టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా చరిత్రలోనే ఒక ఏడాదిలో అత్యధిక పన్ను చెల్లించనున్న వ్యక్తిగా ఎలన్ మస్క్ నిలవనున్నారు.
Read Also: టెస్లా కారుపై ఆగ్రహం… 30 కేజీల డైనమైట్‌తో…
అయితే ఎలన్ మస్క్ కట్టే పన్ను రూ.85వేల కోట్లు ఉంటే ఆయన సంపాదించే సొమ్ము ఎంత ఉంటుందో అంటూ పలువురు ఆరాలు తీస్తున్నారు. ఎలన్ మస్క్ ఇంతటి భారీ స్థాయిలో పన్ను కట్టడానికి ప్రధాన కారణం ఆయన తీసుకున్న స్టాక్ ఆప్షన్‌లు. టెస్లాలో ఇప్పటికే 15 మిలియన్‌ల స్టాక్ ఆప్షన్‌లను మస్క్ విక్రయించారు. దీంతో 53 శాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టెస్లాలో తనకున్న వాటాలో 10 శాతం విక్రయించాలని మస్క్ భావిస్తున్నారు. దీనిపై నెటిజన్‌ల అభిప్రాయాలు చెప్పాలంటూ ట్విట్టర్‌లో ఇటీవల పోల్ కూడా నిర్వహించారు.