టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. మస్క్ ట్విటర్ ఫాలోవర్లలో సగానికి సగం మంది ఫేక్ అని వెల్లడైంది. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్‌కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో 48 శాతం మంది ఫేక్ అని తేలినట్లు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ ఖాతాల్లో ఎక్కువ స్పామ్, యాక్టివ్‌గా లేని అకౌంట్లు ఉన్నాయి. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరోను వినియోగించుకొని ట్విట్టర్ యూజర్ ఎవరైనా తన ఫాలోవర్ల ఖాతాల్లో ఎన్ని నకిలీవో తెలుసుకునేందుకు అవకాశం ఉంది.
కాగా మరోవైపు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా మార్చివేయాలని ఎలన్ మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌ను పునరుద్ధరించడంతో పాటు నిర్వహణలో కూడా మార్పులు తీసుకురావాలని మస్క్ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. డబ్బులను ఆర్జించే సరికొత్త మార్గాలను మస్క్ అన్వేషిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంటే ఒకే ట్వీట్‌ను మానిటైజ్ చేయడం… ఎక్కువగా వైరల్ అయినా లేదా ప్రత్యేక సమాచారం ఉన్న ట్వీట్ల ద్వారా డబ్బులు పొందేలా ట్విట్టర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.