,150 చదరపు అడుగుల నుండి 2023లో 1,124 చదరపు అడుగులకు తగ్గి, 2% వార్షిక క్షీణతను చూసింది. ఐదేళ్ల కాలంలో, 2019 నుండి నగరంలో సగటు ఫ్లాట్ సైజులు 12% పెరిగింది.