Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో నిర్వహణ ఖర్చులు ఏకంగా 52 శాతం పెరగటం వల్లే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.
‘గంగవరం’ ప్రమోటర్లకు ‘అదానీ’ షేర్లు
గంగవరం పోర్ట్ లిమిటెడ్‌లోని అర్హులైన ప్రమోటర్లకు 4 కోట్ల 77 లక్షలకు పైగా షేర్లను కేటాయించాలని అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ నిర్ణయించింది. ఒక్కొక్కటి 2 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన వాటాలను ఇవ్వటానికి అదానీ పోర్ట్స్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో అదానీ పోర్ట్స్ ఈక్విటీ షేర్ల సంఖ్య 216 కోట్లను దాటుతోంది. షేర్ స్వాప్ ఒప్పందం ప్రకారం గంగవరం పోర్ట్స్‌లో 58 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్న అదానీ పోర్ట్స్ ఈ మేరకు స్టాక్స్‌ను కేటాయిస్తోంది.
ఇండోనేసియా స్టార్టప్‌లో ‘విప్రో’ పెట్టుబడి
విప్రో కన్జ్యూమర్ కేర్-వెంచర్స్ సంస్థ ఇండోనేసియా స్టార్టప్ ‘యువిట్’లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ స్టార్టప్.. పిల్లలతోపాటు పెద్దలకు కావాల్సిన న్యూట్రాస్యుటికల్ మరియు వెల్‌నెస్ ప్రొడక్టులను గమ్మీస్ ఫార్మాట్‌లో రూపొందిస్తోంది. ఇక మీదట వినియోగదారులకు రోజువారీ జీవనశైలికి అవసరమైన ప్రీమియం క్వాలిటీతో కూడిన సరసమైన ధరల్లో లభించే ఉత్పత్తుల తయారీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇదిలాఉండగా.. తాము ఒక సౌత్ ఈస్ట్ ఏసియా కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఇదే మొదటిసారని విప్రో కన్జ్యూమర్ కేర్ వెంచర్స్ ఎండీ తెలిపారు.
‘ఆకాశ’ దేశాన.. సెప్టెంబర్ మాసాన..
మన దేశీయ మార్కెట్‌లోకి కొత్తగా ప్రవేశించి పూర్తి స్థాయిలో సర్వీసులను ప్రారంభించిన మొదటి నెలలోనే ఆకాశ ఎయిర్ దాదాపు ఒక శాతం వాటాను సొంతం చేసుకుంది. సెప్టెంబర్‌లో వివిధ ఎయిర్‌లైన్స్ కనబరిచిన పనితీరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. సుమారు 12 ఎయిర్‌లైన్స్ గల ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్‌లో దగ్గరదగ్గరగా 58 శాతం వాటాతో ఇండిగో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భౌతికంగా దూరమైనా ఆకాశ ఎయిర్ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉందని, ఐదేళ్లలో 72 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో విస్తరించనుందని సీఈఓ వినయ్ దూబే చెప్పారు.
5 ఏళ్లలో.. 3 రెట్లు..
మన దేశంలో గడచిన ఐదేళ్లలో బయోఫ్యూయెల్స్ విక్రయించే పెట్రోల్ పంప్‌ల సంఖ్య 3 రెట్లు పెరిగిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. 2016-17లో 29 వేల 897 బయోఫ్యూయెల్ పెట్రోల్ పంపులు మాత్రమే ఉండగా ఈ సంఖ్య 2021-22లో 67 వేల 641కి చేరినట్లు చెప్పారు. ఇథనాల్ గిరాకీ 2025 నాటికి 10 బిలియన్ లీటర్లు దాటుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నాటికి ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని వెయ్యి కోట్ల లీటర్లుగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.
‘ఆతిథ్య రంగానికి అతిపెద్ద విజయం’
ఓయో, మేక్‌మైట్రిప్, గోఇబిబోలకు జరిమానా విధించటం ఆతిథ్య రంగానికి అతిపెద్ద విజయమని, వాటి ఆధిపత్య ధోరణికి చెంపపెట్టని ‘‘ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా’’ అభిప్రాయపడింది. మూడేళ్ల కిందట తాము ఇచ్చిన ఫిర్యాదులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. సరైన వ్యాపార విలువలను పాటించనందున CCI నిన్న బుధవారం మేక్‌మైట్రిప్, గోఇబిబోలకు కలిపి 223 కోట్లు, ఓయోకి 168 కోట్లు పెనాల్టీ వేసిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు కోల్పోయి 58835 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 77 పాయింట్లు తగ్గి 17434 వద్ద కొనసాగుతోంది. ఇండస్‌ఇండ్, షాపర్స్ స్టాప్, ఐటీసీ, ఎన్‌ఎల్‌సీ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.25 వద్ద ఉంది.