Business Flash: జొమాటో షేర్ల విలువ ఇవాళ భారీగా పతనమైంది. అనూహ్యంగా 14 శాతం పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1000 కోట్లు ఆవిరైంది. ఈ సంస్థ షేర్లు 2021 జూలై 23న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన సంగతి తెలిసిందే. 613 కోట్ల షేర్లకు ఏడాది లాకిన్ పీరియడ్ శుక్రవారానికే పూర్తయింది. శనివారం, ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావటంతో ఇవాళ సోమవారం స్వేచ్ఛగా ట్రేడింగ్ చేసుకున్న ఇన్వెస్టర్లు. జొమాటో షేర్లకు లాకిన్ పీరియడ్ ముగియటం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఆగస్టులోనూ ఈ సంస్థ షేర్ల లాకిన్ పీరియడ్ ముగిసింది. స్టాక్ మార్కెట్‌లో నమోదైన తర్వాత యాంకర్ పెట్టుబడిదారులకు కేటాయించే షేర్లను నిబంధనల ప్రకారం నెల రోజుల పాటు విక్రయించటానికి వీల్లేదు. అయితే ఆ గడువు కూడా ఇవాళ ముగియటంతో జొమాటో షేర్లకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కాలంలో ఒకానొక దశలో 169 రూపాయలకు చేరిన ఈ షేరు ఇవాళ జీవితకాల కనిష్టానికి (రూ.46కి) జారింది.
ఐసీఐసీఐ లాభం 6905 కోట్లు
ప్రైవేట్ రంగంలోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో రూ.6905 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే నెట్ ప్రాఫిట్ ఏకంగా 50 శాతం పెరిగింది. బ్యాడ్ లోన్లు తగ్గటమే తాజా లాభాలకు కారణమని పేర్కొంది. 2021లో ఇదే టైంలో నికర లాభం రూ.4616 కోట్లు మాత్రమే కావటం గమనార్హం.
read also: IAS Officers: ఐఏఎస్ ఆఫీసర్లు కావలెను.. దాదాపు 1500 మంది..
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఈ వారం తొలి రోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 516 పాయింట్లు పడిపోయి 55610 వద్ద ట్రేడింగ్ అయి 56018 వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 16,589 వద్ద ట్రేడ్ అయింది. చివరికి 88.45 పాయింట్లు నష్టపోయి 16,631 వద్ద ముగిసింది. నిఫ్టీలో కొన్ని సంస్థలు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆ లిస్టులో అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, బ్రిటానియా, యూపీఎల్, లార్సన్ అండ్ టూబ్రో తదితర కంపెనీలు ఉన్నాయి. రిలయెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. క్యూ1లో భారీ లాభాలను ప్రకటించిన ఇన్ఫోసిస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవటం ఆశ్చర్యకరం.