Elon Musk Unveils Tesla’s First Heavy-Duty Semi-Trucks: ఎలక్ట్రిక్ కార్లలో రారాజుగా ఉన్న టెస్లా.. మరో అడుగు ముందుకేసింది. తన మొదటి హెవీ డ్యూటీ సెమీ ట్రక్కును గురువారం ఆవిష్కరించింది. టెస్లా నెవడా ఫ్లాంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ ట్రక్కును ఆవిష్కరించారు. ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేసిన ఘటన టెస్లాకే దక్కబోతోంది. బ్యాటరీతో నడిచే ఈ ట్రక్కు హైవేపై కర్భన ఉద్గారాలను తగ్గిస్తుందని ఎలాన్ మస్క్ అన్నారు. టెస్లా పూర్తిగా ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేస్తున్నామని ప్రకటించి ఐదేళ్లు గడిచింది. తాజాగా తన హెవీ డ్యూటీ సెమీని లాంఛ్ చేసింది. ఇదిలా ఉంటే కొంతమంది ఆటోమొబైల్ నిపుణులు మాత్రం బ్యాటరీ ఆధారంగా తయారైన ఓ ట్రక్కు వందల మైళ్లు భారీ బరువులను తీసుకెళ్తుందా..? లేదా..? అని సందేహిస్తున్నారు.
Read Also: Reliance Industries: భారతదేశంలో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్.. టాప్10 కంపెనీలు ఇవే..
గురువారం ఎలక్ట్రిక్ ట్రక్కును రివీల్ చేసి టెస్లా దాని ధరను మాత్రం ప్రకటించలేదు. 2017లో తాము ఎలక్ట్రిక్ ట్రక్కును తయారు చేస్తున్నామని టెస్లా ప్రకటించింది. 300, 500 మైళ్ల రేంజుతో ఈ ట్రక్కులు రానున్నట్లు తెలిపింది. పెప్సీకో కంపెనీ ఏకంగా 100 ఎలక్ట్రిక్ ట్రక్కులకు ఆర్ఢర్ ఇచ్చింది. పెప్సీకోతో పాటు యునైటెడ్ పార్సెల్స సర్వీస్, వాల్ మార్ట్ కంపెనీలు టెస్లా ట్రక్కులను ముందుగానే బుక్ చేసుకున్నాయి. నవంబర్ 15న ఫ్రీమాంట్ నుంచి శాన్ డియాగో మధ్య సెమీ ట్రక్కు 500 మైళ్ల పరీక్షను కంపెనీ విజయవంతంగా పూర్తి చేసిందని మస్క్ తెలిపారు. 1 మెగా వాట్ కరెంట్ తో దీన్ని ఛార్జ్ చేయవచ్చని, ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇందులో ఉందని మస్క్ తెలిపాడు.
ప్రస్తుతం ఆవిష్కరించిన ట్రక్ క్లాస్ 8 వాహనం, అంటే దాదాపుగా 33,001 పౌండ్ల(14.96 టన్నులు) కంటే ఎక్కువ సరుకును రవాణా చేసే అవకాశం ఉంది. 2017లో ట్రక్కును లాంచ్ చేసిన తర్వాత 2019లో ప్రొడక్షన్ చేయాలని టెస్లా భావించినప్పటికీ.. బ్యాటరీల కొరత కారణంగా టెస్లా ప్లాన్ ఆలస్యం అయింది. 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. డిజిల్ వాహనాలతో పోలిస్తే హెవీ డ్యూటీ సెమి ట్రక్కు మరింత శక్తివంతంగా ఉండనున్నట్లు టెస్లా ప్రకటించింది.